అద్భుతం.. చైనాలో డాక్టర్లు.. హైదరాబాద్‌లో సర్జరీ..

Updated on: May 29, 2026 | 3:59 PM

వైద్య రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ చైనాలోని వుహాన్ నుంచి ఒక భారతీయ వైద్యుడు హైదరాబాద్‌లోని రోగికి విజయవంతంగా రోబోటిక్ సర్జరీ నిర్వహించారు. 5జీ సాంకేతికత సాయంతో 7,000 కిలోమీటర్ల దూరం నుంచి జరిగిన ఈ శస్త్రచికిత్స భవిష్యత్తులో మారుమూల ప్రాంతాల రోగులకు నిపుణుల వైద్య సేవలను చేరువ చేసే కీలక ముందడుగుగా నిలిచింది.

ఆధునిక వైద్య సాంకేతికత.. భౌగోళిక సరిహద్దులను చెరిపేస్తూ సరికొత్త రికార్డు సృష్టించింది. సుమారు 7,000 కిలోమీటర్ల దూరంలో చైనాలోని వుహాన్‌లో ఉన్న ఒక భారతీయ వైద్యుడు.. హైదరాబాద్‌లోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ ఆసుపత్రిలో ఉన్న రోగికి .. రోబోటిక్ సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. అత్యాధునిక 5జీ ఇంటర్నెట్ సాయంతో జరిగిన ఈ శస్త్రచికిత్స వైద్య రంగంలో ఒక మైలురాయిగా నిలిచింది. హైదరాబాద్‌కు చెందిన ఒక 63 ఏళ్ల మహిళ మూత్రాశయ సంబంధిత సమస్యతో ‘ఏఐఎన్‌యూ’ ఆసుపత్రిలో చేరారు. అదే సమయంలో ఆ ఆసుపత్రికి చెందిన ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ సయ్యద్ మహ్మద్ గౌస్ చైనాలోని వుహాన్‌లో జరుగుతున్న ఒక అంతర్జాతీయ వైద్య సదస్సుకు హాజరయ్యారు. సరికొత్త రోబోటిక్ టెక్నాలజీ పనితీరును ప్రదర్శించే క్రమంలో, డాక్టర్ గౌస్ వుహాన్‌ నుంచే హైదరాబాద్‌లోని సదరు మహిళకు ‘యురేటరల్ రీ-ఇంప్లాంటేషన్’ అనే క్లిష్టమైన సర్జరీని విజయవంతంగా చేశారు. వుహాన్‌లోని టోంగ్జి ఆసుపత్రి కన్సోల్ నుండి డాక్టర్ గౌస్ ఆదేశాలు ఇవ్వగా.. హై-స్పీడ్ 5జీ నెట్‌వర్క్ కారణంగా కేవలం 200 మిల్లీసెకన్ల వ్యవధిలోనే హైదరాబాద్‌లోని రోబోటిక్ చేతులు అత్యంత కచ్చితత్వంతో పనిచేశాయి. 3డీ కెమెరాల సాయంతో ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తూ సుమారు 90 నిమిషాల్లో ఈ సర్జరీని పూర్తి చేశారు. ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు హైదరాబాద్‌లోని వైద్య బృందం ఆపరేషన్ థియేటర్‌లో సిద్ధంగా ఉంది. ఈ తరహా టెలీ-రోబోటిక్ సర్జరీలు భవిష్యత్తులో మారుమూల ప్రాంతాల రోగులకు నిపుణులైన వైద్య సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు కొనియాడుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హిందూ మహాసముద్రంలో భారీ ‘గ్రావిటీ హోల్’.. వీడిన మిస్టరీ!

తిండి పెట్టకుండా కొట్టి.. లైంగికంగా వేధించి..

భిక్షాటన చేస్తూ.. లక్షల విరాళమిచ్చిన రియల్ హీరో

Follow Us