
అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం ఈరీ నగరంలో అక్టోబర్ 9న దారుణ ఘటన చోటుచేసుకుంది. సాయంత్రం 5 గంటల సమయంలో పెర్రీ స్ట్రీట్‌లోని ఓ నివాసంలో కాల్పులు జరిగాయి. మొదట ఇంటి బయట ఇద్దరు మహిళలపై కాల్పులు జరిపిన నిందితుడు, ఆ తర్వాత ఇంట్లోకి ప్రవేశించి మరికొందరిపై కాల్పులు జరిపాడు. అనంతరం నిందితుడు ఇంట్లోనే ఉండిపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో స్వాట్ (SWAT) ప్రత్యేక పోలీసు బృందాలు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
కాల్పుల ఘటన అనంతరం నిందితుడు తనకు తానే తుపాకీతో కాల్చుకుని మరణించాడు. తాము ఎదుర్కొన్న హృదయవిదారక ఘటనల్లో ఇదొకటని ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం విషాదకరమని, ఘటనకు సంబంధించిన పరిస్థితులు కూడా ఆందోళన కలిగిస్తున్నాయని పోలీసు ఛీఫ్ రిక్ లోరా విచారం వ్యక్తం చేశారు. అసలు ఏం జరిగింది? కాల్పులకు దారితీసిన పరిస్థితులు ఏమిటి? పూర్తిగా తెలుసుకోవడానికి దర్యాప్తు బృందాలకు మరింత సమయం అవసరమని చెప్పారు.
పెన్సిల్వేనియా గవర్నర్ జోష్ షాపిరో ఈ ఘటనను తీవ్ర విషాదం కలిగించిన సామూహిక కాల్పుల ఘటనగా అభివర్ణించారు. ఈరీ నగర మేయర్ డరియా డెవ్లిన్‌తో ఫోన్‌లో మాట్లాడిన ఆయన.. బాధితుల కుటుంబాలకు అండగా ఉంటామని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అమెరికాలో తుపాకుల వినియోగం, వాటిపై కఠినమైన నియంత్రణలు విధించే విషయంలో రాజకీయ, చట్టపరమైన అడ్డంకులు చాలాకాలంగా చర్చనీయాంశంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సామూహిక కాల్పుల ఘటనలు మళ్లీ మళ్లీ చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. పెన్సిల్వేనియాలో జరిగిన ఈ ఘటనతో మరోసారి తుపాకీ నియంత్రణపై చర్చ మొదలైంది.