Rajendra Prasad: నటకిరిటీకి పద్మశ్రీ పురస్కారం.. మనసులో మాట పంచుకున్న రాజేంద్రప్రసాద్
కేంద్రప్రభుత్వం ఆదివారం (జనవరి 25) ప్రతిష్ఠాత్మక పద్మ పురస్కారాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. వివిధ రంగాలకు చెందిన మొత్తం 113 మందిని ఈ అవార్డులను ఎంపిక చేశారు. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి 11 మంది ప్రముఖులకు అవార్డులు దక్కడం విశేషం.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్ఠాత్మక పద్మ పురస్కారాల్లో ఏపీకి చెందిన నలుగురు, తెలంగాణకు చెందిన ఏడుగురు ప్రముఖులు ఎంపికయ్యారు. సినిమా రంగం నుంచి నటకిరీటీ రాజేంద్రప్రసాద్, మమ్ముట్టి, దివంగత బాలీవుడ్ యాక్టర్ ధర్మేంద్ర, మురళీమోహన్, మాధవన్ తదితరులు పద్మ పురస్కారాలకు ఎంపికైన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్ కళా విభాగంలో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. దీనిపై ఆయన స్పందిస్తూ ఒక వీడియోను రిలీజ్ చేశారు.
‘మీడియా మిత్రులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షక దేవుళ్లకు నమస్కారం. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నాకు ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని ప్రకటించడం నా జీవితంలో మర్చిపోలేని రోజు. ఈ గౌరవం కేవలం నాకు మాత్రమే దక్కింది అని నేను అనుకోవడం లేదు. ఇది తెలుగు హాస్యానికి, వినోదాన్ని కోరుకునే సామాన్య ప్రేక్షకుడికి దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా నా మనసులోని మాటను మీతో పంచుకుంటున్నాను. కళలను గౌరవించి, నన్ను ఈ పురస్కారానికి ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వానికి, జ్యూరీ సభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అసలు నేను ఈ స్థాయిలో నిలబడటానికి, ఈ అవార్డు అందుకోవడానికి ముఖ్య కారణం మీరే. 48 ఏళ్లుగా నేను ఏ వేషం వేసినా, ఏ ప్రయోగం చేసినా మీరందించిన ప్రేమే నాకు ఈరోజు ఇంతటి గుర్తింపు తెచ్చింది. నాలాంటి ఒక నటుడిని, మీ ఇంటి మనిషిలా ఆదరించి, “నటకిరీటి”ని చేసి, ఈ స్థాయికి తీసుకువచ్చింది మీ చప్పట్లే. ఆ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను. నన్ను ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండమని దీవించిన మీ అందరికీ మరోసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను’ అని చెప్పుకొచ్చారు రాజేంద్ర ప్రసాద్.
