Video: వామ్మో.. సుడిగాలి దెబ్బకు టోల్ ప్లాజానే ఎగిరిపోయింది.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

హాలీవుడ్ సినిమాల్లో ఆకాశాన్ని తాకుతూ, దారిలో ఉన్న ఇళ్లను, కార్లను గాల్లోకి లేపేస్తూ దూసుకెళ్లే టోర్నడో సుడిగాలలను చూసే ఉంటారు. కానీ సరిగ్గా అలాంటి భీకర దృశ్యమే మన పక్కనే ఉన్న తమిళనాడు తూత్తుకుడిలో సంభవించింది. ఆకాశం నుండి భూమి వరకు సుడులు తిరుగుతూ వచ్చిన సుడిగాలి.. ఇళ్లను, టోల్ ప్లాజాలను, థీమ్ పార్కులను అతలాకుతలం చేసింది.

Video: వామ్మో.. సుడిగాలి దెబ్బకు టోల్ ప్లాజానే ఎగిరిపోయింది.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
Tornado In Tamilnadu

Updated on: Jun 22, 2026 | 8:36 PM

తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో భీకర వాతావరణ దృశ్యం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. ఆకాశాన్ని తాకుతూ సుడులు తిరుగుతూ వచ్చిన ఒక భారీ సుడిగాలి ఇళ్లు, రోడ్లు, టోల్ ప్లాజా, ఒక ప్రైవేట్ థీమ్ పార్క్‌ను అతలాకుతలం చేసింది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవ్వడంతో ఇదొక టోర్నడో అని ప్రచారం జరిగింది. ఆ సుడిగాలి అత్యంత వేగంగా కదులుతూ, దారిలో ఉన్న వస్తువులను గాల్లోకి లేపుకుంటూ వెళ్లడం చూసి జనం భయంతో పరుగులు తీశారు. ఈ భీకర గాలుల ప్రభావం తూత్తుకుడి నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాగైకుళం, ముడివైతనేందల్ గ్రామాల్లో తీవ్రంగా కనిపించింది. సుమారు 200 ఇళ్లు ఉన్న ఒక నివాస ప్రాంతంలో ఇళ్లపై ఉన్న రేకులు, ఫ్యాన్లు, ఇతర వస్తువులు గాల్లోకి కొట్టుకుపోయాయి. చెట్లు విరిగిపడ్డాయి, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.

థీమ్ పార్క్, టోల్ ప్లాజా ధ్వంసం.. కోట్లల్లో నష్టం..

వాగైకుళం టోల్ ప్లాజా సమీపంలో ఉన్న ఒక ప్రైవేట్ థీమ్ పార్క్ ఈ గాలుల ధాటికి తీవ్రంగా దెబ్బతింది. అక్కడి వినోద పరికరాలు, రైడ్స్ ధ్వంసమయ్యాయి. అలాగే టోల్ ప్లాజాలోని గ్లాస్ ప్యానెళ్లు, కంప్యూటర్ సిస్టమ్స్ విరిగిపోవడంతో అధికారులు తాత్కాలికంగా టోల్ వసూళ్లను నిలిపివేసి, వాహనాలను ఉచితంగా వదిలేశారు. ప్రాథమిక అంచనాల ప్రకారం నివాస ప్రాంతాల్లో రూ. 2 కోట్ల వరకు నష్టం వాటిల్లగా.. థీమ్ పార్క్, టోల్ ప్లాజా నష్టాలను కూడా కలిపితే మొత్తం రూ.5 కోట్ల నుండి రూ.6 కోట్ల వరకు నష్టం జరిగి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు.
ఒక మైదానంలో క్రికెట్ ఆడుకుంటున్న 9 మంది యువకులను ఈ గాలి ఏకంగా పైకి లేపేంత పనిచేసింది. దాంతో వారు ఒకరినొకరు గట్టిగా పట్టుకుని ఆ సుడిగాలి వెళ్ళిపోయే వరకు కింద కూర్చుండిపోయి ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.

ఇది టోర్నడో కాదు.. వాతావరణ శాఖ క్లారిటీ..

ఈ విజువల్స్ చూసి అందరూ టోర్నడో అని భ్రమపడినప్పటికీ.. చెన్నై ప్రాంతీయ వాతావరణ కేంద్రం దీనిని టోర్నడో కాదని స్పష్టం చేసింది. సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఒక తూర్పు పడమర ద్రోణి కారణంగా దక్షిణ తమిళనాడులో తీవ్రమైన ఉరుములు, మెరుపులతో కూడిన తుఫాను వ్యవస్థ ఏర్పడింది. ఈ సమయంలో క్యుములోనింబస్ మేఘాల కింద ఏర్పడిన అత్యంత శక్తివంతమైన అప్‌డ్రాఫ్ట్ వల్ల భూమిపై ఉన్న ధూళి, చెత్త అంతా కలిసి నిలువుగా తిరుగుతున్న స్తంభంలా ఆకాశంలోకి లేచింది.

నైరుతి రుతుపవనాల సమయంలో తూత్తుకుడి వంటి ప్రాంతాల్లో నిజమైన టోర్నడోలు ఏర్పడటానికి అవసరమైన వాతావరణ పరిస్థితులు ఉండవని, ఇది కేవలం లోకల్ కన్వెక్టివ్ వోర్టెక్స్ లేదా కేవలం ధూళి సుడిగాలి మాత్రమేనని నిపుణులు తేల్చి చెప్పారు. ఏదేమైనా రుతుపవనాల సమయంలో అకస్మాత్తుగా ఏర్పడే ఇలాంటి తుఫానుల వినాశకర శక్తికి ఈ ఘటనే ఒక నిదర్శనం.

Follow Us