KTR: ‘ఈ ప్రభుత్వం వచ్చాక ఒక్క ఇల్లు ఇచ్చినట్టు చూపిస్తే నేను రాజీనామా చేస్తా’

Updated on: Nov 08, 2025 | 8:47 PM

రెండేళ్ల పాలనలో హైదరాబాద్‌లో ఒక్క ఇల్లు కట్టినా తాను తన పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్ సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలో హైదరాబాద్ అభివృద్ధికి ఏం చేసిందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. తాము ఏ పని చేసినా కాంగ్రెస్ అడ్డం పడుతోందని ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ చేపట్టిన HYDRA ప్రాజెక్టుపై నెగటివ్ ప్రచారం చేశారని, చెరువులు తవ్వుతుంటే దాని వెనకాల ఏదో జరుగుతుందని దుష్ప్రచారం చేశారని ఆయన పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో హైదరాబాద్‌లో గృహనిర్మాణం, అభివృద్ధిపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మాలంటే, రెండేళ్లలో హైదరాబాద్‌కు ఏం చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వం లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించిందని, దీనికి రూ.10,000 కోట్లు ఖర్చు చేసిందని, వాటి విలువ ఇప్పుడు రూ.50,000 కోట్లు ఉంటుందని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక హైదరాబాద్‌లో ఒక్క ఇల్లు కట్టినా తాను రాజీనామా చేస్తానని కేటీఆర్ సవాల్ విసిరారు. మరోవైపు, వేల ఇళ్లు కూలగొడుతున్నారని, పేదల ఇళ్లపై బుల్డోజర్లు పంపుతున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ దుష్పరిపాలన, నెగటివ్ పాలసీల కారణంగా రియల్ ఎస్టేట్ కుదేలైందని, ప్రాపర్టీ విలువలు 50% పడిపోయాయని కేటీఆర్ పేర్కొన్నారు. పేదల పక్షాన నిలబడి, గృహనిర్మాణం చేయని ప్రభుత్వానికి ప్రజలు ఎందుకు ఓటు వేయాలని ఆయన ప్రశ్నించారు.