
నేపాల్‌లో సంభవించిన జలప్రళయం ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపడమే కాక, చిన్నారులను అనాథలుగా మార్చింది. ఆ ప్రకృతి ప్రకోపం జరిగి నాలుగు రోజులు గడుస్తున్నా, ఆనాటి భయానక దృశ్యాలు ఇంకా కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయి. ఆ విపత్తుకు సంబంధించిన ఓ హృదయ విదారక వీడియో ప్రస్తుతం చూసేవారిని కంటతడి పెట్టిస్తోంది.
నేపాల్ లో వరదల నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఓ వీడియో అందరి హృదయాలను కలచివేస్తోంది. ప్రస్తుతం అక్కడ ఆప్తుల ఆచూకీ కోసం ఎదురుచూస్తున్న బాధితుల రోదనలే వినిపిస్తున్నాయి. ఇలాంటి దుర్భర పరిస్థితుల మధ్య, ఇద్దరు పసిపిల్లలు నిస్సహాయంగా తల్లితండ్రుల కోసం వెతుకుతున్న వీడియో ఎవరినైనా కంటతడి పెట్టిస్తుంది.
నేపాల్ లో వరద ప్రభావిత ప్రాంతంలో ఓ చిన్నారి తన చెల్లెలిని వీపుపై మోసుకుంటూ అత్యంత నీరసంగా నడుస్తున్న వీడియో కలచివేస్తోంది. కష్టకాలంలో ఆ చెల్లిని దగ్గరకు హత్తుకుని ఓదారుస్తూ నడుస్తున్న తీరు చూస్తుంటే, ప్రకృతి ప్రకోపం ఎంతటి దారుణమైన విషాదాన్ని మిగుల్చుతుందో ఇట్టే అర్థమవుతుంది. కనిపించకుండా పోయిన తమ తల్లిదండ్రుల ఆచూకీ కోసమే ఆ పసివాళ్లు వెతుకుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆ ప్రాంతంలో అధికారులు వరద బాధితుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
Heartbreaking Visual from Nepal 💔
Little boy caring his younger sister 🥹 and finding their parents 😭.
Look at the pain and scratches on their faces. 💔💔💔 pic.twitter.com/oREDLzii6g
— Jeet (@JeetN25) August 30, 2026
నేపాల్‌ను వరదలు అతలాకుతలం చేసిన సమయంలో వెలుగు చూసిన ఈ వీడియో, ప్రకృతి విపత్తులు చిన్నారుల జీవితాలపై చూపే దుష్ప్రభావాన్ని ప్రపంచానికి కళ్లకు కట్టినట్లు చూపించింది. అయితే, వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఆ బాలుడు నిజంగానే తన తల్లిదండ్రుల ఆచూకీ కోసం వెతుకుతున్నాడా లేక వేరే కారణం ఏదైనా ఉందా అనే అంశంపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది, అధికారిక ధ్రువీకరణ వెలువడాల్సి ఉంది.
నెట్టింట వైరలవుతున్న ఆ వీడియోపై నెటిజన్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. అభాగ్యులైన ఆ చిన్నారులు అంత నిస్సహాయంగా తిరుగుతుంటే వారికి సాయం చేయడం మానేసి, వీడియో తీస్తున్న వ్యక్తి తీరును తప్పుపడుతూ మండిపడుతున్నారు.
మరికొందరు స్పందిస్తూ, తోబుట్టువుల మధ్య ఉండే అనుబంధానికి ఇది నిలువెత్తు నిదర్శనమని, ఆ చిన్న భుజాలు ఎంత పెద్ద బాధ్యతను మోస్తున్నాయో అని కంటతడి పెడుతున్నారు. వారి కళ్లలోని భయం, వేదన చూస్తుంటేనే గుండె తరుక్కుపోతోందని భావోద్వేగ పోస్టులు షేర్ చేస్తున్నారు. అయితే, ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నఈ వీడియో ప్రామాణికతను టీవీ9 నిర్ధారించడం లేదు అని ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాం.