BRS Party Rift: పార్టీ పోతే ఎంత.. ఉంటే ఎంత? బీఆర్ఎస్‌లో కవిత కల్లోలం..!

Updated on: Sep 01, 2025 | 9:05 PM

పార్టీ పోతే ఎంత.. ఉంటే ఎంత? బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలివి. సాక్ష్యాత్తు పార్టీ అధినేత చంద్రశేఖర్‌రావు కుమార్తె నుంచి ఇలాంటి కామెంట్స్‌ రావడం.. ఇప్పుడు బీఆర్‌ఎస్‌ వర్గాల్లోనే కాదు... రాజకీయవర్గాల్లోనూ సంచలనం రేపుతోంది. ఇంతకాలం కేసీఆర్‌కు కుటుంబమే బలం అనుకున్న పరిస్థితి నుంచి.. ఇప్పుడు ఆ కుటుంబమే బీఆర్ఎస్‌లో కలకలం రేపుతున్న పరిస్థితి. ఇప్పుడు బీఆర్ఎస్ కవిత విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోనుందన్నది ఆసక్తికరంగా మారింది.

బీఆర్ఎస్‌లో తీవ్రమైన కుదుపులు. ఓ వైపు కాళేశ్వరంపై విచారణ పేరుతో బయటి నుంచి ఒత్తిడి పెంచే పరిణామాలు. మరోవైపు పార్టీలో కవిత నుంచి ఎదురవుతున్న ధిక్కార స్వరాలు. ఇంతకాలం కేసీఆర్‌కు కుటుంబమే బలం అనుకున్న పరిస్థితి నుంచి.. ఇప్పుడు ఆ కుటుంబమే బీఆర్ఎస్‌లో కలకలం రేపుతున్న పరిస్థితి.

కేటీఆర్, హరీష్‌రావు, కవిత, సంతోష్‌రావు. వీరంతా కేసీఆర్ కుటుంబసభ్యులు. కారు లాంటి బీఆర్ఎస్ పార్టీకి నాలుగు చక్రాల్లాంటివారు. తెలంగాణ ఉద్యమంలో, ఆ తరువాత పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా పార్టీలో ఎలాంటి కుదుపులు లేకుండా చూసేందుకు ఎవరి పాత్ర వాళ్లు పోషించారు. కానీ ఇప్పుడు ఆ కుటుంబంలో చిచ్చు రేగింది. కారణమేంటో తెలియదు కానీ… ఒకరు పార్టీకి దూరం కావడం.. మరో ముగ్గురిపై విమర్శలు చేయడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.

కవితకు కేటీఆర్ స్వయానా అన్న, హరీష్‌రావు మేనత్త కుమారుడు, ఇక మరో సోదరుడైన సంతోష్‌రావు సొంత పిన్ని కుమారుడు. ఈ కుటుంబమే బీఆర్ఎస్‌కు బలం. కానీ కొంతకాలంగా పార్టీకి కవిత దూరమవుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. పార్టీకి దూరమవ్వాలనుకుంటున్నారో.. లేక పార్టీనే తనను దూరం చేసుకోవాలనే వ్యూహంతో ముందుకు సాగుతున్నారో తెలియదు కానీ.. కవిత చేస్తున్న విమర్శలు మొత్తం బీఆర్ఎస్‌ను ఓ కుదుపు కుదిపేస్తున్నాయి. కారుకు నాలుగు చక్రాల్లా ఇంతకాలం నడిచిన ఈ నలుగురు.. పార్టీ వ్యవహారాల్లో కేసీఆర్‌కు తమవంతు సాయం చేస్తూ వచ్చారు.

పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి, విపక్షాల విమర్శలను బలంగా తిప్పకొట్టడంలో కేటీఆర్, హరీష్‌రావు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక కేసీఆర్‌కు వ్యక్తిగత సలహాదారుగా ఉండే సంతోష్‌రావు.. ఆయన ఆదేశాలను ఎప్పటికప్పుడు పార్టీ నేతలకు అందజేస్తుంటారని చెబుతుంటారు. ఇక బీఆర్ఎస్ తరపున అనేక కార్యక్రమాలతో పాటు జాగృతి పేరుతో ప్రజల్లోకి వెళ్లి బీఆర్ఎస్‌కు అండగా ఉంటూ వచ్చారు కవిత. ఈ నలుగురి సహకారంతో ఎలాంటి ఇబ్బందివచ్చినా.. కారు లాంటి కారు పార్టీని సేఫ్‌గా డ్రైవ్‌ చేస్తూ వస్తున్నారు గులాబీ బాస్. కానీ ఇప్పుడు సీన్ మారిపోతోంది. కారు పార్టీకి ఓ చక్రం లాంటి కవిత.. పార్టీకి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ ఏం చేయబోతున్నారు ? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కొన్నాళ్ల నుంచి పార్టీకి ఇబ్బందిగా మారిన కవిత విషయంలో ఎప్పటికైనా కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందనే భావనలో కేసీఆర్ ఉన్నారని.. ఇందుకు ఇదే సరైన సమయమని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.

Published on: Sep 01, 2025 09:04 PM