భర్తను కాటేసిన పాము.. నోటితో విషం తీసేసిన భార్య.. ఆ తర్వాత ఎవరూ ఊహించని సీన్..

భర్తకు పాము కరిచింది. ఈ నేపథ్యంలో భర్తను కాపాడుకోవాలనే ఆరాటంతో అతని ఒంట్లోని విషాన్ని నోటితో పీల్చేసే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత జరిగిన పరిణామం ఊహించని విధంగా ఆమె ప్రాణాలనే చావు అంచుల దాకా తీసుకెళ్లాయి. సినిమాల్లో విధంగా అసలు నోటితో విషం పీల్చితే ఏం జరుగుతుంది? వైద్యులు ఏమంటున్నారు..? అనేది తెలుసుకుందాం..

భర్తను కాటేసిన పాము.. నోటితో విషం తీసేసిన భార్య.. ఆ తర్వాత ఎవరూ ఊహించని సీన్..
Woman Tries To Extract Cobra Venom From Husband Body

Updated on: Jul 12, 2026 | 11:32 AM

సినిమాల్లో హీరోకో, హీరోయిన్‌కో పాము కరిస్తే.. వెంటనే అవతలి వాళ్లు తమ నోటితో ఆ విషాన్ని పీల్చి ఉమ్మేయడం, దాంతో బాధితులు ప్రాణాలతో బయటపడటం మనం చాలా సినిమాల్లో చూసే ఉంటాం. సరిగ్గా ఇలాంటి సినిమా సీన్‌నే నిజ జీవితంలో రిపీట్ చేసింది ఒక మహిళ. పాము కాటుకు గురైన తన భర్త ప్రాణాలను కాపాడాలనే ఆరాటంతో.. అతని శరీరంలోని విషాన్ని తన నోటితో పీల్చేసింది. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఆమెను చావు అంచుల దాకా తీసుకెళ్లాయి. ఈ విస్తుగొలిపే సంఘటన చైనాలోని యునాన్ ప్రావిన్స్‌లో వెలుగుచూసింది. ఒక రైతు తన పొలంలో పని చేసుకుంటుండగా హఠాత్తుగా ఒక నాగుపాము అతడిని కాటు వేసింది. ఆ సమయంలో అతని భార్య కూడా పక్కనే ఉంది. పాము కరిచిన కొద్దిసేపటికే భర్త వేలు వాచిపోయి, కళ్లు తిరుగుతూ కిందపడిపోయాడు. భర్త పరిస్థితిని చూసి కంగారుపడిన ఆమె, సినిమాల్లో చూసినట్లుగా కాటు వేసిన చోట నోరు పెట్టి విషాన్ని బయటకు పీల్చడం ప్రారంభించింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు వెంటనే ఆ రైతును ఆసుపత్రికి తరలించారు. ప్రాథమికంగా భార్యకు ఏమీ కానట్లే కనిపించినా.. అసలు కథ ఆ తర్వాతే మొదలైంది.

కొన్ని గంటల్లోనే సీన్ రివర్స్..

భర్తకు చికిత్స జరుగుతుండగానే, కొన్ని గంటల తర్వాత ఆ మహిళ పరిస్థితి కూడా విషమించడం ప్రారంభమైంది. మొదట ఆమె నోరు, నాలుక మొద్దుబారిపోయాయి. ఆ తర్వాత ముఖం, చేతులు, కాళ్లు కూడా స్పర్శ కోల్పోయాయి. మరుసటి రోజు నాటికి పరిస్థితి మరింత దారుణంగా మారడంతో కుటుంబ సభ్యులు ఆమెను కూడా అదే ఆసుపత్రిలో చేర్పించాల్సి వచ్చింది. వైద్యులు ఇద్దరినీ పరీక్షించి, భార్యాభర్తలిద్దరూ పాము విషం బారిన పడ్డారని నిర్ధారించారు. వెంటనే ఇద్దరికీ యాంటీ వేనమ్ ఇంజెక్షన్లు ఇచ్చి అత్యవసర చికిత్స అందించారు. అదృష్టవశాత్తూ సకాలంలో వైద్యం అందడంతో కొద్దిరోజుల తర్వాత ఇద్దరూ కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

డాక్టర్ల సీరియస్ వార్నింగ్: అది ప్రాణాంతకం

ఈ ఘటనపై వైద్య నిపుణులు తీవ్రంగా స్పందించారు. సినిమాల్లో చూపించే ఇలాంటి స్టంట్స్ నిజ జీవితంలో చేయడం ముమ్మాటికీ ప్రాణాంతకమని హెచ్చరించారు. మన నోటి లోపల ఉండే చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. అక్కడ ఉండే చిన్న చిన్న రక్తనాళాల ద్వారా పాము విషం క్షణాల్లో శరీరంలోకి, రక్తప్రవాహంలోకి శోషించబడుతుంది. ఒకవేళ నోట్లో చిన్నపాటి పుండ్లు, పంటి సమస్యలు లేదా చిగుళ్ల నుంచి రక్తం కారే సమస్యలు ఉంటే.. విషం నేరుగా ప్రాణాలకే ముప్పు తెస్తుంది.

పాము కరిస్తే ఏం చేయాలి?

కదలికలు వద్దు: పాము కాటుకు గురైన బాధితుడిని అస్సలు కదల్చకూడదు. కదలికలు ఎక్కువైతే విషం శరీరంలోకి వేగంగా పాకుతుంది.

వెంటనే ఆసుపత్రికి: ఎటువంటి నాటు వైద్యాలు, సినిమా ట్రిక్కులు నమ్మకుండా వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించాలి.

పామును గుర్తించడం: వీలైతే కరిచిన పామును ఫొటో తీయడం లేదా అది ఎలా ఉందో డాక్టర్‌కు వివరిస్తే.. దానికి సరిపోయే విరుగుడును త్వరగా ఇచ్చే అవకాశం ఉంటుంది.

Follow Us