
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాకతో క్లిష్టమైన పనులను కూడా సులువుగా పూర్తి చేస్తున్నాం. పుణెకు చెందిన ఓ మహిళ తన ఇంటి ఆస్తికి సంబంధించిన పేరు మార్పు ప్రక్రియను ఏఐ సాయంతో పూర్తి చేసి ఆశ్చర్యపరిచారు. ఇందుకోసం ఓ లాయర్ రూ.1.5 లక్షలు ఖర్చవుతుందని చెప్పగా.. ఆమె మాత్రం కేవలం రూ 2,432తోనే ఆ పని పూర్తి చేసారు.
పుణెకు చెందిన 38 ఏళ్ల విదులా బెంబాల్కర్ ఐటీ రంగంలో 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు. మూడేళ్ల క్రితం ఆమె భర్త మరణించారు. ఇటీవల పుణెలోని పింప్రి-చించ్‌వాడ్ ప్రాంతంలో ఉన్న ఆమె ఆస్తి డెవలప్‌మెంట్ పనులకు సంబంధించిన పత్రాలను సిద్ధం చేస్తున్న సమయంలో ఓ సమస్య ఎదురైంది. ఆస్తి పన్ను రికార్డుల్లో తన భర్త పేరును తొలగించి, తన పేరు మీద మార్చుకోవాల్సి వచ్చింది. ఇందుకోసం న్యాయవాదిని సంప్రదించగా.. ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి రూ.1.5 లక్షలు ఖర్చవుతుందని చెప్పినట్లు విదులా వెల్లడించారు.
అంత పెద్ద మొత్తాన్ని ఖర్చు చేయడం ఇష్టం లేని విదులా మరో మార్గం కోసం ప్రయత్నించారు. చాట్‌జీపీటీ, గూగుల్ జెమినీ ఏఐ టూల్స్‌ను సంప్రదించారు. ఆస్తి పన్ను రికార్డుల్లో పేరు మార్చుకోవడానికి అనుసరించాల్సిన విధానం ఏమిటి? ఏయే పత్రాలు అవసరం? ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అడిగి తెలుసుకున్నారు. ఏఐ టూల్స్ సూచనలను అనుసరిస్తూ ఆన్‌లైన్‌లోనే ప్రక్రియను పూర్తి చేశారు. ఆస్తి రికార్డుల్లో పేరు మార్చుకోవడానికి విదులా భర్త మరణ ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, ఇండెక్స్ II డాక్యుమెంట్, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) పత్రాలను సమర్పించారు. మున్సిపల్ ఆన్‌లైన్ పోర్టల్‌లోకి లాగిన్ అయి, ఆధార్ వివరాలను అనుసంధానం చేయగానే తన ఆస్తికి సంబంధించిన సమాచారం ఆటోమేటిక్‌గా కనిపించిందని ఈ పోర్టల్ సులభంగా ఉందని ఆమె చెప్పారు. అంతేకాదు, దరఖాస్తు ఏ దశలో ఉందో ఆన్‌లైన్‌లోనే తెలుసుకునే అవకాశం ఉందన్నారు. తన దరఖాస్తును పరిశీలిస్తున్న అధికారి ఎవరు? దరఖాస్తు పరిశీలన సమయంలో అధికారులు ఏమని వ్యాఖ్యానించారు? వంటి వివరాలను కూడా ఆమె ఆన్‌లైన్‌లో ట్రాక్ చేయగలిగారు. ఆశ్చర్యంగా ఇందుకోసం కేవలం 10 నిమిషాలు మాత్రమే పట్టిందట. ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజుల రూపంలో రూ.2,432 మాత్రమే ఖర్చు చేసినట్లు విదులా తెలిపారు.
ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన కొన్ని ప్రక్రియలు కష్టంగా ఉంటాయి. వాటిని ఎలా పూర్తి చేయాలో తెలియక చాలామంది భయపడతారు. దీంతో మధ్యవర్తులు లేదా ఇతరులపై ఆధారపడతారు. ఏఐ టూల్స్ క్లిష్టమైన విధానాలను సులువైన భాషలో వివరించడం ద్వారా సామాన్యులకు ఎంతో సహాయపడతాయని విదుల అన్నారు. సరైన సమాచారం అందుబాటులో ఉంటే చాలా మంది తమ పనులను తామే చేసుకోవచ్చని తెలిపారు. రూ.1.5 లక్షలు ఖర్చవుతుందని భావించిన పనిని కేవలం రూ.2,432తో పూర్తిచేయడంతో ఏఐని సరైన విధంగా ఉపయోగించుకుంటే సమయం, డబ్బు ఆదా అవుతుందని ఈ ఘటన నిరూపిస్తోంది.