తిరుమల శ్రీవారికి అలంకరించే పూల మాలల ప్రత్యేకత ఏంటో తెలుసా?
తిరుమల శ్రీనివాసుడు అలంకార ప్రియుడు. ఆయనకు రత్నాలు, వజ్రాలు, బంగారు ఆభరణాలే కాదు.. సహజసిద్ధమైన పరిమళభరిత పుష్పాలతో అలంకరించుకోవడం మరింత ఇష్టం. అందుకే శ్రీవారికి అలంకరించే ఒక్కో పూమాలకు ఒక్కో కొలత, ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అదేంటో తెలుసుకుందాం... శ్రీ వెంకటేశ్వరునికి వెల కట్టలేని బంగారు నగలు, వజ్ర వైడూర్యల ఆభరణాలున్నా..శ్రీవారి అనేక సేవలలో పుష్పకైంకర్యం అత్యంత ప్రియమైనది.
పవిత్రమైన తిరువాయ్ మొళి అనే ప్రాచీన తమిళ గ్రంథంలో పేర్కొన్నట్లు స్వామి వారికి నిత్య కైంకర్యాలలో సుగంధ పరిమళాలు వెదజల్లే ఎన్నో రకాల పుష్పాలతో అర్చన చేస్తారు. ఆపదమొక్కుల వానికి ఆపాదమస్తకం అలంకరించే పుష్పహారాలు ప్రధానంగా 8 రకాలు ఉన్నాయి. అందులో శిఖామణి, సాలిగ్రామ మాల, కంఠసరి, వక్షస్థల లక్ష్మి, శంఖుచక్రం, కఠారిసరం, తావళములు, తిరువడి దండలున్నాయి. శిఖామణిహారం అంటే కిరీటం మీద నుంచి రెండు భుజాల మీదుగా అలంకరింపబడే 8 మూరల ఒకే ఒక దండను శిఖామణి అంటారు. తర్వాత సాలిగ్రామమాల ఇది శ్రీవారి భుజాల నుండి ఇరువైపులా పాదాల వరకు వేలాడుతూవున్న సాలగ్రామాల మాలలకు అనుబంధంగా అలంకరింపబడే పొడవైన పూలమాలలు ఇవి. ఈ రెండుమాలలు ఒక్కొక్కటి సుమారు 4 మూరలు ఉంటాయి. ఆ తరువాత..కంఠసరి మాల. రెండు భుజాల మీదికి అలంకరింపబడే దండ. ఇది ఒక్కొక్కటి మూడున్నర మూరలు ఉంటుంది. ఇక వక్షస్థల లక్ష్మి హారం. శ్రీవారి వక్షఃస్థలంలో ఉన్న శ్రీదేవి భూదేవీ లకు రెండుదండలు అలంకరిస్తారు. ఈ మాలలు ఒక్కొక్కటి ఒకటిన్నర మూర ఉంటుంది. అలాగే శంఖుచక్రం దండలు. శంఖుచక్రాలకు రెండు దండలు అలంకరిస్తారు. ఒక్కొక్కటి ఒక మూర ఉంటుంది. కఠారిసరం హారం. శ్రీవారి బొడ్డున వున్న నందక ఖడ్గానికి అలంకరించే దండ ఇది. రెండు మూరలు ఉండే ఈ దండను కఠారిసరంగా పరిగణిస్తారు. తావళములు అంటే రెండు మోచేతుల కింద, నడుము నుండి మోకాళ్ళపై హారాలుగా, మోకాళ్ళ నుండి పాదాల వరకు జీరాడుతూ వ్రేలాడదీసే దండలు. ఇవి మూడు దండలు. ఈ మూడు మాలల్లో ఒకటి మూడు మూరలు, రెండోది మూడున్నర మూరలు, మూడోది నాలుగు మూరలు ఉంటుంది. తిరువడి దండలు అంటే తిరుమలేశుడి పాదాలపై చుట్టూ అలంకరించే రెండు దండలు. ఇవి ఒక్కొక్కటి ఒక్క మూర ఉంటుంది. ఇక ప్రతి గురువారం జరిగే పూలంగి సేవలో మాత్రమే స్వామి వారి మూలమూర్తికి ఆభరణాలన్నీ తీసివేసి స్వామి వారిని విశేషంగా పూలమాలలతో అలంకరిస్తారు. ఇలా శ్రీవారిని నిత్యం సుగంధ పుష్పాలతో అర్చకులు అలంకరిస్తుండగా భక్తులకు దర్శన భాగ్యం కల్గిస్తున్నారు శ్రీ వెంకటేశ్వరుడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Gold Loans: గోల్డ్ రేట్ ఎఫెక్ట్.. రూ.3 లక్షల కోట్లకు చేరిన గోల్డ్ లోన్స్
