చెన్నైలో నిత్యపెళ్లికూతురు గుట్టురట్టు.. పదేళ్లలో ఏకంగా..

Updated on: Jan 31, 2025 | 2:16 PM

రాను రాను సమాజంలో విలువలు తగ్గిపోతున్నాయా అంటే అవుననే అనిపిస్తోంది. డబ్బుకోసం ప్రాణాలు తీసేవారు కొందరైతే, పెళ్లి పేరుతో ఒకే వ్యక్తి నలుగురైదుగురు వ్యక్తులను వివాహం చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి నిత్య పెళ్లికొడుకులు, నిత్య పెళ్లికూతుర్లకు సంబంధించిన వార్తలు చాలానే చూశాం. తాజాగా చెన్నైలో మరో నిత్య పెళ్లికూతురు గుట్టు రట్టయింది. ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్‌నని చెప్పి ఏకంగా ఐదుగురుని వివాహమాడింది ఈ కిలాడీ లేడి. ఓ బాధితుడి ఫిర్యాదుతో కటకటాలవెనక్కి వెళ్లింది.

నిషాంతి అనే యువతి పెళ్లికాని యువకులను టార్గెట్‌ చేసి, ఏకంగా పదేళ్లలో ఐదు పెళ్లిళ్లు చేసుకుంది. తానొక ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో విద్యార్థినని చెప్పి పరిచయం చేసుకున్న నిషాంతి యువకులను ప్రేమలోకి దింపి ఆరు నెలలు వారితో ప్రేమ వ్యవహారం నడిపించి పెళ్లివరకూ తీసుకొచ్చేది. ఆ తర్వాత హంగూ ఆర్భాటాలతో కళ్యాణమండపంలో గ్రాండ్‌గా వివాహం చేసుకునేది. ఆ తర్వాత కొన్ని రోజులకు తనకు మరో జిల్లా ప్రభుత్వాస్పత్రికి ట్రాన్స్‌ఫర్‌ అయిందని చెప్పి నగలు, డబ్బుతో పరారయ్యేది. ఈ క్రమంలో మైలాడుదురై జిల్లా సిర్గాలికి చెందిన శివచందర్‌ అనే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి తన తల్లికి అనారోగ్యంగా ఉండటంతో చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకొచ్చాడు. ఈ సమయంలో శివచందర్‌తో పరిచయం పెంచుకుంది నిషాంతి.