రాత్రిపూట సూర్మరశ్మి వెలుగులు.. స్కైరూట్‌ ఏరోస్పేస్‌తో అమెరికా సంస్థ ఒప్పందం

రాత్రి వేళల్లో పగలు లాగా సూర్యరశ్మి మనపై ప్రసరిస్తే ఎలా ఉంటుంది? విద్యుత్‌ సదుపాయం లేని పల్లెల్లో, విపత్తులు సంభవించినప్పుడు సహాయక చర్యలకు వెలుతురు లభిస్తే? అమెరికా అంతరిక్ష సంస్థ రిఫ్లెక్ట్ ఆర్బిటల్ భూమి చుట్టూ తిరిగే ఉపగ్రహాలకు భారీ అద్దాలను అమర్చి, వాటి ద్వారా సూర్యరశ్మిని భూమిపైకి మళ్లించాలని చూస్తోంది. ఇందుకు భారత్‌ కు చెందిన స్కైరూట్‌ ఏరోస్పేస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.

రాత్రిపూట సూర్మరశ్మి వెలుగులు.. స్కైరూట్‌ ఏరోస్పేస్‌తో అమెరికా సంస్థ ఒప్పందం
Giant Mirrors Could Bring Sunlight To Cities At Night

Updated on: Oct 17, 2026 | 10:19 PM

ఈ ప్రాజెక్టు కోసం అమెరికాలోని రిఫ్లెక్ట్‌ ఆర్బిటల్‌ సంస్థ  భారత అంతరిక్ష స్టార్టప్‌ స్కైరూట్‌ ఏరోస్పేస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. స్కైరూట్‌ అభివృద్ధి చేస్తున్న విక్రమ్‌-1 రాకెట్‌ ద్వారా మొదటి ప్రయోగం చేపడతారు. విక్రమ్‌-1యూ (Vikram-1U) వాహనంలోని మొదటి దశకు అదనపు బూస్టర్లను అమర్చి రెండవ ప్రయోగం నిర్వహిస్తారు. భూమిపై రాత్రి సమయాల్లో అవసరమైన ప్రాంతాలకు అంతరిక్షం నుంచి వెలుతురును అందించడం దీని ప్రధాన లక్ష్యం. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే విపత్తుల సమయంలో సహాయక చర్యలు చేపట్టడం నుంచి సౌర విద్యుత్‌ ఉత్పత్తి సమయాన్ని పెంచడం వరకు అనేక రంగాల్లో ఉపయోగపడే అవకాశం ఉంది.

అంతరిక్షం నుంచి సూర్యరశ్మి ఎలా వస్తుంది?

సాధారణంగా సూర్యుడు అస్తమించిన తర్వాత భూమిపై చీకటి కమ్ముకుంటుంది. అప్పుడు వీధి దీపాలు, ఇతర విద్యుత్‌ దీపాల ద్వారా వెలుతురు పొందుతాం. అయితే రిఫ్లెక్ట్‌ ఆర్బిటల్‌ ప్రణాళిక మాత్రం భిన్నంగా ఉంది. భూమి చుట్టూ కక్ష్యలో తిరిగే ఉపగ్రహాలకు పెద్ద అద్దాలను అమర్చి, సూర్యరశ్మిని భూమిపై నిర్దిష్ట ప్రాంతాల వైపు మళ్లిస్తుంది.  రాత్రి సమయంలోనూ ఎంపిక చేసిన ప్రాంతాలకు అవసరమైనప్పుడు వెలుతురును అందించడం, అవసరం లేనప్పుడు నిలిపివేయడం, దాని తీవ్రతను అడ్జస్ట్ చేయడం వంటివి చేస్తారు.

ఐదు కిలోమీటర్ల పరిధిలో వెలుతురు!

ఈ ఉపగ్రహాల ద్వారా భూమిపై ఐదు కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతానికి సూర్యరశ్మి వెలుతురు అందుతుంది. ఈ సాంకేతికత అందుబాటులోకి వస్తే  రక్షణ రంగంలో కీలకమైన ప్రాంతాలకు వెలుతురు అందించడానికి వీలవుతుంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సహాయక బృందాలు చీకట్లో బాధితుల కోసం వెతకాల్సి రాకుండా అంతరిక్షం నుంచి వెలుతురు అందించగలిగితే గాలింపు, సహాయక చర్యలకు సహాయపడుతుంది .

