వైరల్ ఫీవర్‌తో ఇబ్బంది పడుతున్నారా.. ఇది మీ కోసమే
మనకి ఒంట్లో కొంచెం జ్వరంగా అనిపించినా, వైరల్ ఫీవర్ లక్షణాలు కనిపించినా వెంటనే మనం మందుల వైపు మొగ్గు చూపుతాం. అయితే, కొన్ని సాధారణమైన ఇంటి చిట్కాలు పాటించడం ద్వారా వైరల్ ఫీవర్ నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో చూద్దాం. వైరల్ ఫీవర్ సోకినప్పుడు.. ముఖ్యంగా, శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవడం అత్యంత కీలకం.
ఎక్కువగా నీరు, కొబ్బరినీరు, వెజిటబుల్ సూప్స్, ఇంకా హెర్బల్ టీలు తాగడం ద్వారా శరీరానికి అవసరమైన ద్రవాలు అందుతాయి. ఇది నిర్జలీకరణాన్ని నివారిస్తుంది. శరీరం నుండి విష పదార్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. అలాగే, శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వడం ద్వారా రికవరీ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ఎక్కువ నిద్రపోవడం, శారీరక శ్రమను తగ్గించుకోవడం వల్ల శరీరం కోలుకోవడానికి తగిన శక్తి లభిస్తుంది. మనలోని రోగనిరోధక వ్యవస్థ వైరస్‌తో పోరాడటానికి విశ్రాంతి చాలా అవసరం. వైరల్ ఫీవర్ లక్షణాలను తగ్గించడంలో సహాయపడే ఇంటి చిట్కాలను చూద్దాం. వైరల్ ఫీవర్‌తో బాధపడుతుంటే తులసి కషాయం చాలా బాగా పనిచేస్తుంది. తులసి ఆకులు, మిరియాలు, అల్లం కలిపి నీటిలో మరిగించి తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. అలాగే, అల్లం, తేనె కూడా వైరల్ ఫీవర్ తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. అల్లం రసం, తేనె కలిపి తీసుకుంటే గొంతు నొప్పి, జ్వరం నుండి ఉపశమనం లభిస్తుంది. అల్లం యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ లక్షణాలను కలిగి ఉండగా, తేనె గొంతును శాంతపరుస్తుంది. వైరల్ ఫీవర్‌ను తగ్గించడంలో వాము నీరు కూడా అద్భుతంగా పనిచేస్తుంది. వాము గింజలను నీటిలో మరిగించి తాగడం వల్ల జ్వరం, జలుబు నుండి ఉపశమనం కలుగుతుంది. ఇది శ్వాసనాళాలను శుభ్రపరచడంలో సహాయపడుతుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తాగడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది, తేనె సహజ యాంటీబయాటిక్‌గా పనిచేస్తుంది. ఇక ఆహారం విషయానికి వస్తే, మసాలా, నూనె అధికంగా ఉండే ఆహారాలు తినకూడదు. సూప్స్, పప్పు, కూరగాయలు, పండ్లు వంటి తేలికపాటి, సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. ఇది శరీరంపై భారం తగ్గించి, కోలుకోవడానికి సహాయపడుతుంది. బయటి ఆహారం, స్ట్రీట్ ఫుడ్ లాంటివి అస్సలు తినకూడదు. మరో ముఖ్యమైన విషయం.. ఈ ఇంటి చిట్కాలను పాటించినప్పటికీ, మూడు రోజులకు పైగా జ్వరం తగ్గకపోయినా, తీవ్రమైన లక్షణాలు ఉన్నా.. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది, నిరంతర వాంతులు, ఛాతీ నొప్పి వంటివి ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఈ చిట్కాలు సాధారణ వైరల్ ఫీవర్ల కోసం మాత్రమేనని గుర్తుంచుకోండి. ఈ సమాచారమంతా కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇవేవీ వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
