
రాజస్థాన్‌లోని దౌసా జిల్లా పరిధిలోని NH-21 జాతీయ రహదారిపై ఒక షాకింగ్ , ఒంటిమీద రోమాలు నిక్కబొడుచుకునే ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. అత్యంత వేగంగా వస్తున్న ఒక భారీ మల్టీ-యాక్సిల్ ట్రైలర్ లారీ క్షణాల్లో అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడగా, సరిగ్గా దాని పక్కనే ఉన్న బైకర్లు తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. అసలు వీడియోలో ఏమి జరిగింది?
హైవేపై వేగంగా వెళ్తున్న ట్రైలర్ డ్రైవర్, తన ముందుకు అకస్మాత్తుగా వచ్చిన వాహనాన్ని చూసి చివరి నిమిషంలో గుర్తించాడు. ముందున్న ఆయిల్ ట్యాంకర్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టకుండా ఉండేందుకు, అతను లారీని ఒక్కసారిగా ఎడమ వైపు నుంచి కుడి వైపునకు తిప్పాడు. ఈ సడెన్ యూ టర్న్ వల్ల లారీ అదుపుతప్పి, రోడ్డుపై పల్టీలు కొడుతూ పక్కకు జారిపోయింది. ఆ సమయంలో సరిగ్గా లారీ పక్కనే వెళ్తున్న స్ప్లెండర్ బైక్‌ను అది కొద్దిలో మిస్ అయింది. ఈ ప్రమాదంలో ఒక విచిత్రమైన దృశ్యం అందరినీ ఆశ్చర్యపరిచింది.
అదేంటంటే.. లారీ తమపైకి వస్తోందని గ్రహించిన బైక్ రైడర్ వెంటనే పారపోయే ప్రయత్నం చేశాడు.. వెనుక ఉన్న వ్యక్తిని పట్టించుకోకుండా రాంగ్ సైడ్ వైపు పరుగులు తీశాడు. కెమెరాలో ఇది వింతగా అనిపించినప్పటికీ, దీనికి ప్రధాన కారణం మానసిక శాస్త్రంలో చెప్పే ఆత్మరక్షణ భావన అంటున్నారు నిపుణులు.
పల్టీలు కొడుతున్న లారీ ఏ వైపు పడుతుందో, ఎటు దొర్లుతుందో క్షణాల్లో అంచనా వేయడం సాధ్యం కాదు. ఆ కంగారులో రైడర్ తాను నిలబడిన దిశకు ఎదురుగా పరుగెత్తాల్సి వచ్చింది. వెనుక కూర్చున్న వ్యక్తి కూడా తన ప్రాణాలను కాపాడుకోవడానికి వెంటనే బైక్ దిగి పరుగెత్తాడు. ఇలాంటి అత్యవసర సమయాల్లో పరస్పర సమన్వయం చేసుకోవడం ఎవరికీ సాధ్యపడదు.
అంత పెద్ద లారీ పక్కనే బోల్తా పడినప్పటికీ, బైక్‌పై ఉన్న ఇద్దరూ ఎలాంటి తీవ్ర గాయాలు లేకుండా సురక్షితంగా తప్పించుకోవడం ఒక అద్భుతమనే అంటున్నారు నెటిజన్లు. అలాగే మరికొందరు ఈ వీడియోపై ఫన్నీ కామెంట్లు కూడా చేశారు.. ఈ ఆక్సిడెంట్ జరిగిన సమయంలో యముడు నిజంగానే లీవ్‌లో ఉన్నాడేమో, అందుకే ఆ ఇద్దరూ ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారని అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ హైవేలపై ప్రయాణించేటప్పుడు భారీ వాహనాల నుంచి తగినంత దూరం పాటించడం ఎంత ముఖ్యమో ఈ సంఘటన స్పష్టం చేస్తోంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..