అమెరికాలో హాలోవీన్ సందడి నెలకొంది. ఈ క్రమంలో కొందరు వాలంటీర్లు హాలోవీన్ రోజున సరస్సును శుభ్రం చేసే కార్యక్రమం చేపట్టారు. శుభ్రం చేస్తుండగా.. ఒక సూట్ కేస్ కంటపడింది.. దాన్ని తెరిచి చూడగా దుర్వాసన వచ్చింది. ఏంటోనని పరిశీలించగా.. మృతదేహం బయటపడింది.. ఎవరో చంపి మృతదేహాన్ని సూట్‌కేసులో పార్శిల్ చేసి.. సరస్సులో పడేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలో చోటుచేసుకుంది. హాలోవీన్ రోజున కాలిఫోర్నియాలోని ఓక్‌లాండ్‌లోని ఒక సరస్సును శుభ్రపరిచే సమయంలో సూట్‌కేస్‌లో హత్యకు గురైన వ్యక్తి మృతదేహం కనుగొన్నట్లు కాలిఫోర్నియా పోలీసులు తెలిపారు. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం.. వాలంటీర్లు మంగళవారం ఉదయం లేక్ మెరిట్‌ను శుభ్రం చేస్తుండగా, దాని అంచున తేలియాడుతున్న సూట్‌కేస్‌ను గుర్తించారు. ఆ తర్వాత వలను ఉపయోగించి.. బయటకు తీశారు. చివరకు సూట్‌కేస్‌లో మృతదేహం కనిపించడంతో షాక్‌కు గురయ్యారు.
ఆ వ్యక్తి తన 30 ఏళ్ల వయస్సులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సూట్‌కేస్‌ను తెరిచి చూడగానే ముందు దుర్వాసన వచ్చిందని.. కుళ్లిపోయిన స్థితిలో ఉన్నట్లు వాలంటీర్లు తెలిపారు. సూట్‌కేస్‌ను కనుగొన్న లేక్ మెరిట్ ఇన్‌స్టిట్యూట్‌లోని వాలంటీర్లలో కెవిన్ షోమో మాట్లాడుతూ.. సూట్ కేసులో ఉన్న మృతదేహాన్ని చూసి ఆశ్చర్యపోయానని.. ఇలాంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ముందుగా నెట్ స్తంభాలను ఉపయోగించి దానిని తమ వైపుకు లాగామని.. పట్టుకుంటే చాలా బరువుగా ఉందని మేము గ్రహించామని.. తెరచి చూడగానే మృతదేహం బయటపడ్డట్లు తెలిపారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు ఓక్లాండ్ పోలీసు కెప్టెన్ అలాన్ యు తెలిపారు. ఎవరు హత్య చేశారు.. మృతదేహాన్ని ఎక్కడ నుంచి తీసుకువచ్చారు.. ఇలా సాధ్యమయ్యే అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుని పరిశీలిస్తున్నామని తెలిపారు.
కాగా.. ఈ ఘటన కలకలం రేపింది. తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటుండటం ఆందోళన కలిగిస్తోందని స్థానికులు తెలిపారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..