
పర్యాటకానికి ప్రపంచ ప్రసిద్ధి చెందిన థాయ్‌లాండ్‌లో దశాబ్దాలుగా సాగుతున్న ఓ వివాదాస్పద సంస్కృతి ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విదేశీ పర్యాటకుల కోసం స్థానిక మహిళలను నిర్ణీత కాలానికి అద్దె భార్యలుగా మార్చే దందా అక్కడ వేగంగా విస్తరిస్తోంది. పట్టాయా కేంద్రంగా సాగే ఈ వ్యవహారంపై రచయిత్రి లా వెరిటే ఇమ్మాన్యుయెల్ రాసిన థాయ్‌లాండ్స్ టాబూ: ది రైజ్ ఆఫ్ వైఫ్ రెంటల్ ఇన్ మోడర్న్ సొసైటీ అనే పుస్తకం వెలుగులోకి రావడంతో ఈ చేదు నిజాలు మరోసారి ప్రపంచం దృష్టికి వచ్చాయి.
థాయ్‌లాండ్‌లో ఈ తాత్కాలిక వివాహ పద్ధతిని స్థానికంగా వైఫ్ ఫర్ హైర్ లేదా బ్లాక్ పెర్ల్ అని పిలుస్తుంటారు. ఇది చట్టబద్ధమైన వివాహం కాదు. కేవలం పర్యాటకుడికి, మహిళకు మధ్య జరిగే ఒక ప్రైవేట్ కాంట్రాక్ట్. ఒప్పందం కుదిరిన సమయం ఆ మహిళ సదరు పర్యాటకుడితో భార్యలాగే కలిసి జీవిస్తుంది. గైడ్‌గా వ్యవహరించడం, వంట చేయడం, ఇంటి పనులు చూడటం సహా దాంపత్య విధులను నిర్వర్తిస్తుంది. ఒకవేళ పర్యాటకుడికి ఆమె నచ్చితే, ఒప్పందం ముగిసిన తర్వాత ఆమెను శాశ్వతంగా వివాహం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది.
ఈ అద్దె భార్యల వెనుక తీవ్రమైన ఆర్థిక అసమానతలు, కుటుంబ పోషణ భారాలే ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. థాయ్‌లాండ్‌లోని మారుమూల గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుపేద యువతులు, మహిళలు ఉపాధి కోసం పట్టాయా, బ్యాంకాక్ వంటి నగరాలకు వస్తున్నారు. నైట్‌క్లబ్‌లు, రెడ్‌లైట్ ఏరియాలు, బార్లలో పనిచేస్తూ.. మంచి క్లయింట్లు లభించినప్పుడు భారీ మొత్తం కోసం ఇలా అద్దె భార్యలుగా మారుతున్నారు.
ఈ వ్యాపారంలో మహిళల వయస్సు, అందం, విద్యార్హతలు, సమయాన్ని బట్టి రేట్లు నిర్ణయిస్తున్నారు. నివేదికల ప్రకారం.. ఈ తాత్కాలిక వివాహ ఒప్పందం కోసం పర్యాటకులు దాదాపు 1,600 డాలర్ల నుంచి ఏకంగా 1,16,000 డాలర్ల వరకు (భారత కరెన్సీలో లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు) చెల్లిస్తున్నారు. జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాల్లో కంపానియన్‌షిప్ సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ, థాయ్‌లాండ్‌లో ఇది సంపూర్ణ వైఫ్ ఫర్ హైర్ కల్చర్‌గా రూపాంతరం చెంది పెద్ద వ్యాపారంగా మారింది.
తీరికలేని జీవనశైలి, ఒంటరితనం పెరుగుతుండటంతో చాలామంది పర్యాటకులు దీర్ఘకాలిక బంధాల కంటే ఇలాంటి తాత్కాలిక ఏర్పాట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే థాయ్‌లాండ్‌లో ప్రస్తుతం ఈ పద్ధతిని నియంత్రించేందుకు స్పష్టమైన ప్రత్యేక చట్టాలు లేవు. పర్యాటక రంగం మాటున సాగుతున్న ఈ అనధికారిక దందా దేశ ప్రతిష్టను దెబ్బతీస్తోందని గుర్తించిన థాయ్ ప్రభుత్వం, దీనిపై ప్రత్యేక చట్టాలు తెచ్చి నియంత్రించాల్సిన అవసరం ఉందని భావిస్తోంది.