‘భారత్‌ను చూసి నేర్చుకోండి’.. ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల పై ట్రంప్ ఆగ్రహం

Trump Slams US Federal Reserve: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్ ఆర్థిక వ్యవస్థను ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో తక్కువ వడ్డీ రేట్లు ఉన్నప్పటికీ 7 శాతం జీడీపీ వృద్ధి సాధిస్తోందని అమెరికాలోనూ వడ్డీ రేట్లు తగ్గిస్తే ఆర్థిక వృద్ధి 14, 15 శాతమే కాదు ఏకంగా 20 శాతానికి చేరుకునే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

‘భారత్‌ను చూసి నేర్చుకోండి’.. ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల పై ట్రంప్ ఆగ్రహం
Trump Cites Indias 7% Growth Says Us Gdp Could Hit 20% If Fed Cuts Interest Rates

Updated on: Nov 21, 2026 | 9:57 AM

Trump Slams US Federal Reserve: ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికా ఆర్థిక వృద్ధిని మరింత వేగవంతం చేయాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. ఇందుకోసం వడ్డీ రేట్లు తగ్గించాలని చాలా కాలంగా ఫెడరల్ రిజర్వ్‌పై ఒత్తిడి తెస్తున్నారు. తాజాగా ఈ విషయంలో భారత్‌ను ఉదాహరణగా చూపిస్తూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ తక్కువ వడ్డీ రేట్లతోనే 7 శాతం ఆర్థిక వృద్ధిని సాధిస్తుంటే అమెరికా మాత్రం అధిక వడ్డీ రేట్లతో ఎందుకు వెనుకబడాలని ప్రశ్నించారు. వడ్డీ రేట్లు తగ్గిస్తే అమెరికా జీడీపీ వృద్ధి ఊహించని స్థాయికి చేరుతుందని చెప్పుకొచ్చారు.

భారత్‌లో 7 శాతం.. అమెరికాలో 20 శాతం సాధ్యమేనా?

శుక్రవారం వైట్‌హౌస్‌లో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో తక్కువ వడ్డీ రేట్లు కొనసాగుతున్నప్పటికీ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. ‘భారత్‌ను చూడండి. అక్కడ వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ 7 శాతం జీడీపీ వృద్ధిని సాధిస్తున్నారు. అమెరికాలోనూ వడ్డీ రేట్లు తగ్గిస్తే మన జీడీపీ వృద్ధి 14, 15 శాతానికి.. బహుశా 20 శాతానికి కూడా చేరుకునేది. మనం అద్భుతంగా పనిచేస్తున్న సమయంలో వడ్డీ రేట్లు పెంచడం నిజంగా బాధాకరం’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ మరింత వేగంగా దూసుకెళ్లేందుకు తక్కువ వడ్డీ రేట్లు అవసరమన్నది ట్రంప్ వాదన. అయితే ఆయన చెప్పిన 20 శాతం జీడీపీ వృద్ధి ఒక అంచనా మాత్రమే. అది సాధ్యమవుతుందని నిర్ధారించే ఆర్థిక గణాంకాలు లేవు.

ఫెడరల్ రిజర్వ్‌ రాజకీయ ప్రేరేపితం

అమెరికా కేంద్ర బ్యాంకు అయిన ఫెడరల్ రిజర్వ్‌పై ట్రంప్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతున్న సమయంలోనే వడ్డీ రేట్లు పెంచి అభివృద్ధిని అడ్డుకుంటోందని ఆరోపించారు. ఫెడరల్ రిజర్వ్ వ్యవహారశైలి రాజకీయ ప్రేరేపితంగా ఉందని విమర్శించారు. గతంలో ఫెడరల్ రిజర్వ్ చైర్మన్‌గా పనిచేసిన అలన్ గ్రీన్‌స్పాన్‌ను ట్రంప్ ఈ సందర్భంగా ప్రశంసించారు. ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్న సమయంలోనూ వడ్డీ రేట్లను తగ్గించే నిర్ణయాలు తీసుకునేవారని గుర్తుచేశారు. వడ్డీ రేట్లలో ఒక్క శాతం మార్పు అమెరికా ప్రభుత్వంపై సుమారు 650 బిలియన్ డాలర్ల ప్రభావం చూపుతుందని, వడ్డీ రేట్లు తగ్గితే ప్రభుత్వ రుణాలపై భారం తగ్గడంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతం లభిస్తుందని అన్నారు.

సుంకాల దెబ్బకు అమెరికాలో ఫ్యాక్టరీల జాతర

మరోవైపు తాను తీసుకొచ్చిన దిగుమతి సుంకాల విధానాన్ని ట్రంప్ సమర్థించుకున్నారు. ఈ విధానం వల్ల అమెరికాలో తయారీ రంగం పుంజుకుంటోందని దేశవ్యాప్తంగా వేలాది కొత్త ఫ్యాక్టరీల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ అమెరికాలో పరిశ్రమలు పెట్టేందుకు కంపెనీలు ముందుకొస్తున్నాయనీ, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి దేశీయ తయారీని పెంచడమే తన లక్ష్యమని ట్రంప్ ముందు నుంచీ వాదిస్తున్నారు.

వడ్డీ రేట్లు తగ్గించడం సులభమేనా?

ఇక్కడే అసలు విషయం ఉంది. అమెరికా అధ్యక్షుడు కోరుకున్నంత మాత్రాన ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించలేదు. ఎందుకంటే ఆ సంస్థకు కొన్ని కీలక బాధ్యతలు ఉన్నాయి. ముఖ్యంగా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకుంటుంది.

వడ్డీ రేట్లు తగ్గితే వ్యాపార సంస్థలు, ప్రజలకు రుణాలు తీసుకోవడం సులభమవుతుంది. పెట్టుబడులు, ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే అదే సమయంలో ద్రవ్యోల్బణం కూడా పెరిగే ప్రమాదం ఉంది. అందుకే ఆర్థిక పరిస్థితులను అంచనా వేసిన తర్వాతే ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు తీసుకుంటుంది.

మొత్తానికి భారత్ సాధిస్తున్న ఆర్థిక వృద్ధిని ప్రస్తావిస్తూ అమెరికా జీడీపీని 20 శాతానికి తీసుకెళ్లవచ్చని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ప్రపంచ దేశాలు అమెరికా ఆర్థిక విధానాలను గమనిస్తున్న తరుణంలో,  భారత్‌ను ఉదాహరణగా చూపిస్తూ ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు మరోసారి అంతర్జాతీయంగా ఆసక్తి రేపుతున్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us