భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం

ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల పరిరక్షణ, అంతర్జాతీయ చట్టాల అమలు కోసం కృషి చేసిన భారత సంతతి మహిళ నవనీతం నవీ పిళ్లైకు 2026 నోబెల్ శాంతి బహుమతి లభించింది. న్యాయం కోసం పోరాడుతూ, బాధితులకు అండగా నిలిచిన ఆమె దక్షిణాఫ్రికాలోని తమిళ మూలాలున్న కుటుంబంలో జన్మించి, న్యాయవాదిగా తన ప్రయాణాన్ని ప్రారంభించి, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు.

భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
Indian Origin Navanethem Pillay Awarded Nobel Peace Prize

Updated on: Oct 09, 2026 | 10:57 PM

చిన్నప్పటి నుంచే సమాజంలోని అన్యాయాన్ని, వివక్షకు ప్రశ్నించిన ఆమె న్యాయవాది వృత్తిని ఎంచుకున్నారు. దక్షిణాఫ్రికాలో వర్ణవివక్షకు వ్యతిరేకంగా పోరాడిన కార్యకర్తలకు న్యాయ సహాయం అందించారు. ఆమె సొంతంగా న్యాయ సంస్థను ప్రారంభించారు. అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించి డాక్టర్ ఆఫ్ జ్యురిడికల్ సైన్స్ డిగ్రీని పొందారు. న్యాయ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుని 1995లో దక్షిణాఫ్రికా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

రువాండా కేసుల్లో కీలక పాత్ర

1999లో రువాండా క్రిమినల్ ట్రిబ్యునల్‌లో న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆ ట్రిబ్యునల్‌కు అధ్యక్షత కూడా వహించారు. యుద్ధాలలో లైంగిక హింస, అత్యాచారాలను అంతర్జాతీయ నేరాలుగా గుర్తించడంలో ఆమె చేసిన కృషి ఎంతో ఉంది.  అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులోనూ న్యాయమూర్తిగా పనిచేశారు. అంతర్జాతీయ స్థాయిలో తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారిని చట్టం ముందు నిలబెట్టారు.

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగంలో సేవలు

2008 నుంచి 2014 వరకు నవీ పిళ్లై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్‌గా పనిచేశారు. పదవిలో ఉన్న సమయంలో ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల ఉల్లంఘనలపై తన గళాన్ని వినిపించారు. బాధితులకు న్యాయం అందించడం, ప్రభుత్వాలు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించేలా చూడటం పై దృష్టి సారించారు. పాలస్తీనా భూభాగం గాజాపై ఇజ్రాయెల్‌ జరిపిన మారణకాండ సందర్భంగా ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన స్వతంత్ర  విచారణ కమిషన్‌కు ఆమె అధ్యక్షత వహించారు. అలాగే, మయన్మార్‌లో రోహింగ్యాలపై జరిగి దాడులకు సంబంధించిన విచారణలో 2019లో అంతర్జాతీయ న్యాయస్థానంలో తాత్కాలిక న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

నోబెల్ శాంతి పురస్కారానికి ఎంపిక

అంతర్జాతీయ చట్టాలను గౌరవించడం, మానవ హక్కులను కాపాడటం, హింసకు గురైన వారికి న్యాయం అందించడం కోసం నవీ పిళ్లై చేసిన కృషిని నోబెల్ కమిటీ గుర్తించింది. రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు తమ చర్యలకు జవాబుదారీగా ఉండాలని, హింసతో పాటు ఘర్షణల వల్ల నష్టపోయిన బాధితులకు న్యాయం జరగాలని ఆమె పోరాడారు. వర్ణవివక్షకు వ్యతిరేకంగా పోరాడిన నెల్సన్ మండేలా వంటి నాయకుల స్ఫూర్తితో ముందుకు సాగిన ఆమె అంతర్జాతీయ న్యాయ సూత్రాల పట్ల తన నిబద్ధతను నిరంతరం చాటుకున్నారు. ఈ అంశాలే ఆమెకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయని నోబెల్ కమిటీ తెలిపింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం కూడా ఆమెకు నోబెల్ శాంతి పురస్కారం దక్కిన విషయాన్ని స్వాగతించింది.

న్యాయం కోసం సాగిన సుదీర్ఘ ప్రయాణం

నవీ పిళ్లై న్యాయం, సమానత్వం, మానవ హక్కుల కోసం పోరాడారు. వివక్షకు వ్యతిరేకంగా బాధితులకు అండగా నిలిచిన న్యాయవాదిగా ప్రారంభమైన ఆమె ప్రస్థానం.. అంతర్జాతీయ న్యాయస్థానాలు, ఐక్యరాజ్యసమితి వంటి ప్రపంచ స్థాయి సంస్థల్లో కీలక బాధ్యతలు చేపట్టే స్థాయికి చేరింది. చట్టం ముందు అందరూ సమానమేనని, ఎవరూ అతీతులు కారనే సందేశాన్ని తన చేతలతో చాటిచెప్పిన నవీ పిళ్లై అంతర్జాతీయ న్యాయ రంగంలో తనదైన ముద్ర వేశారు.

Loading...
Unable to load recommendations.
Follow Us