ఈసీజీ కూడా కనిపెట్టలేనిది.. ఏఐ కనిపెట్టేసిందిగా!
సాధారణ ఈసీజీ పరీక్ష ఆధారంగా ఆకస్మిక గుండె మరణాల ముప్పును ముందుగానే గుర్తించే ఏఐ విధానాన్ని యూసీ బర్కిలీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. లక్షలాది ఈసీజీ రికార్డులను విశ్లేషించి రూపొందించిన ఈ మోడల్, ప్రస్తుత పరీక్షలకు అందని హై-రిస్క్ రోగులను కూడా గుర్తించగలదని పరిశోధకులు వెల్లడించారు. గుండె సంబంధిత మరణాలను తగ్గించడంలో ఇది కీలక పాత్ర పోషించే అవకాశముందని పేర్కొన్నారు.
ఏఐ.. కృత్రిమ మేధ.. ఇది అడుగుపెట్టని రంగమంటూ లేదు. దాదాపు అన్ని రంగాల్లలో తన సత్తాచాటుతున్న ఏఐ వైద్యరంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలికింది. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా సంభవించే ఆకస్మిక గుండె మరణాల ముప్పును ముందుగానే పసిగట్టే ఒక అద్భుతమైన విధానాన్ని శాస్త్రవేత్తలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఆవిష్కరించారు. సాధారణ ఈసీజీ పరీక్షలో దాగి ఉన్న, ఇప్పటివరకు నిపుణులైన కార్డియాలజిస్టులకు కూడా అంతుచిక్కని ఒక రహస్య జీవసంబంధిత నమూనాను ఏఐ గుర్తించింది. ‘యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్కిలీ’కి చెందిన పరిశోధకులు చేసిన ఈ పరిశోధన లక్షలాది మంది ప్రాణాలను కాపాడేందుకు మార్గాన్ని సుగమం చేయనుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2022 గణాంకాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి సుమారు 1.98 కోట్ల మంది గుండె సంబంధిత వ్యాధులతో మరణిస్తున్నారు. గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని ముందే గుర్తించగలిగినప్పటికీ, గుండెలోని విద్యుత్ వ్యవస్థలో తలెత్తే లోపాల వల్ల యువకులు, అథ్లెట్లలో సంభవించే ఆకస్మిక గుండె వైఫల్య మరణాలను గుర్తించడం ప్రస్తుత వైద్య పద్ధతులకు సాధ్యం కావడం లేదు. ప్రస్తుతం వైద్యులు వాడే LVEF పరీక్ష గుండె రక్తాన్ని పంపే సామర్థ్యాన్ని మాత్రమే కొలుస్తుంది. అయితే ఆకస్మికంగా గుండె ఆగి మరణించే చాలామందిలో ఈ పంపింగ్ సామర్థ్యం సాధారణంగానే ఉండడం వల్ల ప్రస్తుత స్క్రీనింగ్ పద్ధతులు ఈ ప్రమాదాన్ని గుర్తించలేకపోతున్నాయి. సవాలుగా మారిన ఈ సమస్యను అధిగమించేందుకు యూసీ బర్కిలీ అసోసియేట్ ప్రొఫెసర్ జియాద్ ఒబర్‌మేయర్ నేతృత్వంలోని బృందం దాదాపు దశాబ్దకాలం పాటు పరిశోధన చేసింది. స్వీడన్‌కు చెందిన 4,40,000 ఈసీజీ రికార్డులను మరణ ధృవీకరణ పత్రాల డేటాతో అనుసంధానించి ఒక శక్తివంతమైన ఏఐ మోడల్‌ను అభివృద్ధి చేశారు. అనంతరం అమెరికా, తైవాన్ రోగుల డేటాతో దీన్ని పోల్చి చూశారు. ఈ ఏఐ వ్యవస్థ గుర్తించిన హై-రిస్క్ రోగుల సమూహంలో ఏడాదికి 7 శాతం మంది ఆకస్మికంగా మరణించే అవకాశం ఉండగా.. ప్రస్తుత పద్ధతులతో గుర్తించిన వారిలో ఈ ముప్పు 4.6 శాతంగానే ఉంది. అన్నింటికంటే ముఖ్యంగా ఏఐ గుర్తించిన వారిలో 86 శాతానికి పైగా రోగులను ప్రస్తుత పద్ధతులతో గుర్తించడం అసాధ్యమని తేలింది. ప్రమాదం ఎక్కువగా ఉన్నవారిని గుర్తించి, వారికి మరిన్ని సంప్రదాయ పరీక్షలు నిర్వహించడానికి ఈ ఏఐ ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడుతుందని ప్రొఫెసర్ ఒబర్‌మేయర్ స్పష్టం చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Rao Bahadur: స్టార్ హీరో చేయాల్సిన సినిమా.. సత్యదేవ్ ఖాతాలోకి వచ్చింది!
