హౌతీల దాడులతో ప్యాలెస్‌లు మారుతున్న సౌదీ ప్రిన్స్!

సౌదీ అరేబియాపై హౌతీలు తీవ్రస్థాయిలో దాడులు చేస్తున్నారు. రియాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రయోగించిన క్షిపణి దాడిలో కనీసం 13 మంది మరణించగా, మరో 300 మందికిపైగా గాయపడ్డారు. ఐదు రోజుల వ్యవధిలో ఈ విమానాశ్రయంపై నాలుగుసార్లు దాడులు జరిగాయి. దీంతో సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్‌ను ఒక ప్యాలెస్ నుంచి మరో ప్యాలెస్‌కు తరలి వెళ్తున్నారు. కట్టుదిట్టమైన భద్రత ఉన్న రాజభవనాలు, బంకర్లు ఉన్న ప్రాంతాల్లో ఆశ్రయం పొందుతున్నారు.

హౌతీల దాడులతో ప్యాలెస్‌లు మారుతున్న సౌదీ ప్రిన్స్!
Saudi Crown Prince Moving From Palace To Palace Amid Houthi Attacks

Updated on: Oct 13, 2026 | 9:49 AM

సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ చివరిసారిగా మంగళవారం ఓ జాతీయ రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయన బహిరంగంగా కనిపించలేదు. హౌతీ దాడుల ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో ఆయన కదలికలపై ప్రత్యేక భద్రతా బృందం నిఘా ఉంచింది.

పదేళ్లలోనే అత్యంత తీవ్ర దాడి?

శనివారం సౌదీ అరేబియాపై హౌతీలు తీవ్రస్థాయిలో దాడి చేసారు. రియాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రయోగించిన క్షిపణి దాడిలో కనీసం 13 మంది మరణించగా, మరో 300 మందికిపైగా గాయపడ్డారు. దాడిలో 28 ఏళ్ల ఈజిప్టు విమాన సహాయకురాలు మృతి చెందింది. పేలుడు కారణంగా ఆమె చేయి తెగిపడింది. మరికొందరు కూడా అవయవాలు కోల్పోయారు. ఐదు రోజుల వ్యవధిలో ఈ విమానాశ్రయంపై నాలుగుసార్లు దాడులు జరగడంతో కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేసారు.

ప్రతీకారం తప్పదంటున్న సౌదీ అరేబియా

హౌతీ దాడులపై సౌదీ అరేబియా తీవ్రంగా స్పందిస్తోంది. తమ ప్రతిస్పందన కూడా అంతే తీవ్రంగా ఉంటుందని సౌదీ ఇంధన మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్ హెచ్చరించారు. మరోవైపు, హౌతీలపై సౌదీ అరేబియా చేపట్టే దాడుల్లో అమెరికా కూడా పాల్గొనే అంశాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిశీలిస్తున్నారు. సౌదీ అరేబియా మిత్రదేశాలు కూడా తమ మద్దతును ప్రకటించాయి.

2022లో కుదిరిన కాల్పుల విరమణకు గండి

సౌదీ అరేబియా, యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారుల మధ్య ఘర్షణలు 2015లో ప్రారంభమయ్యాయి. యెమెన్ అంతర్యుద్ధంలో అక్కడి ప్రభుత్వానికి మద్దతుగా సౌదీ అరేబియా జోక్యం చేసుకోవడంతో పోరు తీవ్రరూపం దాల్చింది. 2022లో ఇరుపక్షాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ, ఈ ఏడాది జులైలో ఆ ఒప్పందం విచ్ఛిన్నం కావడం, ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ప్రాంతీయ ఉద్రిక్తతలు మరింత పెరగడం దాడులకు కారణంగా భావిస్తున్నారు.

ఇరాన్ మద్దతుతో హౌతీల దూకుడు

హౌతీ తిరుగుబాటుదారులకు ఇరాన్ మద్దతు ఉంది. అంతేకాదు.. మధ్య ఆసియా ప్రాంతంలో ఇరాన్‌కు మద్దతుగా నిలిచే అత్యంత ఆయుధ సంపత్తి కలిగిన గ్రూపుల్లో హౌతీలు ఒకరు. ఈ పరిణామాలపై ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ  ఆందోళన వ్యక్తం చేసారు. ఈ ఘర్షణల వల్ల ఇజ్రాయెల్‌కు మాత్రమే ప్రయోజనం చేకూరుతుందని వ్యాఖ్యానించారు. సైనిక చర్యలకే ప్రాధాన్యం ఇస్తూ రాజకీయ పరిష్కారాన్ని పట్టించుకోకపోవడం సమస్యను మరింత తీవ్రతరం చేస్తుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ హెచ్చరించారు. సౌదీ అరేబియా, హౌతీల మధ్య చర్చలు ప్రారంభించేందుకు తమ దేశం సహకరిస్తుందనీ అన్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us