ఓ మహిళ తన భర్త చిన్ననాటి ఫోటో ఆల్బమ్‌ను తిరగేస్తోంది. అందులో ఆమె ఓ ఫోటో చూడగానే దెబ్బకు స్టన్ అయ్యింది. అసలు ఇదెలా సాధ్యమైందో ఆమె ఊహకు అందట్లేదు. ఇంతకీ ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం..
వివరాల్లోకి వెళ్తే.. ఈక్వెడార్‌కు చెందిన ఐలిజ్ మెలినా కొద్దిరోజుల క్రితం తన అత్తగారింటికి వెళ్లింది. అక్కడ ఆమెను తన భర్త పెడ్రో చిన్ననాటి ఫోటోలను చూపించమని కోరింది. అనంతరం ఆ ఫోటో ఆల్బమ్‌ను తిరగేస్తుండగా మెలినా అందులో ఓ ఫోటోను చూసి దెబ్బకు షాకైంది. అసలు ఇదెలా సాధ్యమైందో ఆమెకు అర్ధం కాలేదు. ఎందుకంటే.. ఆ ఫోటోలో తన భర్త వెనుక ఆమె కూడా ఉంది. ఏదొక పరేడ్ జరుగుతున్న సమయంలో తన భర్త చిన్నప్పుడు ఆ ఫోటో తీసుకోగా.. అందులో ఆమె కూడా ఉంది. అప్పుడు వీరిద్దరికీ అస్సలు పరిచయం లేదు. అందుకే ఆ ఫోటోలో తనను తాను చూసుకుని మెలినా ఆశ్చర్యపోయింది.
‘ఆ ఫోటో చూడగానే నేను, నా భర్త ఆశ్చర్యపోయాం. భయం, ఆనందం, ఆశ్చర్యం.. ఇలా అనేక భావోద్వేగాలు ఒకేసారి వచ్చాయి. ఓ పరేడ్‌లో నా భర్త తీసుకున్న ఫోటో అది. అందులో నేను కూడా భాగం కావడమన్నది నమ్మశక్యం కావట్లేదు. నాకు అసలు ఆ పరేడ్, ఈ ఫోటో గురించి ఏం గుర్తులేదు. అప్పుడు అతనెవరో నాకు తెలియదు. 17 సంవత్సరాలు వచ్చేవరకు నేను పెడ్రోను కలవలేదు. ఆ తర్వాతే అతడు నాకు తెలుసు’ అని మెలినా చెప్పుకొచ్చింది. కాగా, మెలినా, పెడ్రో యూనివర్సిటీ సమయంలో ఒకరినొకరు ప్రేమించుకున్నారు.. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు.