Andhra King Taluka Review: అక్కడ బిగిస్తే.. సినిమా మరోలా ఉండేదేమో..?
డబుల్ ఇస్మార్ట్, స్కంద పరాజయాల తర్వాత రామ్ పోతినేని నటించిన 'ఆంధ్ర కింగ్ తాలూకా' చిత్ర సమీక్ష. అభిమాని, హీరో బంధం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం, రామ్ కెరీర్‌లో మంచి మలుపుగా నిలిచే అవకాశం ఉంది. స్క్రీన్ ప్లే కొంత నెమ్మదించినా, భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి. ఉపేంద్ర, రామ్ నటన హైలైట్. దర్శకుడు మహేష్ బాబు ప్రయత్నం బాగుంది.
డబుల్ ఇస్మార్ట్, స్కంద లాంటి పరాజయాల తర్వాత రామ్ పోతినేని నుంచి వచ్చిన సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. మహేష్ బాబు తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం. స్పాయిలర్ లేకుండా ఆంధ్రా తాలూక కథ విషయానికి వస్తే… ఈ సినిమా కథ గోదావరి జిల్లాలో 2002 ప్రాంతంలో మొదలవుతుంది. ఆంధ్ర కింగ్ సూర్య అలియాస్ ఉపేంద్ర తెలుగు రాష్ట్రాల్లో దేవుడు లాంటి హీరో. చాలా పెద్ద మాస్ ఇమేజ్ ఉన్న కథానాయకుడు. అలాంటి హీరో 100వ సినిమాకు రెడీ అవుతున్న తరుణంలో అనుకోకుండా అది ఆగిపోతుంది. ఆర్థిక సమస్యల కారణంగా 100 సినిమా ఆగిపోవడంతో సూర్య బాగా కృంగిపోతాడు. మరోవైపు అదే గోదావరి జిల్లాలో సూర్యకు అతిపెద్ద అభిమాని సాగర్ అలియాస్ రామ్ పోతినేని. అదే ఊర్లో ఉన్న మహాలక్ష్మి థియేటర్ ఓనర్ పురుషోత్తం అలియాస్ మురళీ శర్మ కూతురు మహాలక్ష్మి అలియాస్ భాగ్యశ్రీ ని తొలిచూపులోనే ప్రేమిస్తాడు సాగర్. కానీ వాళ్ళ ప్రేమను గెలిపించుకోవడానికి పురుషోత్తంతో ఒక ఛాలెంజ్ చేస్తాడు సాగర్. అది హీరో సూర్య కెరీర్ కు ముడిపడి ఉంటుంది. అది ఏంటి అనేది అసలు కథ.. కొన్ని సినిమాలు మనసుకు చాలా దగ్గరవుతూ ఉంటాయి. ముఖ్యంగా అభిమాని కోణంలో చూసినప్పుడు ఆ సినిమాలు బాగా కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆంధ్రా కింగ్ తాలుక కూడా అలాంటి సినిమానే. ఇందులో అభిమానులకు కనెక్ట్ అయ్యే అంశాలు చాలానే ఉన్నాయి. కాకపోతే అంత మంచి కథ రాసుకున్నప్పుడు దానికి సరిపోయే స్క్రీన్ ప్లే రాసుకోవడంలో మాత్రం… డైరెక్టర్ మహేష్ బాబు కాస్త తడిబడినట్టు అనిపిస్తుంది. తొలి 20 నిమిషాలు… సినిమా అద్భుతంగా ఉంటుంది. ఉపేంద్రతో మొదలు పెట్టిన సీక్వెన్స్.. సినిమా మీద అంచనాలు అలా పెంచేస్తుంది. హీరో రామ్ ఎంట్రీ వరకు కూడా కథ అంతే స్పీడ్ తో పరిగెడుతుంది. కానీ ఆ తర్వాత ఎందుకో కాస్త స్లో అయిన ఫీలింగ్ వచ్చింది. హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ ట్రాక్ కూడా చాలా స్లోగా వెళ్ళినట్టు అనిపిస్తుంది. అయితే… మళ్లీ ఇంటర్వెల్ వచ్చేసరికి కథ గాడిన పడింది. ఈక్రమంలో వచ్చే సెకండాఫ్.., పూర్తిగా ఎమోషనల్ టర్న్ తీసుకుని ముందుకు సాగుతుంది. ఇక క్లైమాక్స్‌నైతే అద్భుతంగా డిజైన్ చేశాడు డైరెక్టర్ మహేష్ బాబు. హీరోల కోసం అభిమానులు రావడం కామన్ కానీ.. అభిమాని కోసం హీరో తరలి రావడం అనేది ఎమోషనల్ ఫీలింగ్. దాన్ని క్యాష్ చేసుకోవాలని చూశాడు దర్శకుడు మహేష్ బాబు. ఈ సినిమాలో మెయిన్ పాయింట్ కూడా అదే. అభిమాని కోసం హీరో కోట దిగి రావడం అనే కాన్సెప్ట్ ఆకట్టుకుంటుంది. అయితే దాని చుట్టూ ఇంకాస్త ఎమోషనల్ సన్నివేశాలు ఉండుంటే ఇంకా బాగుండేదేమో అనిపిస్తుంది. అయినా కూడా రామ్ గత సినిమాలతో పోలిస్తే ఆంధ్ర కింగ్ తాలూకా చాలా బెటర్ సినిమా. తన ఇమేజ్ కు ఏది సెట్ అవుతుందో ఇప్పటికైనా రామ్ అర్థం చేసుకుంటే మంచిది. ఇక సాగర్ పాత్రలో రామ్ అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో అదరగొట్లాడు. భాగ్యశ్రీ బోర్సే క్యారెక్టర్ బాగుంది. ఉపేంద్ర ఉన్నంత సేపు సినిమా అద్భుతంగా ఉంది. సూర్య క్యారెక్టర్ లో ఆయన జీవించాడు. మిగిలిన పాత్రల్లో మురళీ శర్మ, రావు రమేష్, సత్య, రాహుల్ రామకృష్ణ అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. వివేక్ మార్విన్ సంగీతం కొత్తగా ఉంది. ‘నువ్వుంటే చాలే’ పాట స్క్రీన్ మీద కూడా అద్భుతంగా ఉంది. చిన్ని గుండెలో సాంగ్ కూడా మంచి రెస్పాన్స్ రాబట్టుకుంటుంది. ఇక మిగిలిన పాటలు కూడా ఓకే. సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా ఉంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. మహేష్ బాబు టేకింగ్ బాగుంది. స్క్రీన్ ప్లే ఇంకాస్త టైట్ గా రాసి ఉంటే సినిమా మరో లెవల్లో ఉండేదేమో..! ఇక ఓవరాల్ గా ఆంధ్ర కింగ్ తాలూకా గురించి చెప్పాలంటే… ఇదో బయోపిక్ ఆఫ్ ఫ్యాన్.. !
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మీ యాటిట్యూడ్‌ను మీ జేబులోనే పెట్టుకోండి.. క్యాబ్ డ్రైవర్ రూల్స్ వైరల్
ఆరు శతాబ్దాల మహావృక్షం చరిత్ర.. ఇది ఒక ఆధ్యాత్మిక అద్భుతం
ఫోన్‌లో మాటలు విన్నాడు.. మనసు గెలిచాడు
తిరుపతి మీదుగా దూసుకెళ్లనున్న బుల్లెట్ రైలు.. హైదరాబాద్ నుంచి రెండు గంటల్లోనే చెన్నైకి
