Hyderabad: పార్క్ చేసిన 15 సెకనల్లోనే స్కూటీ చోరీ.. బైక్ కొన్న 3వ రోజే..
షాప్ ముందు పార్క్ చేసిన కొత్త ఆక్టివా కేవలం 15–20 సెకన్లలోనే మాయమైంది. బాలాపూర్ ఎక్స్‌రోడ్‌లో జరిగిన ఈ దొంగతన ఘటనలో, మద్యం మత్తులో ఉన్న దొంగ వాహనం ఎత్తుకెళ్లినట్లు సీసీ ఫుటేజ్‌లో తేలింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.
షాప్ వద్ద బైక్ పార్క్ చేసి మంచినీళ్ల బాటిల్ కొనుగోలు చేసే లోపే ఆక్టివా వాహనం దొంగతనానికి గురైన ఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాలాపూర్ ఎక్స్ రోడ్ వద్ద ఈ ఘటన జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. బాలాపూర్ ఎక్స్ రోడ్‌లోని ఓ షాప్ ముందు తన ఆక్టివా వాహనాన్ని పార్క్ చేసి వాటర్ బాటిల్ కొనుగోలు చేస్తుండగా, గుర్తుతెలియని వ్యక్తి కేవలం 15 నుంచి 20 సెకన్లలోనే వాహనాన్ని ఎత్తుకెళ్లాడు. రెండు రోజుల కిందటే కొనుగోలు చేసిన కొత్త వాహనం ఇలా మాయమవడంతో బాధితుడు లబోదిబోమంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. చేసేదేమీ లేక బాలాపూర్ పోలీసులను ఆశ్రయించి బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఘటన స్థలంలోని సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా బైక్ చోరీ చేసిన దొంగ.. అంతకు ముందే ఓ వైన్ షాపులో మద్యం కొనగోలు చేసి ఫుల్‌గా తాగి బయకు వచ్చిన విజువల్స్ పోలీసులు సంపాదించారు. నిందుతుడి కోసం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.