మానవుల మధ్యే కాదు.. జంతువుల మధ్యా అంతర్యుద్ధం
ఉగాండాలోని కిబాలే నేషనల్ పార్కులో 'న్గోగో' చింపాంజీల మధ్య దశాబ్దకాలంగా భీకర యుద్ధం జరుగుతోంది. ఒకప్పుడు కలిసిమెలిసి ఉన్న 200కు పైగా చింపాంజీల సమూహం 'సెంట్రల్', 'వెస్టర్న్' వర్గాలుగా విడిపోయి, సరిహద్దు పోరాటాలకు దిగాయి. ఆహార కొరత, నాయకత్వ మార్పులు వంటివి ఈ చీలికకు కారణం. ఇది మానవ సంఘర్షణల మూలాలను అర్థం చేసుకోవడానికి దోహదపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ఆధిపత్య పోరు, సరిహద్దు తగాదాలు, వర్గ పోరాటాలు.. ఇవి కేవలం మానవులకే పరిమితం అనుకుంటున్నారా.. ఉగాండాలోని కిబాలే నేషనల్ పార్కులో జరుగుతున్న ఒక సంఘటన శాస్త్రవేత్తలను సైతం నివ్వెరపరుస్తోంది. దీని గురించి తెలుసుకున్నాక మీరు కూడా షాకవుతారు. ఒకప్పుడు ఒకే కుటుంబంలా కలిసిమెలిసి ఉన్న చింపాంజీల సమూహం, ఇప్పుడు రెండుగా చీలిపోయి దశాబ్ద కాలంగా రక్తం ఏరులై పారిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద చింపాంజీల సమూహంగా పేరుగాంచిన ‘న్గోగో’ గుంపులో ఒకప్పుడు 200కు పైగా జీవాలు ఉండేవి. 2016 వరకూ ఇవి కలిసే ఉన్నాయి. కానీ ఆ తర్వాత ‘సెంట్రల్’, ‘వెస్టర్న్’ అనే రెండు వర్గాలుగా విడిపోయాయి. అప్పటి నుంచి ఈ రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా శత్రుత్వం పెరిగింది. మనుషుల సైన్యం లాగే ఇవి కూడా తమ సరిహద్దులను ఏర్పాటు చేసుకుని, గస్తీ కాస్తూ ప్రత్యర్థి వర్గంపై దాడులు చేస్తున్నాయి. ‘సైన్స్’ జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధన ప్రకారం, ఈ అంతర్యుద్ధం అత్యంత భీకరంగా సాగుతోంది. 2018 నుంచి ఇప్పటివరకు జరిగిన ఘర్షణల్లో 17 పిల్లలు సహా మొత్తం 24 చింపాంజీలు ప్రాణాలు కోల్పోయాయి. మరో 15 చింపాంజీలు గల్లంతయ్యాయి. ఈ ఘటనపై అధ్యయనం చేసిన ఆరోన్ శాండెల్ అనే పరిశోధకుడు పలు కారణాలను విశ్లేషించారు. భారీ సంఖ్యలో చింపాంజీలు పెరగడం, ఆహారం కోసం పోటీ ఏర్పడటం, సమూహాన్ని కలిపి ఉంచే పెద్ద వయసు చింపాంజీలు చనిపోవడం, నాయకత్వ మార్పులు వంటివి ఈ చీలికకు కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు. ఒకప్పుడు పరస్పరం ప్రేమను పంచుకున్న ఈ జీవాలు, ఇప్పుడు ప్రాణాలు తీసే స్థాయికి చేరుకోవడం ఆవేదన కలిగిస్తోందని పరిశోధకులు అంటున్నారు. మతం, జాతి వంటి విభజన సూత్రాలు లేకపోయినా, కేవలం సామాజిక బంధాలు తెగిపోతే జంతువుల్లో కూడా ఇంతటి హింస జరుగుతుందని ఈ సంఘటన నిరూపిస్తోంది. మానవ సంఘర్షణల మూలాలను అర్థం చేసుకోవడానికి ఈ ‘చింపాంజీల యుద్ధం’ ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
2027 పొంగల్ ను టార్గెట్ చేసిన నలుగురు సీనియర్స్.. పోటీతో బాక్సాఫీస్‌కు నష్టాలా ??
Vishnupriya: విష్ణుప్రియపై ఫిర్యాదు.. మరోసారి వివాదంలో చిక్కుకున్న యాంకర్
బంగారం లాంటి అవకాశాలను చేజార్చుకున్న టాలీవుడ్ దర్శకులు
