Telangana: రేవంత్‌రెడ్డిని యూటర్న్ సీఎం అనుకుంటున్నారు: ఎమ్మెల్సీ కవిత
హామీల అమలుకు ప్రియాంకా గాంధీని ఏ హోదాలో పిలుస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని BRS ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. రేవంత్‌ను యూటర్న్ సీఎం అని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారని విమర్శించారు. ఝార్ఖండ్ ఎమ్మెల్యేలను ప్రభుత్వ ఖర్చుతో హైదరాబాద్ తరలించారని కవిత ఆరోపించారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 3: CM రేవంత్ రెడ్డి విమర్శలకు కౌంటర్ ఇచ్చారు MLC కవిత. సీఎం రేవంత్‌రెడ్డి నోట ఇప్పటివరకు ఒక్కసారి కూడా జై తెలంగాణ అన్న మాట రాలేదన్నారు. రెండు గ్యారంటీల అమలు కార్యక్రమానికి ప్రియాంక గాంధీని ఏ హోదాలో పిలుస్తున్నారో చెప్పాలన్నారు. ప్రభుత్వ కార్యక్రమానికి ఆమెను పిలిస్తే కచ్చితంగా నిరసన తెలుపుతామన్నారు. తెలంగాణ ప్రజలు యూటర్న్ సీఎం అని రేవంత్ రెడ్డిని పిలుస్తున్నారన్నారు కవిత. 60 రోజుల్లో కేవలం ఒక్క రోజే సీఎం రేవంత్ ప్రజలను కలిశారన్నారు. కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలను ఆ నాడు విమర్శించి.. ఇప్పుడు సీఎం అదే బాటలో నడుస్తున్నారన్నారు కవిత.
ప్రతీరోజు కేసీఆర్ కుటుంబాన్ని సీఎం టార్గెట్ చేస్తున్నారని.. కాంగ్రెస్ పార్టీ కూడా 22 కుటుంబాలకు టికెట్లు ఇచ్చిందని గుర్తు చేశారు కవిత. కేసీఆర్ కుటుంబాన్ని విమర్శించే అర్హత ఉందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో 22 కుటుంబాలకు టికెట్లు ఇచ్చారని.. మరి కాంగ్రెస్ ది కుటుంబ పాలన కాదా అని కవిత నిలదీశారు. వారానికి రెండు సార్లు సీఎం ఢిల్లీ వెళ్తున్నారని.. చార్టెర్డ్ విమానాలు, ప్రైవేట్ ఫ్లైట్‌కు అయ్యే ఖర్చు ఎంతో చెప్పాలన్నారు కవిత. ఇంద్రవెల్లి సభ కోసం ప్రభుత్వ నిధులు ఎలా ఉపయోగించారని కవిత ప్రశ్నించారు.
తెలంగాణ అసెంబ్లీలో పూలే విగ్రహ ఏర్పాటు చేయాలని ఈనెల 12న భారత జాగృతి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నా చేయనున్నట్లు కవిత తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…