Video: వెనిజులాకు తిరిగొచ్చిన ప్రతిపక్ష నేత మరియా కొరినా మచాడో

వెనిజులా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. దాదాపు ఏడాది కాలం ప్రవాసంలో ఉన్న నోబెల్ శాంతి బహుమతి విజేత, ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచాడో ఆదివారం తిరిగి తన దేశానికి చేరుకున్నారు. ఆమె రాకతో వెనిజులా రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ నెలకొంది. తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెజ్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Video: వెనిజులాకు తిరిగొచ్చిన ప్రతిపక్ష నేత మరియా కొరినా మచాడో
Venezuela Opposition Leader Machado Returns After Nearly A Year In Exile

Updated on: Oct 26, 2026 | 6:44 PM

వెనిజులా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. దాదాపు ఏడాది కాలం ప్రవాసంలో ఉన్న నోబెల్ శాంతి బహుమతి విజేత, ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచాడో ఆదివారం తిరిగి తన దేశానికి చేరుకున్నారు. ఆమె రాకతో వెనిజులా రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ నెలకొంది. తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెజ్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తిరిగి దేశంలో అడుగుపెట్టిన విషయాన్ని మచాడో సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ‘నేను ఇక్కడ ఉన్నాను. మీతోనే ఉన్నాను’ అంటూ స్పానిష్ భాషలో ఎక్స్‌ (X)లో పోస్టు చేశారు. మచాడో తిరిగి వెనిజులాకు చేరుకున్న విషయాన్ని ఆమె సన్నిహితుడు, మరో ప్రతిపక్ష నేత ఎడ్ముండో గొంజాలెజ్ ఉర్రుటియా ధ్రువీకరించారు. ‘వెనిజులా ప్రజలారా.. మన నాయకురాలు, ప్రియతమ మరియా కొరీనా మన దేశ గడ్డపై అడుగుపెట్టారని చెప్పడానికి ఎంతో సంతోషంగా ఉంది’ అని పోస్టులో పేర్కొన్నారు. తాను కూడా త్వరలో దేశానికి తిరిగి వస్తానని తెలిపారు.

చర్చికి వెళ్లిన మచాడో.. ఘన స్వాగతం

వెనిజులాలోని లారా రాష్ట్ర రాజధాని బార్కిసిమెటోలోని ఓ చర్చిలో జరిగిన మతపరమైన కార్యక్రమానికి మచాడో హాజరయ్యారు. ఆమెకు మద్దతుదారులు స్వాగతం పలికారు. ఆప్యాయంగా పలకరిస్తూ ఆలింగనం చేసుకున్నారు.  ఆ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దాదాపు ఏడాది తర్వాత ఆమె స్వదేశానికి తిరిగి రావడం ప్రతిపక్ష శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అదే సమయంలో దేశ రాజకీయ భవిష్యత్తుపై చర్చలు మళ్లీ మొదలయ్యాయి.

నోబెల్ బహుమతి కోసం రహస్యంగా దేశం వీడిన మచాడో

2025 డిసెంబర్‌లో నోబెల్ శాంతి బహుమతిని స్వీకరించేందుకు మచాడో రహస్యంగా వెనిజులా నుంచి నార్వేకు వెళ్లారు. అప్పటి నుంచి స్వదేశానికి తిరిగి రావడానికి పలుమార్లు ప్రయత్నించినప్పటికీ, వెనిజులా అధికారులు ఆమె ప్రవేశాన్ని అడ్డుకున్నారు. ఇప్పుడు తిరిగి దేశంలోకి రావడంతో రాబోయే రోజుల్లో ప్రతిపక్ష ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

మదురో తొలగింపు తర్వాత మారిన రాజకీయ పరిస్థితులు

వెనిజులా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురోను 2026 జనవరిలో అమెరికా బలగాలు అధికారంలో నుంచి తొలగించిన తర్వాత దేశంలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. మదురో ప్రభుత్వంలో ఉపాధ్యక్షురాలిగా పనిచేసిన డెల్సీ రోడ్రిగెజ్ తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వం ఆమె పరిపాలనకు మద్దతు ఇస్తోంది. 2024 వెనిజులా అధ్యక్ష ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి విజయం సాధించిందని ప్రతిపక్ష నేతలు చెబుతున్నారు. అయితే, అప్పట్లో మచాడో పోటీ చేయకుండా నిషేధం విధించడంతో ఆమె తరఫున ఎడ్ముండో గొంజాలెజ్ ఉర్రుటియా ఎన్నికల బరిలో నిలిచారు. ఎన్నికల్లో మదురో విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించగా, ప్రతిపక్షం మాత్రం ఆ ఫలితాలను తీవ్రంగా వ్యతిరేకించింది. అధికార మార్పిడి జరగకపోవడంతో గొంజాలెజ్ దేశం విడిచి ప్రవాసంలో ఉండాల్సి వచ్చింది.

మచాడో తిరుగు ప్రయాణంపై ట్రంప్ ఏమన్నారంటే?

మీడియాతో మాట్లాడిన ట్రంప్.. మచాడో తిరిగి వచ్చిన విషయం తనకు తెలియదని చెప్పారు. ఆమె క్షేమంగా ఉండాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ‘ఆమె చాలా మంచి మహిళ’ అని వ్యాఖ్యానించారు. మచాడో జనవరిలో ట్రంప్‌ను కలిసినప్పుడు తన నోబెల్ శాంతి బహుమతి పతకాన్ని ఆయనకు అందచేసారు. మదురోను తొలగించిన అమెరికా చర్యను ఆమె ప్రశంసించారు.

స్వేచ్ఛాయుత ఎన్నికలు జరగాలని అమెరికా పిలుపు

 

అమెరికా అందించిన మద్దతు కారణంగానే ఆమె తిరిగి రావడానికి పరిస్థితులు అనుకూలించాయని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్నారు. వెనిజులాలోని అన్ని రాజకీయ వర్గాల స్వేచ్ఛను గౌరవించాలని, స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చర్చలకు సహకరించాలని పిలుపునిచ్చారు.

మరోవైపు, డెల్సీ రోడ్రిగెజ్ తాత్కాలిక ప్రభుత్వం ప్రతిపక్షంలోని కొన్ని వర్గాలతో చర్చలు జరుపుతోంది. న్యాయవ్యవస్థలో సంస్కరణలకు అంగీకరించినప్పటికీ, తదుపరి అధ్యక్ష ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై ఇప్పటివరకు స్పష్టత లేదు. మచాడో స్వదేశానికి తిరిగి రావడంతో వెనిజులాలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ, కొత్త అధ్యక్ష ఎన్నికల నిర్వహణ అంశాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఆమె తిరిగి రావడం రాజకీయ మార్పునకు దారితీస్తుందా? ప్రతిపక్షానికి అధికారంలో భాగస్వామ్యం లభిస్తుందా?  ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Loading...
Unable to load recommendations.
Follow Us