కీర్తి రిచ్‌మండ్ విల్లాస్‌లో రికార్డు ధరకు గణేశ్ లడ్డూ వేలం! చరిత్ర తిరగరాసింది..

హైదరాబాద్‌లోని గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో లడ్డూ వేలం పాటలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. బాలాపూర్ లడ్డూ వేలానికి దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్నప్పటికీ, ఇటీవలి కాలంలో రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని బండ్లగూడ జాగీర్ కీర్తి రిచ్‌మండ్ విల్లాస్ లడ్డూ వేలం సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ ఏడాది కూడా వినాయక చవితి వేడుకల ముగింపు సందర్భంగా నిర్వహించిన వేలం పాటలో రిచ్‌మండ్ విల్లాస్ గణేశ్ లడ్డూ రికార్డు స్థాయిలో రూ. కోటికి పైగా పలికి సరికొత్త చరిత్ర తిరగరాసింది.

కీర్తి రిచ్‌మండ్ విల్లాస్‌లో రికార్డు ధరకు గణేశ్ లడ్డూ వేలం! చరిత్ర తిరగరాసింది..
Keerthi Richmond Villas Ganesh Laddu

Updated on: Sep 24, 2026 | 9:24 AM

హైదరాబాద్ బండ్లగూడ జాగీర్‌లోని కీర్తి రిచ్‌మండ్ విల్లాస్‌లో గణేశ్ చతుర్థి వేడుకల్లో భాగంగా నిర్వహించిన లడ్డూ వేలం పాట సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇక్కడి వినాయకుడి లడ్డూ రికార్డు స్థాయిలో వేలంలో రూ. కోటికి పైగా ధర పలికి అందరినీ ఆశ్చర్యపరిచింది. విల్లాస్ నివాసితులు పోటాపోటీగా వేలంలో పాల్గొని భక్తిశ్రద్ధలతో ఈ లడ్డూను దక్కించుకున్నారు. రిచ్‌మండ్ విల్లాస్ ప్రాంగణంలో గణేశ్ నిమజ్జనానికి ముందు నిర్వహించిన ఈ లడ్డూ వేలంలో విల్లా నివాసితులు ఎంతో ఉత్సాహంతో, భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. భక్తుల మధ్య హోరాహోరీగా సాగిన ఈ వేలం పాటలో లడ్డూ ధర క్షణక్షణం పెరుగుతూ అత్యధిక ధరకు చేరుకుంది.

వేలంలో విల్లాస్ సభ్యులు గ్రూపులుగా ఏర్పడి పోటీపడి మరీ ఈ పవిత్రమైన ప్రసాదాన్ని దక్కించుకున్నారు. శక్తిమాన్‌ టీమ్‌ రూ.1.01 కోట్లకు దక్కించుకుంది. అయితే గత మూడు సంవత్సరాలతో పోలిస్తే ఈసారి ధర తగ్గింది. 2024లో రూ.1.87 కోట్లు, 2025లో రికార్డు స్థాయిలో రూ.2.31 కోట్లు పలికిన లడ్డూ ఈ ఏడాది రూ,1.01 కోట్లకు చేరింది. కాగా.. లడ్డూ వేలంలో సమకూరే నిధులను ఆర్పీ దియా చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. విల్లాస్‌లో పనిచేసే పనిమనుషులు, డ్రైవర్లు, స్థానిక పేద కుటుంబాల పిల్లల పాఠశాల ఫీజులను ఈ నిధుల నుంచే చెల్లిస్తారు. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడే పేదలకు ఉచిత వైద్య సహాయం అందిస్తారు. వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు, ఇతర స్వచ్ఛంద సంస్థలకు నేరుగా ఆర్థిక సాయం అందిస్తారు.

2018లో కేవలం రూ. 25 వేలతో ప్రారంభమైన రిచ్‌మండ్ విల్లాస్ లడ్డూ వేలం, ఏటికేడు ఊహించని రీతిలో పెరుగుతూ వస్తోంది. భక్తితో పాటు సామాజిక బాధ్యతను కూడా జోడించడంతో ఈ వేలం పాటకు విశేష ఆదరణ లభిస్తోంది. కేవలం పండుగ జరుపుకోవడమే కాకుండా, లడ్డూ వేలం ద్వారా వచ్చిన కోట్లాది రూపాయల నిధులను సమాజ శ్రేయస్సు కోసం వినియోగిస్తూ కీర్తి రిచ్‌మండ్ విల్లాస్ నివాసితులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us