Viral: వీడెవడో యమకింకరుడికి తమ్ముడిలా.. 50 మందిని చంపాడు.. ఆపై మొసళ్లకు ఆహారంగా..

దాదాపు 50 మందిని హత్య చేసిన సీరియల్‌ కిల్లర్‌ దేవేందర్‌ శర్మను ఎట్టకేలకు తాజాగా ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేసారు. తీహార్‌ జైలు నుంచి పెరోల్‌పై బయటికొచ్చి అదృశ్యమైన ఆయుర్వేద డాక్టర్‌ను ఆపరేషన్‌ నిర్వహించి పట్టుకున్నారు. దేవేందర్ శర్మ సీరియల్ కిల్లర్‌గా ఎలా మారాడో చూద్దాం. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Viral: వీడెవడో యమకింకరుడికి తమ్ముడిలా.. 50 మందిని చంపాడు.. ఆపై మొసళ్లకు ఆహారంగా..
Crocodile Attacks

Updated on: May 25, 2025 | 12:04 PM

1994లో గ్యాస్ డీలర్‌షిప్ ఒప్పందం కోసం ఓ కంపెనీలో 11 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాడు. ఒప్పందం విఫలం కావడంతో భారీగా అప్పలపాలయ్యాడు. ఆ మరుసటి సంవత్సరం నకిలీ గ్యాస్‌ ఏజెన్సీ ప్రారంభించాడు. ఎల్పీజీ సిలిండర్లను తీసుకెళ్తున్న ట్రక్కులను అడ్డగించి, ఆ డ్రైవర్లను చంపి సరకును ఎత్తుకెళ్లేవాడు. 1995-2004 మధ్య కాలంలో ఓ ముఠాను ఏర్పాటు చేసి ట్యాక్సీ డ్రైవర్లను లక్ష్యంగా చేసుకుని హత్యలు కొనసాగించాడు. ట్యాక్సీలను బుక్‌ చేయడం, ఆ డ్రైవర్లను చంపడం.. ఆ మృతదేహాలు దొరక్కుండా మొసళ్లకు ఆహారంగా పడేయడం, ఆ వాహనాలను ధ్వంసం చేసి మార్కెట్లో విక్రయించడం.. వంటి నేరాలను కొనసాగిస్తూ వచ్చాడు. ఆ తర్వాత అక్రమ అవయవాల వ్యాపారంలోకి ప్రవేశించాడు. చివరకు 2004లో కిడ్నీ రాకెట్‌ ఇంకా వరుస హత్య కేసుల్లో అతడిని పోలీసులు అరెస్టు చేశారు.

ఢిల్లీ, రాజస్థాన్‌, హర్యానాలో ఏడు కేసుల్లో అతడికి జీవిత ఖైదు పడగా.. గురుగ్రామ్‌ కోర్టు మరణశిక్ష విధించింది. తాజాగా ఓ ఆశ్రమంలో నకిలీ గుర్తింపుతో పూజారి మారువేషంలో ఉండగా అతడిని అరెస్టు చేసినట్లు డీసీపీ ఆదిత్య గౌతమ్‌ తెలిపారు. దేవేందర్‌ శర్మ పెరోల్‌పై బయటకు వచ్చి అదృశ్యం కావడం ఇదేం మొదటిసారి కాదు. 2020లో 20 రోజుల పెరోల్‌ గడువు ముగిసినా తిరిగి జైలుకు వెళ్లలేదు. ఆ తర్వాత ఏడు నెలలకు పోలీసులకు ఢిల్లీలో పట్టుబడ్డాడు. అనంతరం 2023 జూన్‌లో సరితా విహార్‌ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసులో అతడికి రెండు నెలల పెరోల్‌ మంజూరు కాగా.. 2023 ఆగస్టులో బయటకు వచ్చి అదృశ్యమయ్యాడు. దీంతో నెలల తరబడి గాలించిన పోలీసులు ఎట్టకేలకు అతడిని దౌసాలో అరెస్టు చేశారు.