జో బైడెన్ అధికారిక విజేత అయ్యారా ? అప్పుడే వైట్ హౌస్ వీడుతా ! డొనాల్డ్ ట్రంప్ మంకుపట్టు

అమెరికా ఎన్నికల్లో జో బైడెన్ అధికారికంగా విజయం సాధించారా అన్న విషయం నిర్ధారణగా తేలిన తరువాతే తాను వైట్ హౌస్ ను వీడుతానని డొనాల్డ్ ట్రంప్ అన్నారు.

  • Umakanth Rao
  • Publish Date - 4:14 pm, Fri, 27 November 20
జో బైడెన్ అధికారిక విజేత అయ్యారా ? అప్పుడే వైట్ హౌస్ వీడుతా ! డొనాల్డ్ ట్రంప్ మంకుపట్టు

అమెరికా ఎన్నికల్లో జో బైడెన్ అధికారికంగా విజయం సాధించారా అన్న విషయం నిర్ధారణగా తేలిన తరువాతే తాను వైట్ హౌస్ ను వీడుతానని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఓట్ల రిగ్గింగ్ జరిగినప్పటికీ బైడెన్ అసలు విన్నరా కాదా అన్నది తేలాల్సి ఉందన్నారు. అప్పుడే ఈ శ్వేత సౌధాన్ని వీడుతానని షరతు పెట్టారు. ఎన్నికల్లో తన ఓటమిని ఒప్పుకోని ట్రంప్ ఇలా రోజుకో తకరారు పెడుతున్నారు. ఓట్ల లెక్కింపులో ఫ్రాడ్ జరిగిందని ఆయన చేసిన ఆరోపణలను కోర్టులు తోసిపుచ్ఛుతున్నప్పటికీ నేను మాత్రం వైట్ హౌస్ ను వదిలేది లేదంటున్నారు. ఓ సందర్భంలో ఆయన తన ఓటమిని దాదాపు అంగీకరించినప్పటికీ వాషింగ్టన్ లో తన అభిమానులు, మద్దతుదారులు పెద్దఎత్తున తనకు అనుకూలంగా చేసిన ప్రదర్శనతో ట్రంప్  మళ్ళీ రెచ్చి పోయారు. బైడెన్ విజయం సాధించినట్టు ఎలెక్టోరల్ కాలేజ్ ధృవీకరిస్తే మీరు వైట్ హౌస్ వదులుతారా అని మీడియా ప్రశ్నించగా.’తప్పకుండా’ అని అన్నారాయన. అయితే అంతలోనే ..ఎలెక్టోరల్ కాలేజ్ అలా ప్రకటిస్తే అది తప్పిదమే అవుతుంది అన్నారు. ఓటమిని ఒప్పుకోవడం చాలా కష్టం అని వ్యాఖ్యానించారు.

ప్రస్తుత కాలానికి, జనవరి 20 కి మధ్య ఎన్నో విషయాలు జరగవచ్చు అని ట్రంప్ పేర్కొన్నారు. అసలిది వంద శాతం రిగ్గింగ్ ఎలెక్షన్ అని ఆయన అంతకుముందు ట్వీట్ చేశారు. ఈ ఎన్నికలను తిప్పికొట్టాలని తన రిపబ్లికన్ మద్దతుదారులను కోరారు. నేను త్వరలో జార్జియా రాష్ట్రానికి వెళ్లి ఏ పార్టీ విజయం సాధించిందో కనుక్కుంటాను అని తెలిపారు. థాంక్స్ గివింగ్ రోజున ఆయన వీడియో లింక్ ద్వారా సైనిక సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు.

ఇలా  ఉండగా… జో బైడెన్ విజయాన్ని సర్టిఫై చేసేందుకు ఎలెక్టోరల్ కాలేజ్ డిసెంబరు 14 న సమావేశమవుతోంది. అప్పుడు బైడెన్ గెలిచినట్టు అధికారికంగా ప్రకటిస్తారు. బైడెన్ కి 306, ట్రంప్ కు 232 ఎలెక్టోరల్ కాలేజ్ ఓట్లు లభించిన విషయం తెలిసిందే.. ఇంత జరిగినా ట్రంప్ మాత్రం తన మంకు పట్టు వీడకపోవడం పరిశీలకులను ఆశ్చర్యపరుస్తోంది.