
మన దేశ వంటకాల వైవిధ్యం గురించి ప్రపంచవ్యాప్తంగా ఎంత చెప్పుకున్నా తక్కువే. ఉత్తరాదిన పప్పు, రొట్టెలు లేనిదే ముద్ద దిగదు.. దక్షిణాదిన అన్నం, చేపల పులుసు, చికెన్ ముక్క పడాల్సిందే. కానీ మన దేశంలోనే ఒక విచిత్రమైన నగరం ఉంది. అక్కడ చికెన్, మటన్, చేపలు మాత్రమే కాదు.. కనీసం ఒక్క గుడ్డు అమ్మినా సరే చట్టప్రకారం నేరం. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది పక్కా నిజం. ఇంతకీ ఆ నగరం ఎక్కడుంది? అక్కడ అలాంటి కఠినమైన చట్టం ఎందుకు పెట్టారో తెలుసుకుందాం..
గుజరాత్ రాష్ట్రంలోని భావనగర్ జిల్లాలో ఉన్న పాలిటానా నగరంలో ఈ వింత చట్టం అమలులో ఉంది. ఇది జైన మతానికి చెందిన అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇక్కడి శత్రుంజయ కొండపై దాదాపు 800కు పైగా వందలాది జైన దేవాలయాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం ప్రపంచ నలుమూలల నుండి వేలాది మంది జైన భక్తులు, పర్యాటకులు ఈ పవిత్ర నగరానికి వస్తుంటారు.
జైనమతంలో అహింసకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఏ ప్రాణినీ చంపకూడదు, కనీసం మన వల్ల ఒక జీవికి కీడు జరగకూడదు అనేది వారి గట్టి నమ్మకం. ఈ నేపథ్యంలో పాలిటానా నగర పవిత్రతను కాపాడాలని, అక్కడ జంతువధను పూర్తిగా ఆపాలని జైన సన్యాసులు, స్థానికులు చాలా కాలం పాటు పెద్ద ఎత్తున పోరాటాలు, దీక్షలు చేశారు. సన్యాసుల డిమాండ్లను అంగీకరిస్తూ 2014లో గుజరాత్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పాలిటానా నగర పరిధిలో మాంసం, చేపలు, గుడ్ల అమ్మకాలపై పూర్తి నిషేధం విధిస్తూ చట్టం తెచ్చింది. దీంతో దేశంలోనే మాంసాహార ఉత్పత్తుల అమ్మకాలను చట్టబద్ధంగా పూర్తిగా నిషేధించిన మొట్టమొదటి, ఏకైక నగరంగా పాలిటానా రికార్డు సృష్టించింది.
ఈ చట్టం ప్రకారం కేవలం అమ్మకాలే కాదు.. నగర పరిధిలో జంతువులను వధించడం, మాంసానికి సంబంధించిన ఎలాంటి పరిశ్రమలు లేదా దుకాణాలు నడపడం కూడా పూర్తిగా చట్టవిరుద్ధం. దేశంలోని ఇతర నగరాల్లో గుడ్లు, నాన్-వెజ్ అనేది రోజువారీ ఆహారంలో భాగం అయినప్పటికీ.. పాలిటానా (బలితానా) వీధుల్లో మాత్రం ఇవి ఎక్కడా కనిపించవు. స్థానిక మున్సిపల్ అధికారులు, పోలీసులు ఈ నియమాలను ఎవరైనా ఉల్లంఘిస్తున్నారా లేదా అని నిరంతరం పర్యవేక్షిస్తుంటారు.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై అప్పట్లో కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. నగరంలో ఉండే ఇతర మతాల వారి ఆహారపు అలవాట్లను, వ్యక్తిగత స్వేచ్ఛను ఇది హరించడమే అని కొందరు వాదించినప్పటికీ.. పాలిటానా నగరం మాత్రం తన మత విశ్వాసాలు, సాంస్కృతిక గుర్తింపు విషయంలో ఇప్పటికీ దృఢంగా నిలబడింది.