Big News Big Debate: గుజరాత్‌తో మోదీ మ్యాజిక్.. ఘనవిజయం.. హిమాచల్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ హస్తగతం

|

Dec 08, 2022 | 7:08 PM

మొత్తానికి గుజరాత్‌లో 35శాతం ఎప్పుడూ ఓటింగ్‌ తగ్గని కాంగ్రెస్‌ ఇప్పుడు కకావికలం అయింది. హిమాచల్‌ ప్రదేశ్‌లో బీజేపీ ఓడినా ఓటుశాతం పెద్దగా తగ్గలేదు. అయితే తమ చేతిలో ఓ రాష్ట్రం చేజారడం కాషాయం పెద్దలకు మింగుడుపడని అంశమే.

రెండు రాష్ట్రాల ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలొచ్చాయి. తమకు తిరుగే లేదంటూ గుజరాత్‌లో బీజేపీ వీరవిహారం చేస్తే.. హిమాచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ విజయం సాధించింది. వరుస ఓటములు, నాయకత్వం సంక్షోభం చుట్టుముట్టి కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న హస్తం పార్టీకి తాజా విజయం ఊపిరి పోస్తే.. మోదీ ప్రభంజనం ఏమాత్రం తగ్గలేదని గుజరాత్‌ ఫలితం మరోసారి నిరూపించింది. గుజరాత్‌లో అపూర్వవిజయం సొంతం చేసుకుంది బీజేపీ. 50శాతానికి పైగా ఓట్లు… 150కు పైగా సీట్లతో సరికొత్త చరిత్ర సృష్టించింది. అటు హిమాచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీది గొప్ప విజయం కాకపోయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా సాధించిన అనూహ్య విజయమే. గుజరాత్‌లో బీజేపీ గెలుస్తుందని సర్వేలన్నీ చెప్పాయి కానీ ఈ స్థాయి విజయం ఎవరూ ఊహించలేకపోయారు. బీజేపీ నాయకత్వం అనుసరించిన ఎలక్షనీరింగే దీనికి కారణం. అన్నింటికి మించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమిత్‌షాల స్వీయ పర్యవేక్షణ అసలు కారణం.  చరిత్రలో నిలిచిపోయే విజయం కావాలని భావించిన బీజేపీ అన్ని అస్త్రాలను ప్రయోగించింది. ఆపరేషన్‌ ఆకర్ష్‌ తో ఇతర పార్టీలను బలహీనం చేసింది. వ్యతిరేకత తప్పించుకోవడానికి 41 మంది సిట్టింగులను మార్చింది. సామాజికవర్గాలుగా నేతలను ఎంపిక చేసి మరీ బాధ్యతలు అప్పగించింది.