సౌర విద్యుత్‌ ఉత్పత్తికి కూడా ఉపయోగం?

సౌర విద్యుత్‌ కేంద్రాలు సూర్యరశ్మి ఉన్నప్పుడే విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. రాత్రి సమయంలో సూర్యకాంతి అందుబాటులో ఉండదు కాబట్టి సాధారణ సోలార్‌ ప్యానెల్స్‌ విద్యుత్‌ ఉత్పత్తి చేయలేవు. అయితే, అంతరిక్షంలోని అద్దాల ద్వారా సూర్యరశ్మిని సోలార్‌ పానెల్స్‌ వైపు మళ్లిస్తే రాత్రిపూట కూడా విద్యుత్‌ ఉత్పత్తి చేయవచ్చనే ఆలోచన ఉంది. కానీ వాస్తవంగా ఎంత మేరకు విద్యుత్‌ ఉత్పత్తి చేయగలుగుతారు? అద్దాల నుంచి వచ్చే వెలుతురు సాధారణ సూర్యరశ్మితో పోలిస్తే ఎంత ప్రభావవంతంగా ఉంటుంది? అనే అంశాలు పరీక్షల్లో తేలాల్సి ఉంది.

1993లోనూ ఇలాంటి ప్రయోగం.. ఏమైంది?

అంతరిక్షం నుంచి సూర్యరశ్మిని భూమిపైకి మళ్లించాలనే ఆలోచన ఇప్పటిది కాదు. 1993లో రష్యా శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు ‘జ్నామ్యా’ (Znamya) పేరుతో ఓ ప్రయోగం నిర్వహించారు. 65 అడుగుల పొడవున్న అద్దాన్ని అంతరిక్షంలోకి పంపించారు. అద్దం సూర్యరశ్మిని భూమిపైకి మళ్లిస్తూ కదిలే వెలుతురు కిరణాన్ని సృష్టించింది. ప్రయోగం విజయవంతమైనప్పటికీ, నిధుల కొరత కారణంగా ప్రాజెక్టును కొనసాగించలేకపోయారు. ఇప్పుడు రిఫ్లెక్ట్‌ ఆర్బిటల్‌ ఈ ఆలోచనను ఆచరణలోకి తీసుకొస్తోంది.

పర్యావరణ సంస్థల అభ్యంతరాలు

అంతరిక్షం నుంచి రాత్రిపూట వెలుతురు అందించాలనే ప్రాజెక్ట్ పై పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో కృత్రిమ వెలుతురు వన్యప్రాణుల సహజ జీవన విధానాన్ని దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు. భూమ్మీద జంతువులు, పక్షులు రాత్రి పగలు మార్పులకు అనుగుణంగా తమ కాలచక్రాన్ని కొనసాగిస్తాయనీ రాత్రి వెలుతురు వాటి ఆహార అన్వేషణ, వలసలు, సంతానోత్పత్తి పై ప్రభావం పడొచ్చని అంటున్నారు. మనుషుల నిద్రకు, శరీర జీవ గడియారానికి  కూడా రాత్రిపూట వెలుతురు అంతరాయం కలిగిస్తుంది.

రాత్రిపూట సూర్యరశ్మి సాధ్యమేనా?

ఎన్నో సవాళ్లను దాటుకుని రిఫ్లెక్ట్‌ ఆర్బిటల్‌ ప్రాజెక్టు అంతరిక్షంలోని అద్దాల ద్వారా సూర్యరశ్మిని భూమిపైకి మళ్లించగలిగితే అద్భుతాలు జరగొచ్చు. అదే సమయంలో వన్యప్రాణుల జీవన విధానం చెదిరిపోకుండా, మానవ ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావాలు పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం కీలకం.

Loading...
Unable to load recommendations.
Follow Us