లోన్‌లపై వడ్డీ రేట్లు తగ్గింపు వీడియో

Updated on: Feb 25, 2025 | 2:30 PM

ఐదేళ్ల తర్వాత రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా ఇటీవల రెపో రేటును తగ్గించింది. దానికి అనుగుణంగా ఇప్పుడు బ్యాంకులు కూడా రుణ రేట్లను సవరిస్తున్నాయి. ఇటీవల ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా వడ్డీరేట్లను తగ్గించగా.. ఇప్పుడు మరో ప్రభుత్వ బ్యాంకు పీఎన్‌బీ కూడా అదే నిర్ణయం తీసుకుంది. రిటైల్‌ రుణాలపై 25 బేసిస్‌ పాయింట్ల వరకు వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ప్రకటించింది. కొత్త వడ్డీ రేట్లు ఫిబ్రవరి 10 నుంచే అమల్లోకి తీసుకొచ్చినట్లు బ్యాంకు తాజా ప్రకటనలో తెలిపింది.

 గృహ రుణాలతో పాటు, కారు, ఎడ్యుకేషన్‌, పర్సనల్‌ లోన్లపై ఈ తగ్గింపు వర్తించనుంది. తాజా సవరణతో పీఎన్‌బీలో గృహ రుణాల ప్రారంభ రేటు 8.15శాతానికి దిగొచ్చింది. దీంతో రూ.లక్ష రుణానికి ఈఎంఐ 744 రూపాయలుగా ఉంటుందని బ్యాంకు తెలిపింది. ఇక, ఆటోమొబైల్‌ రుణాలపై వడ్డీ రేటు 8.50 శాతం నుంచి ప్రారంభం కానుంది. విద్యా రుణాలపై కనిష్ఠ వడ్డీని 7.85 శాతానికి తగ్గించినట్లు పీఎన్‌బీ తెలిపింది. అటు వ్యక్తిగత రుణాలపై సవరించిన వడ్డీ రేటు 11.25 శాతంగా ఉన్నట్లు తెలిపింది. ఫిబ్రవరి 7న రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రెపో రేటును 6.50 శాతం నుంచి 25 బేసిస్‌ పాయింట్లు తగ్గించి 6.25 శాతానికి తగ్గించింది. దీంతో పలు బ్యాంకులు కూడా తమ రుణాలపై వడ్డీ రేట్లను సవరిస్తున్నాయి. గతవారం ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌ మార్క్‌ ఆధారిత లెండింగ్‌ రేట్‌ (EBLR), రెపో లింక్డ్‌ లెండింగ్‌ రేట్లను (RLLR) ఎస్‌బీఐ 25 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గించింది.