AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: ఈపీఎఫ్ ఖాతాదారు మరణిస్తే కుటుంబానికి ఏ ప్రయోజనాలు అందుతాయి? క్లెయిమ్ ప్రక్రియ ఇదే!

EPFO: ఈపీఎఫ్ ఖాతాదారు మరణిస్తే కుటుంబానికి ఏ ప్రయోజనాలు అందుతాయి? క్లెయిమ్ ప్రక్రియ ఇదే!

Phani CH
|

Updated on: Sep 26, 2026 | 5:05 PM

Share

ఉద్యోగి మరణించిన తర్వాత కుటుంబ సభ్యులకు EPFO ద్వారా పీఎఫ్‌, పెన్షన్‌, EDLI బీమా వంటి ప్రయోజనాలు అందే అవకాశం ఉంటుంది. పీఎఫ్‌ మొత్తాన్ని వడ్డీతో కలిపి క్లెయిమ్‌ చేసుకోవచ్చు. అర్హత ఉంటే జీవిత భాగస్వామి, పిల్లలకు కుటుంబ పెన్షన్‌ లభిస్తుంది. ఉద్యోగి సర్వీసులో ఉండగానే మరణిస్తే EDLI కింద గరిష్ఠంగా రూ.7 లక్షల బీమా ప్రయోజనం ఉంటుంది. నామినీ లేదా అర్హులైన కుటుంబ సభ్యులు అవసరమైన పత్రాలతో క్లెయిమ్‌ చేయవచ్చు.

ప్రభుత్వ లేదా ప్రైవేటు రంగాల్లో పనిచేసే ఉద్యోగుల సామాజిక భద్రత కోసం ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ EPFO అనేక సేవలను అందిస్తోంది. ఉద్యోగం చేస్తున్న సమయంలో ఖాతాదారుడి భవిష్యత్తు కోసం పొదుపు చేయడమే కాకుండా, ఒకవేళ దురదృష్టవశాత్తు ఆ ఉద్యోగి సర్వీసులో ఉండగా లేదా ఆ తర్వాత మరణిస్తే.. వారిపై ఆధారపడిన కుటుంబానికి ఆర్థికంగా కొండంత అండగా నిలుస్తుంది. ఈపీఎఫ్ఓ అందించే కీలక ప్రయోజనాలు, వాటిని క్లెయిమ్ చేసుకునే విధానంపై పూర్తి అవగాహన ఉండటం ప్రతి కుటుంబానికి ఎంతైనా అవసరం. ఖాతాదారుడు మరణించిన తర్వాత వారి నామినీ లేదా చట్టబద్ధమైన కుటుంబ సభ్యులు మూడు రకాల ఆర్థిక ప్రయోజనాలను ఒకేసారి పొందేందుకు అర్హత సాధిస్తారు. ఇందులో భాగంగా…మరణించిన సభ్యుడి పీఎఫ్ ఖాతాలో జమ అయిన మొత్తం సొమ్మును వడ్డీతో సహా కుటుంబానికి చెల్లిస్తారు. దీనిని పొందేందుకు ‘ఫారం 20’ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇది లబ్ధిదారులకు ఒకేసారి అందుతుంది. రెండోది.. సభ్యుడి సర్వీసు కాలాన్ని బట్టి అర్హులైన జీవిత భాగస్వామికి మరియు పిల్లలకు నెలనెలా పెన్షన్ అందుతుంది. దీనిని ‘సర్వైవర్ పెన్షన్’ అంటారు. ఈ ప్రయోజనం కోసం ‘ఫారం 10D’ నింపి సమర్పించాలి. ఇది ఆ కుటుంబానికి ప్రతి నెలా స్థిరమైన జీవనాధారంగా ఉపయోగపడుతుంది. ఒకవేళ ఈపీఎఫ్ సభ్యుడు సర్వీసులో ఉండగానే మరణిస్తే, ‘ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్’ పథకం కింద వారి కుటుంబానికి ఉచితంగా బీమా సొమ్ము లభిస్తుంది. ప్రస్తుతం ఈ పథకం ద్వారా గరిష్ఠంగా రూ.7 లక్షల వరకు ఉచిత బీమా హామీ లభిస్తుంది. విశేషమేమిటంటే.. ఈ బీమా సౌకర్యం కోసం ఉద్యోగి తన జీతం నుంచి ఎలాంటి అదనపు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. దీనిని క్లెయిమ్ చేయడానికి ‘ఫారం 5IF’ ను ఉపయోగించాలి. ఈపీఎఫ్ ప్రయోజనాలను పొందడానికి.. మొదటి ప్రాధాన్యత ఉద్యోగి నమోదు చేసిన నామినీకి మాత్రమే ఉంటుంది. ఒకవేళ ఖాతాదారుడు నామినీని నమోదు చేయకపోయినా లేదా ఆ నామినేషన్ చెల్లకపోయినా.. చట్టబద్ధమైన కుటుంబ సభ్యులు, లేదా వారసులు ఈ ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, ఈ సందర్భంలో వారసత్వ ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఈ క్లెయిమ్ ప్రక్రియను ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానాల్లో పూర్తి చేయవచ్చు. ఇందుకోసం.. మరణించిన సభ్యుడి ఒరిజినల్ మరణ ధ్రువీకరణ పత్రం, సభ్యుడి 12 అంకెల యూఏఎన్ నెంబరు, క్లెయిమ్ చేస్తున్న నామినీ లేదా కుటుంబ సభ్యుడి ఆధార్ కార్డ్, పేరు ఇంకా పుట్టిన తేదీ వివరాలు, లబ్ధిదారుడి బ్యాంకు ఖాతా రుజువు, అలాగే, అవసరాన్ని బట్టి పిల్లల వయసు ధ్రువీకరణ పత్రం లేదా లీగల్ హెయిర్ సర్టిఫికేట్ సమర్పించాలి. ఒకవేళ ఇలాంటి దురదృష్టకర సంఘటన జరిగితే కుటుంబ సభ్యులు వీలైనంత త్వరగా ఉద్యోగి పనిచేసిన చివరి కంపెనీ యాజమాన్యానికి సమాచారం అందించాలి. పీఎఫ్ సొమ్ము త్వరగానే సెటిల్ అయినప్పటికీ.. పెన్షన్, బీమా క్లెయిమ్‌లకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Arunachalam: అరుణాచల కొండకు ప్రకృతి చికిత్స.. ఫలిస్తుందా!

BIS: ఇకపై స్క్రీన్ గార్డులకు BIS తప్పనిసరి

PhonePe: ఫోన్‌పే భారీ విస్తరణ.. 20,000 ఉద్యోగాలు

Vijayawada: ఏపీలో భారీ వర్షాలు ప్రకాశం బ్యారేజీకి పోటెత్తిన వరద

Follow Us