అయ్యబాబోయ్.. ఈ పాము ఎట్టా వేటాడుతుందో తెలిస్తే గుండెలు గుభేల్..

సాధారణంగా పాములు నేల మీద పాకుతూ వేటాడుతాయని మనకు తెలుసు. కానీ ప్యూర్టో రికోలోని చీకటి గుహల్లో ఒక వింతైన దృశ్యం కనిపిస్తుంది. అక్కడ ఉండే ప్యూర్టో రికన్ బోవా అనే పాములు.. గుహ పైకప్పుల నుండి గాలిలో నిశ్శబ్దంగా వేలాడుతూ అటుగా ఎగిరి వెళ్లే గబ్బిలాలను మెరుపు వేగంతో వేటాడుతున్నాయి.

అయ్యబాబోయ్.. ఈ పాము ఎట్టా వేటాడుతుందో తెలిస్తే గుండెలు గుభేల్..
Puerto Rican Boa Snake

Updated on: Mar 13, 2026 | 4:45 PM

ప్రకృతి మనల్ని ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. సాధారణంగా పాములు నేల మీదో లేదా చెట్ల మీదో వేటాడుతుంటాయి. కానీ ప్యూర్టో రికోలోని లోతైన సున్నపురాయి గుహల్లో నివసించే ప్యూర్టో రికన్ బోవా అనే పాములు మాత్రం ఎవరూ ఊహించని రీతిలో గాలిలో ఎగిరే గబ్బిలాలను వేటాడుతున్నాయి. ఈ అరుదైన వేట పద్ధతిని చూసి శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోతున్నారు.

ఆకాశంలో కాదు.. గుహ పైకప్పు నుండి

ఈ చీకటి గుహలు వేలాది గబ్బిలాలకు నిలయం. ముఖ్యంగా యాంటిలియన్ దెయ్యం ముఖం గల గబ్బిలాలు, సూటీ మీసాల గబ్బిలాలు ఇక్కడ గుంపులు గుంపులుగా నివసిస్తుంటాయి. వీటిని వేటాడేందుకు ప్యూర్టో రికన్ బోవా ఒక వినూత్న పద్ధతిని ఎంచుకుంది. పరిశోధకుల పరిశీలన ప్రకారం.. సుమారు రెండు మీటర్ల పొడవు పెరిగే ఈ విషరహిత పాములు తమ తోకలతో గుహ పైకప్పులోని రాతి పగుళ్లను గట్టిగా పట్టుకుంటాయి. ఆ తర్వాత తమ శరీరాన్ని గాలిలోకి వదిలేసి కిందకు వేలాడుతూ నిశ్శబ్దంగా వేచి చూస్తాయి.

క్షణాల్లో దాడి.. ఊపిరి ఆడని బిగింపు

గబ్బిలాలు గుహ ద్వారాల గుండా వేగంగా ఎగిరి వెళ్తున్నప్పుడు.. ఈ బోవా పాము తన అద్భుతమైన టెక్నిక్‌తో వాటిని గాలిలోనే నోటితో పట్టుకుంటుంది. పట్టుకున్న వెంటనే తన శక్తివంతమైన శరీరంతో గబ్బిలాన్ని గట్టిగా చుట్టేస్తుంది. ఈ తీవ్రమైన ఒత్తిడి వల్ల గబ్బిలం శ్వాస తీసుకోలేక ప్రాణాలు వదులుతుంది. ఆ తర్వాత పాము దానిని ఆహారంగా తీసుకుంటుంది.

వైవిధ్యమైన ఆహారపు అలవాట్లు

కేవలం గబ్బిలాలు మాత్రమే కాకుండా ఈ బోవా పాములు బల్లులు, పక్షులు, ఎలుకలను కూడా తింటాయి. గుహల్లోని తేమతో కూడిన వాతావరణంలో బొద్దింకలు, కీటకాలు, మంచినీటి పీతలు వంటివి ఉన్నప్పటికీ గబ్బిలాల వేట మాత్రం ఈ జాతి యొక్క ప్రత్యేకమైన మనుగడ తెలివితేటలను చాటి చెబుతోంది. ‘‘ఈ వేట పద్ధతి గుహ పర్యావరణ వ్యవస్థల సంక్లిష్టతను తెలియజేస్తుంది. పరిమిత వాతావరణంలో కూడా జంతువులు తమను తాము ఎలా మలుచుకుంటాయో చెప్పడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ” అని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. చీకటి గుహల్లో నిశ్శబ్దంగా సాగే ఈ పోరాటం ప్రకృతిలోని మరో అద్భుతమైన రహస్యం.

Follow Us