Alia Bhatt: ఆలియాకు టోకరా వేసిన పీఏ.. పోలీసులకు పట్టించిన హీరోయిన్..

Updated on: Jul 09, 2025 | 10:10 PM

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ మాజీ వ్యక్తిగత సహాయకురాలు వేదిక ప్రకాష్ శెట్టిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలియా పేరుతో దాదాపు రూ.77 లక్షలకు పైగా మెసానికి పాల్పడినట్లు హీరోయిన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలియా నిర్మాణసంస్థ ఎటర్నల్‌ సన్‌షైన్‌ ప్రొడక్షన్స్ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో పనిచేస్తున్నప్పుడు వేదిక ఈ అక్రమాలకు పాల్పడింది.

ఆలియా భట్ పీఏ వేదిక ప్రకాష్ షెట్టిని ముంబై జుహు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆలియా భట్ వ్యక్తిగత ఖాతాతో పాటు ఆమె నిర్మాణ సంస్థ ‘ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్’ ఖాతాల నుంచి వేదిక.. రూ. 76,90,892 రూపాయలను మోసం చేసి కాజేసిందని ఆలియా భట్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు వేదిక ఆచూకీ కోసం గాలింపు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే దాదాపు 5 నెలల తర్వాత ఆమె బెంగళూరులో ఉందని గుర్తించి, అక్కడికి వెళ్లి అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి 5 రోజుల ట్రాన్సిట్ రిమాండ్‌పై వేదికను ముంబై తీసుకువచ్చిన పోలీసులు.. నిందితురాలిని కోర్టులో హాజరుపరిచారు. 2021లో.. వేదిక.. ఆలియాకి పీఏగా పని చేసింది. ఈ క్రమంలో ఆలియా ప్రొడక్షన్ హౌస్ పనులు కూడా చక్కబెట్టేది. ఈ క్రమంలోనే ఆమె దొంగ బిల్లులు పెట్టి, నమ్మకంగా ఆలియా చేత సంతకాలు చేయించి, 77 లక్షలు కొట్టేసింది. ఆ కొట్టేసిన డబ్బును స్నేహితురాలి అకౌంట్ కి మళ్లించి, తర్వాత ఆ మొత్తాన్ని తన అకౌంట్ కి మళ్లించుకుంది. ఆలియా తల్లి దీనిని గుర్తించటంతో ఈ గుట్టు బయటికొచ్చింది. అయితే ఈ విషయం ఇప్పుడు బీ టౌన్‌లో సంచలనంగా మారింది.