
మన దేశంలో దీపావళి పండుగను పటాకులు పేలుస్తూ ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. అయితే కరోనా తర్వాత తగ్గిన పటాకుల సంఖ్య ఈ సంవత్సరం మళ్ళీ పెరిగింది. ఢిల్లీ వంటి రాజధానులలో గాలి చాలా కలుషితమైపోయింది, దీంతో అక్కడ కాలుష్యం తగ్గించేందుకు కృత్రిమ వర్షం కురిపించారు. ఇదిలా ఉండగా ఇంత కఠినమైన చట్టాలు ఉన్న సింగపూర్‌లో పటాకులు పేల్చిన ఆరోపణలపై ఒక భారతీయుడిని అరెస్టు చేశారు.
భారతీయులు ఎక్కడికి వెళ్లినా తమ ఆచారాలు, సంప్రదాయాలను కొనసాగించడానికి ప్రయత్నిస్తారు. అయితే అలాంటి ఆచారాలు, సంప్రదాయాలను పాటిస్తూనే అక్కడి స్థానిక చట్టాల గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే సింగపూర్‌లో దీపావళి జరుపుకుంటున్న సమయంలో బాణసంచా కాల్చారనే ఆరోపణలతో 39 ఏళ్ల భారత సంతతికి చెందిన వ్యక్తిపై బుధవారం కేసు నమోదైంది. ఇక్కడి నగరంలో బాణసంచా కాల్చడంపై నిషేధం ఉంది. దిలీప్ కుమార్ నిర్మల్ కుమార్ గత వారం ఇక్కడి కార్లైల్ రోడ్‌లోని బహిరంగ మైదానంలో బాణసంచా కాల్చారని ఆరోపణలు ఉన్నాయి. అతనిపై ఆయుధాలు, పేలుడు పదార్థాలు, ఆయుధ నియంత్రణ చట్టం 2021 కింద కేసు నమోదు చేశారు.
పటాకులు కాల్చే వీడియో ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. నివేదికల ప్రకారం పోలీసులు ఈ విషయంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా దిలీప్ కోర్టుకు హాజరయ్యారు. ఇక్కడ, అరెస్టు చేసిన వ్యక్తులను ఆన్‌లైన్‌లో కోర్టులో హాజరుపరుస్తారు. ఇప్పుడు నవంబర్ 20న విచారణ కోసం అతను మళ్ళీ కోర్టుకు హాజరు కావాలి. నిషేధిత పేలుడు పదార్థాలను చట్టవిరుద్ధంగా ఉపయోగించిన నేరానికి ఈ చట్టం ప్రకారం గరిష్టంగా ఐదు సంవత్సరాల జైలు శిక్ష, 100,000 సింగపూర్ డాలర్లు (77,000 యూఎస్ డాలర్లు) భారీ జరిమానా విధించే అవకాశం ఉంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి