Viral Video: అరటి గెలలు స్కూటర్‌పై తీసుకెళ్తున్న వ్యక్తిని ఆపిన పోలీసుల.. తనిఖీ చేయగా మైండ్ బ్లాంక్

Updated on: Sep 03, 2025 | 8:42 PM

మలప్పురం జిల్లా వెంగరలో వాహన తనిఖీల సందర్భంగా స్కూటర్‌లో తరలిస్తున్న కోటి రూపాయల అక్రమ నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరటి గుత్తుల్లా నోట్లను ప్యాక్ చేసి, స్కూటర్ ముందు దాచినట్లు గుర్తించారు. ఓనం నేపథ్యంలో జరుగుతున్న తనిఖీలలో ఇది పెద్దగా దొరికిన నగదు పరిమాణం.

కేరళ మలప్పురం జిల్లా వెంగరలో పోలీసులకు షాక్ ఇచ్చే ఘటన చోటుచేసుకుంది. వాహన తనిఖీల సమయంలో స్కూటర్‌లో అక్రమంగా తరలిస్తున్న కోటి రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొడువల్లి ప్రాంతానికి చెందిన ముహమ్మద్ మునీర్ (39) అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వెంగర కూరియాద్ అండర్‌పాస్ సమీపంలో జరిగిన తనిఖీలో స్కూటర్‌ను ఆపి పరిశీలించగా, ముందుభాగంలో ఉంచిన సంచిలో నోట్ల కట్టలు కనిపించాయి. ఈ నగదును గుర్తించకుండా ఉండేందుకు నోట్లను అరటి గుత్తుల్లా తయారుచేసి, వాటిపై అరటి ఆకులు కప్పి చాకచక్యంగా దాచినట్లు తెలుస్తోంది. అయితే పోలీసుల అప్రమత్తతతో ఆ నగదు బయటపడింది.

ఈ డబ్బును వెంగర పరిసర ప్రాంతాల్లో పంపిణీ చేయాలనే ఉద్దేశంతో తీసుకెళ్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నగదు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి కోసం తీసుకెళ్తున్నారు అనే అంశాలపై విచారణ కొనసాగుతోంది. ఓనం పర్వదినాన్ని దృష్టిలో పెట్టుకొని మలప్పురం జిల్లాలో విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇటీవల జిల్లాలోనే వివిధ చోట్ల రూ. 10 కోట్లకు పైగా అక్రమ నగదు పట్టుబడినట్టు సమాచారం.