
Kanchana Nair: దుబాయ్‌లో నివసిస్తున్న భారతీయ వ్యాపారవేత్త కాంచన నాయర్ ఈ సాహసానికి శ్రీకారం చుట్టారు. దుబాయ్ రన్ 2026లో ఆమె ఎరుపు రంగు చీర, ఆకుపచ్చ బ్లౌజ్ ధరించి 10 కిలోమీటర్ల పరుగులో పాల్గొన్నారు.
యూఏఈ జాతీయ పతాకంలోని రంగులను ప్రతిబింబించేలా ఆమె ఎరుపు, ఆకుపచ్చ రంగు చీర ధరించారు. త్వరలో యూఏఈ 55వ జాతీయ దినోత్సవానికి ముందుగానే ఆ దేశానికి తనదైన శైలిలో నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా కాంచన తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. యూఏఈ తనకు రెండో ఇల్లు అని, ఆ దేశం తనకు ఎన్నో అవకాశాలు, అనుభవాలు అందించిందని తెలిపారు. తన మూలాలు భారత్‌లో ఉన్నప్పటికీ యూఏఈ ఎప్పటికీ తన హృదయంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుందని చెప్పారు. ఇది ఆమెకు తొలి దుబాయ్ రన్ కాదు. 2026తో కలిపి ఇప్పటికే ఐదుసార్లు పాల్గొన్నారు. అయితే ఈసారి చీరకట్టులో 10 కిలోమీటర్లు పరుగెత్తడం ప్రత్యేకంగా నిలిచింది. ఆమె పరుగు వీడియోకు ఇన్‌స్టాగ్రామ్‌లో 5 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.
కాంచన సాహసం ఇక్కడితో ఆగలేదు. అంతకుముందు నవంబర్ 1న జరిగిన దుబాయ్ రైడ్ 2026లోనూ ఆమె ప్రత్యేకంగా నిలిచారు. కేరళ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సంప్రదాయ కేరళ చీరకట్టులో సైకిల్ తొక్కుతూ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అయితే ఇక్కడే ఆసక్తికర విషయం ఏంటంటే ఆమెకు సొంతంగా సైకిల్ లేదు. గత ఏడాది దుబాయ్ రైడ్‌లో పాల్గొనాలని భావించినప్పటికీ రిజిస్ట్రేషన్ గడువు ముగియడంతో అవకాశం కోల్పోయారు. ఈసారి మాత్రం అలాంటి పరిస్థితి రాకూడదని ముందుగానే పేరు నమోదు చేసుకున్నారు. కార్యక్రమానికి కొద్దిరోజుల ముందు గులాబీ రంగు సైకిల్ కొన్నారు. ఆమెకు మరో సవాలు ఎదురైంది. 26 ఏళ్లుగా ఆమె సైకిల్ తొక్కలేదు. అయినప్పటికీ వెనక్కి తగ్గలేదు. ముందుగా తాను నివసించే అపార్ట్మెంట్ కారిడార్లోనే చీరకట్టుతో సైకిల్ తొక్కడం ప్రాక్టీస్ చేశారు. ఆ తర్వాత నేరుగా దుబాయ్ రైడ్‌లో పాల్గొన్నారు. 26 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ సైకిల్ తొక్కడం ఎలాంటి ఇబ్బందీ ఎదురుకాలేదని చెప్పారు. పైగా సైకిల్ తొక్కుతూ పాటలు కూడా పాడానని తన అనుభవాన్ని పంచుకున్నారు. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది.
కాంచనకు క్రమశిక్షణ, వ్యాయామం కొత్తేమీ కాదు. కాలేజీ రోజుల్లో ఆమె NCCలో ఎయిర్ వింగ్ క్యాడెట్‌గా పనిచేశారు. 2004లో ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొనడం ఆమె జీవితంలో మరిచిపోలేని అనుభవం.
ప్రస్తుతం ఆమె ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. దుబాయ్‌లోని పార్కుల చుట్టూ క్రమం తప్పకుండా పరుగెత్తుతుంటారు. సంచారి యూఏఈ ట్రావెల్ గ్రూప్ రన్నింగ్ టీమ్‌లో ఆమె సభ్యురాలు. హాఫ్ మారథాన్‌లో పాల్గొన్నారు. 2024లో ఫ్లూ జ్వరం నుంచి కోలుకున్న తర్వాత రోజూ 5 కిలోమీటర్లు పరుగెత్తే ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. మొదట్లో ఎక్కువ దూరం నడవాల్సి వచ్చినప్పటికీ క్రమంగా తన వేగాన్ని పెంచుకున్నారు. ఒక్కరోజు కూడా మిస్ కాకుండా ఆ ఛాలెంజ్‌ను పూర్తి చేశారు.
కాంచన నాయర్ 14 ఏళ్ల క్రితం యూఏఈకి వెళ్లారు. అక్కడ పలు సంస్థల్లో పనిచేసిన తర్వాత రెండేళ్ల క్రితం అజ్మాన్‌లో రియల్ ఎస్టేట్ కంపెనీ స్థాపించారు. మరోవైపు నటనపైనా ఆసక్తి చూపిస్తున్నారు. వ్యాపారం, నటన, ప్రయాణాలతో పాటు ఫిట్‌నెస్‌కు కూడా సమయం కేటాయిస్తున్నారు.
2017లో ప్రారంభమైన దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్‌లో భాగంగా 30 రోజుల పాటు ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు శారీరక వ్యాయామం చేయాలని ప్రజలను ప్రోత్సహిస్తున్నారు. నవంబర్ 22న జరిగిన దుబాయ్ రన్లో 5, 10 కిలోమీటర్ల మార్గాలలో 3.10 లక్షల మందిపాల్గొన్నారు. సాధారణంగా ఇలాంటి పరుగుల్లో స్పోర్ట్స్ దుస్తులు ధరించడం సహజం. కానీ కాంచన మాత్రం చీరకట్టుతోనే అందరి దృష్టిని ఆకర్షించారు.
26 ఏళ్ల తర్వాత సైకిల్ తొక్కడం నుంచి చీరకట్టులో 10 కిలోమీటర్లు పరుగెత్తడం వరకు ప్రతి అడుగులోనూ ఆత్మవిశ్వాసాన్ని చాటుకున్నారు కాంచన నాయర్. తన మూలాలు కేరళలో ఉన్నా యూఏఈని రెండో ఇల్లుగా భావించే కాంచన, ఈ రెండు ప్రాంతాలపై ప్రేమను వినూత్నంగా చాటుకోవడం విశేషం.