
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మెగా ప్రాజెక్టుల నిర్మాణంలో చైనా వేగం గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా, చైనా నైరుతి ప్రాంతంలోని ప్రముఖ పర్వత నగరమైన చోంగ్‌కింగ్‌లో చోంగ్‌కింగ్ ఈస్ట్ రైల్వే స్టేషన్ పేరుతో ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్‌ను నిర్మించి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ప్రాజెక్ట్ దాని భారీ పరిమాణంతోనే కాకుండా, నిర్మించిన వేగంతోనూ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది.
సాధారణంగా ఇంత పెద్ద ప్రాజెక్టులను మైదాన ప్రాంతాలలో నిర్మిస్తారు. కానీ, చోంగ్‌కింగ్ నగరం కొండలు, లోయలతో కూడి ఉండటం వల్ల ఇంజనీర్లు ఒక పెద్ద కొండను తొలిచి, చదును చేసి ఈ స్టేషన్‌ను నిర్మించాల్సి వచ్చింది. ఈ స్టేషన్ మొత్తం నిర్మాణ విస్తీర్ణం సుమారు 1.22 మిలియన్ చదరపు మీటర్లు. ఇది ఎంత పెద్దదంటే, దాదాపు 170 అంతర్జాతీయ ఫుట్‌బాల్ మైదానాలు ఇందులో సులభంగా కలిసిపోతాయి. న్యూయార్క్‌లోని ప్రసిద్ధ గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ కంటే ఇది ఐదు రెట్లు పెద్దది.
ఇంతటి భారీ మెగా ప్రాజెక్టును పూర్తి చేయడానికి సాధారణంగా దశాబ్ద కాలం పడుతుంది. కానీ, చైనా దీనిని కేవలం 38 నెలల రికార్డు సమయంలోనే పూర్తి చేసింది. దీని వెనుక వేలాది మంది కార్మికులతో పాటు అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), 5G నెట్‌వర్క్, రోబోల సైన్యం రాత్రింబగళ్లు పనిచేసింది. 800 కేజీల బరువున్న గ్లాస్ ప్యానెళ్లను అమర్చే రోబోలు, లేజర్ సహాయంతో సిమెంట్‌ను సమానంగా చేసే రోబోలు, వెల్డింగ్ రోబోలను ఈ నిర్మాణంలో విస్తృతంగా ఉపయోగించారు.
ఈ భారీ స్టేషన్‌లో ప్రయాణికుల కోసం అద్భుతమైన సదుపాయాలు ఉన్నాయి. ఇందులో 15 ప్లాట్‌ఫారమ్‌లు, 29 హై-స్పీడ్ రైలు ట్రాక్‌లు ఉన్నాయి. ఇది మొత్తం 8 అంతస్తులతో (4 భూమి పైన, 4 భూగర్భంలో) నిర్మించబడింది. ఇది కేవలం రైళ్లు ఆగే చోటు మాత్రమే కాదు.. ఇందులో షాపింగ్ మాల్స్, హోటళ్లు, ఆఫీసులు, 4 మెట్రో లైన్లు, విమానాశ్రయానికి నేరుగా కనెక్టివిటీ ఉన్నాయి.
ఈ స్టేషన్ 16,500 టన్నుల బరువున్న భారీ వంపు తిరిగిన ఉక్కు పైకప్పును (Roof) భూమిపైనే అసెంబుల్ చేసి, అత్యాధునిక హైడ్రాలిక్ జాక్స్ సహాయంతో మిల్లీమీటర్ల ఖచ్చితత్వంతో పైకి లేపి అమర్చారు. ఈ చోంగ్‌కింగ్ ఈస్ట్ స్టేషన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడంతో, బీజింగ్, షాంఘై వంటి చైనాలోని 14 ప్రధాన నగరాలకు ప్రయాణ సమయం సగానికి పైగా తగ్గిపోయింది. చైనా సాధించిన ఈ ఇంజనీరింగ్ విజయం భవిష్యత్ నగరాల రవాణా వ్యవస్థకు ఒక కొత్త రోడ్‌మ్యాప్‌గా నిలుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..