
ప్రజల్లో కన్ను అదరడంపై రకరకాల మూఢనమ్మకాలు ఉన్నాయి. చైనాలో కూడా ఒక కన్ను అదరడం మంచిదని, మరో కన్ను అదరడం చెడు సంకేతమని నమ్ముతారు. ఇలాంటి ఒక మూఢనమ్మకాన్ని నమ్మి, తన కంటి చూపును కోల్పోయాడు. ఈ వింత సంఘటన మూఢనమ్మకాల పట్ల ప్రజలు ఎంత అంధ విశ్వాసంతో ఉన్నారో చూపించడమే కాకుండా, వైద్యపరమైన సమస్యలకు శాస్త్రీయ చికిత్స ఎంత అవసరమో హెచ్చరిస్తోంది. అసలేం జరిగింది?
నివేదికల ప్రకారం, చైనాకు చెందిన ఒక వ్యక్తికి కొన్ని రోజులుగా నిరంతరాయంగా కన్ను అదరడం ప్రారంభమైంది. దానిని సదరు వ్యక్తి అశుభ సంకేతంగా భావించాడు. ఆ అదురును ఎలాగైనా ఆపాలని అనుకున్నాడు. స్థానిక మూఢనమ్మకాల ప్రకారం కన్ను అదురుతున్నప్పుడు ముఖంపై లేదా కంటిపై కొట్టుకుంటే ఆ అరిష్టం తొలిగిపోతుందని నమ్మి, అతను తన ముఖంపై, కంటిపై చాలా బలంగా చెంపదెబ్బలు కొట్టుకున్నాడు.
ఆ కంటి అదురు ఆగకపోగా, కొద్దిసేపటికే అతనికి కంటి ముందు చీకటిగా మారడం, చూపు మసకబారడం ప్రారంభమైంది. భయంతో అతను ఆసుపత్రికి పరుగులు తీశాడు. అతన్ని పరీక్షించిన నేత్ర వైద్యులు (Ophthalmologists) షాక్‌కు గురయ్యారు. ఆ వ్యక్తి ముఖంపై అంత బలంగా కొట్టుకోవడం వల్ల, కంటి లోపల కాంతిని గ్రహించే ముఖ్యమైన పొర అయిన రెటినా తన స్థానం నుండి విడిపోయి ఊడి వచ్చింది. వైద్య పరిభాషలో దీనిని రెటినల్ డిటాచ్‌మెంట్ (Retinal Detachment) అంటారు. దీనికి అత్యవసరంగా శస్త్రచికిత్స చేయకపోతే కంటి చూపు శాశ్వతంగా పోయే ప్రమాదం ఉంది.
నిజానికి కన్ను అదరడం అనేది ఎటువంటి శకునాలకు సంబంధించింది కాదు. శరీరంలో అలసట, ఒత్తిడి (Stress), కంటిపై శ్రమ (Eye Strain), నిద్రలేమి, లేదా కెఫిన్ అధికంగా తీసుకోవడం వంటి సాధారణ శారీరక కారణాల వల్ల కంటి కండరాలు స్పందిస్తాయి. దీనిని వైద్యపరంగా మయోకీమియా (Myokymia) అంటారు. ఇది కాసేపట్లో లేదా కొన్ని రోజుల్లో దానంతట అదే తగ్గిపోతుంది. ఒకవేళ తగ్గకపోతే డాక్టర్‌ను సంప్రదించాలి. కానీ, ఇలాంటి వింత నమ్మకాలతో కళ్ల వంటి సున్నితమైన అవయవాలపై భౌతిక దాడులు చేసుకోవడం ప్రాణసంకటంగా మారుతుందని ఈ సంఘటన ద్వారా స్పష్టమవుతోంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..