
వయసు పెరగడం అనేది ప్రకృతి సహజం. కానీ, ఆ వృద్ధాప్యాన్ని అడ్డుకుని ఎప్పటికీ యవ్వనంగా ఉండాలని ఎవరికి ఉండదు? సరిగ్గా అలాంటి ప్రయత్నం చేసింది అమెరికాకు చెందిన జెన్ ప్లాంక్ అనే మహిళ. ఆమె తన నిత్యయవ్వనం కోరికను నిజం చేసుకోవడానికి ఏకంగా లక్షలాది రూపాయలు ఖర్చు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. జెన్ ప్లాంక్ తన 40వ ఏట నుండి ఈ మేకోవర్ ప్రయాణాన్ని ప్రారంభించారు. ముఖంపై ముడతలు రాకుండా ఉండటానికి నిరంతరం బోటాక్స్ ఇంజెక్షన్లు తీసుకోవడం దగ్గర నుండి, ముఖ చర్మాన్ని టైట్‌గా ఉంచే ‘ఫేస్ లిఫ్ట్’ సర్జరీ వరకు ఆమె వెనక్కి తగ్గలేదు. మొత్తం మీద ఆమె తన రూపం కోసం రూ.94 లక్షలకు పైగా వెచ్చించారు.
ఫలితం ఎలా ఉందంటే..
సర్జరీల తర్వాత ఆమె ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా, అవి వైరల్ అయ్యాయి. 50 ఏళ్ల వయసులో కూడా ఆమె చర్మం ఎంతో కాంతివంతంగా, ఎటువంటి ముడతలు లేకుండా ఉండటం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఆమె ఫోటోలు చూసిన వారు ఈమెకు 50 ఏళ్లంటే ఎవరూ నమ్మరు అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ప్రతి నాణేనికి రెండు పార్శ్వాలు ఉన్నట్లే, ఆమెపై విమర్శలు కూడా వస్తున్నాయి. కృత్రిమ పద్ధతుల ద్వారా అందాన్ని పెంచుకోవడం భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని కొందరు హెచ్చరిస్తున్నారు. కానీ, జెన్ మాత్రం వీటిని పట్టించుకోవడం లేదు. నేను నా డబ్బును నా సంతోషం కోసం ఖర్చు చేస్తున్నాను. అద్దంలో నన్ను నేను చూసుకున్నప్పుడు నాకు గర్వంగా అనిపిస్తుంది అని ఆమె ధీమాగా చెబుతున్నారు.
నేటి ఆధునిక కాలంలో బయో హాకింగ్, యాంటీ ఏజింగ్ ట్రీట్‌మెంట్లు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. జెన్ ప్లాంక్ ఉదంతం అందం పట్ల మనుషులకు ఉన్న మక్కువను, అందుకోసం వారు ఎంతటి సాహసానికైనా సిద్ధపడతారనే విషయాన్ని స్పష్టం చేస్తోంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..