Chandrababu: కోర్టు హాల్‌లో కేశినేని నాని, పయ్యావుల కేశవ్‌తో బాబు మంతనాలు

|

Sep 10, 2023 | 6:09 PM

. విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. ఉదయం 8 గంటల నుంచి సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. ఏ క్షణమైనా తీర్పు వెలువడే అవకాశం ఉంది. కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కోర్టు దగ్గర భారీగా పారా మిలటరీ బలగాలు మోహరించారు. బారికేడ్లు ఏర్పాటు చేశారు. చంద్రబాబును తరలించేందుకు కాన్వాయ్‌ను సిద్ధం చేశారు పోలీసులు. ద్రబాబు అరెస్ట్‌పై గవర్నర్‌ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదంటూ సీఐడీ తరపున ఏఏజీ వాదనలు వినిపించారు. స్పీకర్‌కు సమాచారం ఇస్తే సరిపోతుంది అన్నారు. అన్ని నియమాలను తాము పాటించామన్నారు.

స్కిల్‌ స్కామ్ కేసులో నంద్యాలలో శనివారం తెల్లవారుజామున చంద్రబాబును అరెస్ట్‌ చేశాక 24 గంటలు ముగిసే సమయంలో ఈరోజు ఉదయం 6 గంటలకు విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు పేరు చేర్చి కోర్టుకు సీఐడీ రిమాండ్‌ సమర్పించింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు ముఖ్యమైన కుట్రదారని, తాడేపల్లిలోని స్కిల్ డెవలప్‌మెంట్‌ కేంద్రంగా అక్రమాలు జరిగాయని రిమాండ్‌ రిపోర్ట్‌లో తెలిపింది. 2021 డిసెంబర్‌ 9 కంటే ముందు నేరం జరిగిందని, స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు సంబంధించి సీమెన్స్‌ ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వ వాటాగా 371 కోట్ల రూపాయలు చెల్లించారని సీఐడీ తెలిపింది. సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు పేరుపై రిమాండ్‌ రిపోర్ట్‌ సమర్పించింది. చంద్రబాబును 15 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్‌కు ఇవ్వాలని సీఐడీ డిమాండ్‌ చేసింది.

ఉదయం 9 గంటల సమయంలో న్యాయస్థానంలో చంద్రబాబు స్టేట్‌మెంట్ రికార్డ్‌ చేయడం పూర్తి చేశారు. న్యాయమూర్తి అనుమతితో ఏసీబీ కోర్టులో చంద్రబాబు స్వయంగా వాదనలు వినిపించారు. తన అరెస్ట్‌ అక్రమమని వాదించారు. స్కిల్‌ స్కామ్‌తో తనకు ఎలాంటి సంబంధమూ లేదని చంద్రబాబు వాదించారు. రాజకీయ కక్షతోటే అరెస్ట్ చేశారని వాదించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ క్యాబినెట్ నిర్ణయమని, ప్రభుత్వ నిర్ణయాలపై క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి వీల్లేదని చంద్రబాబు వాదించారు. 2015-16 బడ్జెట్‌లోనే స్కిల్ డెవలప్‌మెంట్‌ను పొందుపరిచి అసెంబ్లీతో ఆమోదింపచేశామన్నారు. అసెంబ్లీ ఆమోదించిన బడ్జెట్ కేటాయింపులను క్రిమినల్ చర్యలతో ప్రశ్నించలేరని చంద్రబాబు వాదించారు. 2021 డిసెంబర్‌ 9 నాటికి తన పేరు ఎఫ్‌ఐఆర్‌లో లేదన్నారు చంద్రబాబు. నాటి రిమాండ్‌ రిపోర్ట్‌లోనూ తన పాత్ర ఉందని కూడా సీఐడీ చెప్పలేదన్నారు.

 

Published on: Sep 10, 2023 05:00 PM