
ఇల్లు అనేది కేవలం సిమెంట్, ఇటుకలతో నిర్మించిన కట్టడం మాత్రమే కాదు.. దానితో ఎన్నో తరాల అనుబంధాలు, మధురమైన జ్ఞాపకాలు ముడిపడి ఉంటాయి. తమ పూర్వీకుల చరిత్ర ఉన్న ఆ ఇళ్లను వదులుకోవడానికి ఎవరూ ఇష్టపడరు. అలాంటి ఒక అరుదైన, ఆశ్చర్యకరమైన సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది. తన కుటుంబ జ్ఞాపకాలను పదిలంగా కాపాడుకోవడానికి ఒక మహిళ ఏకంగా 112 ఏళ్ల నాటి తన పురాతన ఇంటిని కోట్ల రూపాయలు వెచ్చించి కిలోమీటర్ల దూరం తరలించింది.
అమెరికాలోని నార్త్ డకోటాకు చెందిన జెసాండ్రా శ్మిట్ తన కుటుంబంతో కలిసి పాత ఇళ్ల కోసం వెతుకుతున్నారు. ఈ క్రమంలో ఆమెకు ఫేస్‌బుక్ ద్వారా తన బంధువుల వద్ద ఉన్న ఓ పాత ఇల్లు గురించి తెలిసింది. ఆ ఇల్లు మరెవరో కాదు, జెసాండ్రా పర్-పర్దాదా అయిన ఫ్రీడ్రిఖ్ 1914లో నిర్మించిన చారిత్రక ఇల్లు. ఆ ఇంటితో తమ కుటుంబానికి బలమైన అనుబంధం ఉందని భావించిన ఆమె, బంధువుల నుంచి దానిని కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చారు.
ఆ పాత ఇంటిని దాని స్థలం నుంచి తొలగించి, తాము కొత్తగా కొనుగోలు చేసిన భూమికి చేర్చడం అంత తేలికైన పని కాదు. సుమారు 30 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడవు ఉన్న ఈ భారీ రెండు అంతస్తుల ఇల్లును తరలించేందుకు భారీగా శ్రమించాల్సి వచ్చింది. ఇంటి కింద ఉక్కు బీమ్‌లు అమర్చి, జాక్‌ల సహాయంతో పైకి లేపి, రెండు నెలలకు పైగా ట్రక్కులు, టైర్లపై నిలిపి కొత్త ప్రాంతానికి రవాణా చేశారు.
ఈ ప్రయాణ మార్గంలో అడ్డంకులు రాకుండా విద్యుత్ లైన్లను తాత్కాలికంగా తొలగించాల్సి వచ్చింది. ఈ మొత్తం ప్రాజెక్ట్ కింద ఇల్లు షిఫ్ట్ చేయడానికి, కొత్త బేస్‌మెంట్, ఫౌండేషన్ నిర్మాణం వంటి పనులన్నింటికీ కలిపి సుమారు 3,80,000 డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.3.5 కోట్లు) ఖర్చవుతుందని అంచనా వేశారు.
ఇంటిని తరలించే సమయంలో కుటుంబంలో విషాదాలు ఎదురైనప్పటికీ, జెసాండ్రా వెనకడుగు వేయలేదు. బంధువులందరూ కలిసి ఈ అరుదైన ఘట్టాన్ని కళ్లారా వీక్షించారు. ఇల్లు కొత్త ప్రాంతానికి చేరిన క్షణంలో కుటుంబ సభ్యులు ఆనంద భాష్పాలు రాల్చారు. డబ్బు కంటే కుటుంబ వారసత్వం, పూర్వీకుల జ్ఞాపకాలే ముఖ్యమని నిరూపించిన జెసాండ్రా సాహసం ప్రస్తుతం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..