కనిగిరికి రైలు.. సాకారమైన 30 ఏళ్ళ కల
ప్రకాశం జిల్లా కనిగిరికి 30 ఏళ్ల నిరీక్షణ తర్వాత తొలిసారి రైలు వచ్చింది. నడికుడి-శ్రీ కాళహస్తి రైలు మార్గంలో భాగంగా ఈ గూడ్స్ రైలు ట్రయల్ రన్ నిర్వహించారు. స్థానికులు ఆనందంతో సెల్ఫీలు తీసుకున్నారు. ఈ మార్గం అమరావతిని రాయలసీమకు అనుసంధానిస్తుంది, ప్రయాణ భారాన్ని తగ్గిస్తుంది. కనిగిరి అభివృద్ధికి ఇది కీలక మలుపు.
రండి రండి… దయచేయండి… మీ రాక మాకు ఎంతో సంతోష సుమండీ… అంటూ రైల్వే అధికారులకు ఆ ఊరి ప్రజలు స్వాగతం పలికారు… గత ముఫ్పయేళ్ళుగా ప్రకాశంజిల్లా కనిగిరికి రైలు వస్తోంది, వస్తోందంటూ ఊరిస్తున్న ప్రతిపాదనలు ఇప్పటికి సాకారమై తొలిసారి కనిగిరికి రైలు రావడంతో స్థానికుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఓ సెలబ్రిటీతో ఫోటోలు దిగిన విధంగా రైలుతో సెల్ఫీలు దిగారు స్థానికులు. నడికుడి – శ్రీ కాళహస్తి రైలు మార్గం కనిగిరి వరకు పూర్తికావడంతో కనిగిరి వరకు రైలు మార్గం ఏర్పడింది. దీంతో తొలిసారి కనిగిరికి రైలును ట్రయల్ రన్ నిర్వహించారు. ప్రకాశంజిల్లాలోని కనిగిరి అత్యంత వెనుకబడిన ప్రాంతం. ఇక్కడి నుంచి ఎటు వెళ్ళాలన్నా కేవలం రోడ్డు మార్గంలోనే వెళ్లాలి. నడికుడి నుంచి శ్రీ కాళహస్తి వరకు రైలుమార్గం నిర్మాణానికి పలుమార్లు కేంద్రానికి ప్రతిపాదనలు వెళ్ళడంతో ప్రస్తుతం ఈ మార్గంలో రైల్వే లైను నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇందులో భాగంగా గూడ్స్ రైలును తొలిసారి పట్టాలపై ప్రయోగాత్మకంగా నడిపారు. నడికుడి నుంచి కొత్తరైలు మార్గం ద్వరా అమరావతిని రాయలసీమ ప్రాంతానికి, అలాగే తిరుపతి వంటి దక్షిణాదిలో ఉన్న నగరాలకు అనుసంధానం చేయనుంది. దీంతో కనిగిరి నుంచి సింగరాయకొండ, కావలికి బస్సుల్లో వచ్చి చెన్నై వైపు రైళ్ళల్లో వెళ్ళే వారికి ఈ కొత్త రైలు మార్గం ప్రయాణభారాన్ని మరింత తగ్గించనుంది. నడికుడి నుంచి శ్రీ కాళహస్తి వరకు నిర్మిస్తున్న ఈ కొత్తరైలు మార్గం కనిగిరి వరకు పూర్తికావడంతో తొలిసారి కనిగిరి వరకు గూడ్స్ రైలును నడిపారు. బిలాస్‌పూర్ నుంచి వచ్చిన ఈ గూడ్స్ రైల్లో రైల్వే లైను నిర్మాణ పనుల సామాగ్రిని తీసుకొచ్చారు. తొలిసారి తమ ఊరు వచ్చిన రైలును చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపారు. రైలుతో సెల్ఫీలు దిగి తమ సంతోషం వ్యక్తం చేశారు. త్వరలోనే ఈ రైలు మార్గం పూర్తిగా నిర్మించి ప్రయాణీకులను గమ్యాలకు చేర్చే విధంగా రైళ్ళను నడిపేందుకు రైల్వే శాఖ చురుగ్గా పనులు చేస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
చలి గుప్పిట్లో తెలంగాణ.. నెల రోజులుగా వణుకే..
