ఆ ఊరే.. ఓ రంగస్థలం.. అక్కడ అందరూ పాత్రధారులే..!
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలోని మోదుకొండమ్మ జాతర శతాబ్దకాలంగా ప్రత్యేక సంప్రదాయంతో కొనసాగుతోంది. గ్రామస్తులు విభిన్న వేషధారణలతో మొక్కులు తీర్చుకోగా, వేలాది మహిళలు బోనాలు సమర్పిస్తారు. చివరి రోజు నిప్పుల గుండం తొక్కుతూ వేడుకలు ముగుస్తాయి. దేశ విదేశాల్లో ఉన్న గ్రామస్థులు కూడా ఈ జాతర కోసం స్వగ్రామానికి చేరుకుని సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.
సాధారణంగా అమ్మవారికి మొక్కులు తీర్చుకోవాలంటే కోళ్ళు, మేకల బలులు ఇస్తారు లేదా కొబ్బరికాయలు కొడతారు. కానీ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో మాత్రం వందేళ్లుగా ఓ వింత ఆచారం కొనసాగుతోంది. ఇక్కడి మోదుకొండమ్మ అమ్మవారి జాతరలో ఊరి జనం విభిన్న వేషధారణలతో వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. ఆషాడ మాసంలో వారం రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే ఈ జాతరలో శ్రీరంగపట్నం గ్రామం ఓ రంగస్థలాన్ని తలపిస్తుంది. విదేశాల్లో లేదా ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన ఊరి ప్రజలందరూ జాతర సమయానికి స్వగ్రామానికి చేరుకుంటారు. గ్రామ కట్టుబాట్ల ప్రకారం శ్రీరంగపట్నం గ్రామస్తులు లేదా వారి బంధువులు మాత్రమే వేషాలు వేయాలి. ఊళ్లో ప్రశాంతత, విద్య, ఉద్యోగం, ఆరోగ్య సమస్యల నివారణ కోసం అమ్మవారికి మొక్కుకుని ప్రతి ఇంట్లోంచి కనీసం ఒక్కరైనా వేషధారణ ధరిస్తారు. లాభాపేక్ష లేకుండా సుమారు 450 మందికి పైగా గ్రామస్తులు విభిన్న పాత్రలు ధరించి డిజే పాటల కేరింతలతో ఊరేగుతూ అలరిస్తారు. ఈ జాతరలో మరో ప్రత్యేకత ఏంటంటే.. తెలంగాణ తరహాలో దాదాపు 4,000 మందికి పైగా ఆడపడుచులు భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పిస్తారు. జాతర ముగింపు రోజున ఆలయం వద్ద నిప్పుల గుండం తొక్కి వేడుకలను దిగ్విజయంగా పూర్తి చేస్తారు. గ్రామంలో ఏ సమస్య వచ్చినా ఇలవేల్పు మోదుకొండమ్మకు చెప్పుకుంటామని, కోరిన కోరికలు తీర్చే అమ్మవారి జాతరలో వంశపారంపర్యంగా వేషాలు వేయడం తమ ఆచారం అంటున్నారు గ్రామస్తులు. వందేళ్లుగా ఇదే సంప్రదాయం కొనసాగుతుందని తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు డిస్కో లైట్ల బెడద.. ల్యాండింగ్ వేళ ముప్పుగా మారిన లేజర్ లైట్లు
ప్రాణాలు తీస్తున్న లిఫ్ట్ ప్రమాదాలు.. రెండు రోజుల్లో ఇద్దరు మృతి
ఏ ఊరి పులి రా ఇది! డ్రోన్లకే షాకిస్తోంది..!
WhatsApp: వాట్సాప్ యూజర్లకు బిగ్ షాక్..అకౌంట్లు బ్లాక్!
అరుదైన పెళ్లి వేడుక.. కవల వరులు, కవల వధువులు.. ఫాదర్లు, సేవకులు కూడా కవలలే!
