
ఎల్‌నినో ప్రభావం రానున్న నెలల్లో మరింత బలపడనుందని ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) తెలిపింది. 2026 అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో మధ్య, తూర్పు ఉష్ణమండల పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకోవచ్చని అంచనా వేసింది. ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు, పర్యావరణ వ్యవస్థలు, ఆర్థిక వ్యవస్థలు, ప్రజల జీవనంపై ప్రభావం చూపనుంది. 13 ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ వాతావరణ కేంద్రాల అంచనాలను సమీక్షించిన తర్వాత ఈ నివేదికను రూపొందించారు.
ఎల్‌నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలోని భూమధ్యరేఖకు సమీప ప్రాంతాల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా పెరగడం వల్ల ఏర్పడే సహజ వాతావరణ పరిణామం. దీని కారణంగా గాలుల దిశ, వాతావరణ పీడనం, వర్షపాతం వంటి అంశాల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ మార్పులు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల వాతావరణంపై ప్రభావం చూపుతాయి. సాధారణంగా ప్రతి రెండు నుంచి ఏడేళ్లకు ఒకసారి ఎల్‌నినో ఏర్పడుతుంది. దీని ప్రభావం 9 నుంచి 12 నెలల పాటు కొనసాగుతుంది. ఎల్‌నినోకు వ్యతిరేకంగా పనిచేసే వాతావరణ దశను ‘లా నినా’ అంటారు. ఈ రెండింటి మధ్య సాధారణ పరిస్థితులు కూడా ఉంటాయి.
ఎల్‌నినో ఇప్పటికే బలంగా ఏర్పడిందని, దాని తీవ్రత వేగంగా పెరుగుతోంది. 2027 ఫిబ్రవరి వరకు ఎల్‌నినో కొనసాగే అవకాశం ఉందనీ ఇది 1950 తర్వాత నమోదైన అత్యంత బలమైన ఎల్‌నినో ఘటనల్లో ఒకటి కావచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం సముద్రాలు గతంలో ఎన్నడూ లేనంత వేడిగా ఉండటంతో, విడుదలయ్యే వేడి పరిమాణం కూడా ఎక్కువగా ఉంటుంది.
ఎల్‌నినో ప్రభావంతో ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయి. అదే సమయంలో వర్షాలు కురిసే తీరులో మార్పులు వస్తాయి. ఫలితంగా కొన్ని ప్రాంతాల్లో వర్షాభావం, నీటి కొరత, పంట నష్టం తీవ్రమవుతాయి. మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదల ప్రమాదం పెరుగుతుంది. మధ్య అమెరికాలో ఇప్పటికే ఎల్‌నినో ప్రభావం కనిపిస్తోంది. అక్కడ కరువు కారణంగా పంటలు ఎండిపోయి, జంతువులు కూడా ప్రాణాలు కోల్పోతున్నాయి.సాధారణంగా ఎల్‌నినో ప్రభావం నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది.
గతంలో ఏర్పడిన ఎల్‌నినో కూడా ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరిగేలా చేసింది. 2023 సంవత్సరం రికార్డుల్లో రెండో అత్యంత వేడి సంవత్సరంగా నిలవగా, 2024 అత్యంత వేడి సంవత్సరంగా నమోదైంది. 2024లో ప్రపంచ సగటు ఉష్ణోగ్రత పారిశ్రామిక విప్లవానికి ముందు ఉన్న 1850-1900 సగటుతో పోలిస్తే సుమారు 1.55 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా. ఎల్‌నినో సహజ వాతావరణ పరిణామమే అయినప్పటికీ, గ్లోబల్ వార్మింగ్ దాని ప్రభావాన్ని తీవ్రతరం చేస్తోంది.