Rahul Gandhi: ‘అదానీ అక్రమాలకు మోదీ అండ.. నిప్పులు చెరిగిన రాహుల్

|

Aug 31, 2023 | 9:57 PM

విదేశీ పౌరులు అదానీ సంస్థల్లో అక్రమంగా పెట్టుబడులు పెట్టారని ఆరోపించారు రాహుల్‌. దీనిపై విచారణ కోసం ప్రధాని మోదీ ఎందుకు చొరవ తీసుకోవడంలేదన్నారు. ఈ కుంభకోణానికి పాల్పడిన వాళ్లను జైళ్లో ఎందుకు పెట్టడంలేదని ప్రశ్నించారు. అయితే ఈ ఆరోపణల్లో నిజం లేదని అదానీ సంస్థ వివరణ ఇచ్చింది. హిండెన్‌బర్గ్ నివేదికలో ఉన్న అంశాలనే మళ్లీ అంతర్జాతీయ మీడియాలో ప్రస్తావించారని స్పష్టం చేసింది. ఈ వ్యవహారాలపై సెబీతో పాటు సుప్రీంకోర్టు దర్యాప్తు జరుపుతోందని తెలిపింది.

అదానీ గ్రూప్‌పై అంతర్జాతీయ మీడియాలో వస్తున్న కథనాలపై కేంద్రం వెంటనే స్పందించాలని కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ డిమాండ్‌ చేశారు. బిలియన్‌ డాలర్ల ధనం భారత్‌ నుంచి వెళ్లి దొంగమార్గాల్లో తిరిగి భారత్‌కు వచ్చిందని ఆ పేపర్లలో ఉందన్నారు రాహుల్‌. విదేశాల నుంచి వచ్చిన అక్రమ పెట్టుబడులతో అదానీ గ్రూప్‌ షేర్లను కృత్రిమంగా పెంచారని రాహుల్‌గాంధీ ఆరోపించారు. షేర్‌ ధరలు పెరగడంతో వచ్చిన సొమ్ము తోనే అదానీ ఎన్నో ఆస్తులు కొన్నారని రాహుల్‌ ఆరోపించారు. ఎయిర్‌పోర్ట్‌లను , పోర్ట్‌లను అదానీ ఇలాగే కొనుగోలు చేశారన్నారు. ఈ అక్రమాలకు గౌతమ్‌ అదానీ సోదరుడు వినోద్‌ అదానీ మాస్టర్‌మైండ్‌ అని ఆరోపించారు. నాసర్‌ అలీ , ఛాంగ్‌ చుంగ్‌ లింగ్‌ అనే వ్యక్తులు అదానీ సంస్థల్లో పెట్టుబడులు పెట్టారని దీనిపై దర్యాప్తు జరపాలని డిమాండ్‌ చేశారు. ఈ అక్రమాలపై సెబీ , ఈడీ , ఎందుకు దర్యాప్తు జరపడం లేదని ప్రశ్నించారు.

 

Published on: Aug 31, 2023 09:55 PM