బంధువులను సాగనంపేందుకు వందేభారత్ ఎక్కిన 12 మంది.. అంతలో డోర్లు క్లోజ్! ఆ తర్వాత సీన్‌ ఇదే

ఓ రైల్వే స్టేషన్‌లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. బంధువులకు వీడ్కోలు చెప్పేందుకు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలులోకి వెళ్లిన 12 మంది ఆటోమేటిక్ డోర్లు మూసుకుపోవడంతో అందులోనే చిక్కుకుపోయారు. దీంతో రైలు వారిని ఇటావా జంక్షన్ వరకు తీసుకెళ్లింది. అక్కడ రైల్వే పోలీసులు వారిని సురక్షితంగా కిందకు దించారు. అయితే అనుమతి లేకుండా రైలులోకి ప్రవేశించినందుకు ఒక్కొక్కరికి రూ.3 వేల చొప్పున మొత్తం రూ.36 వేల జరిమానా విధించారు. అసలు ఏం జరిగిందంటే? పూర్తి వివరాలు తెలుసుకుందాం..

బంధువులను సాగనంపేందుకు వందేభారత్ ఎక్కిన 12 మంది.. అంతలో డోర్లు క్లోజ్! ఆ తర్వాత సీన్‌ ఇదే
12 People Trapped Inside Vande Bharat Express

Updated on: Nov 24, 2026 | 9:00 AM

కాన్పూర్, నవంబర్ 24: రైల్వే స్టేషన్‌లో బంధువులకు వీడ్కోలు చెప్పేందుకు వెళ్లిన 12 మంది అనూహ్యంగా వందేభారత్ రైలులో చిక్కుకుపోయారు. రైలు ఆటోమేటిక్ తలుపులు మూసుకుపోవడంతో వారంతా బయటకు దిగలేకపోయారు. దీంతో చేసేదేమీ లేక రైలుతోపాటే ప్రయాణించాల్సి వచ్చింది. చివరకు రైల్వే అధికారులు వారిని మరో స్టేషన్‌లో కిందకు దించి, ఒక్కొక్కరికి రూ.3 వేల చొప్పున జరిమానా విధించారు. ఈ ఆసక్తికర ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటుచేసుకుంది.

అసలేం జరిగిందంటే..?

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ సెంట్రల్ రైల్వే స్టేషన్‌కు చెందిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం వారణాసి నుంచి న్యూఢిల్లీకి బయలుదేరిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ 22415)లో 12 మంది తమ బంధువులకు వీడ్కోలు చెప్పేందుకు వచ్చారు. రైలు బయలుదేరే ముందు కుటుంబ సభ్యులు సర్దుకోవడానికి సహాయం చేయాలనే ఉద్దేశంతో వారంతా రైలులోకి ఎక్కారు. అయితే వారు తిరిగి దిగేలోపే రైలు ఆటోమేటిక్ తలుపులు మూసుకుపోయాయి. ఆధునిక వందేభారత్ రైళ్లలో ఈ తలుపులు నిర్ణీత స్టేషన్లలో మాత్రమే తెరుచుకునేలా ఏర్పాటు చేశారు. దీంతో కాన్పూర్ సెంట్రల్ స్టేషన్‌లోనే దిగాల్సిన 12 మంది రైలులో చిక్కుకుపోయారు.

రైలు కదలడంతో ప్లాట్‌ఫామ్‌పై ఉన్న వారి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. రైలులో ఉన్నవారు తలుపులు తెరవాలని సిబ్బందిని కోరినప్పటికీ, రైలు ప్రయాణంలో ఉండగా భద్రతా నిబంధనలు, సాంకేతిక పరిమితుల కారణంగా వెంటనే తలుపులు తెరవడం సాధ్యం కాలేదు. ఈ క్రమంలో కొందరు ప్రయాణికులు తమ అసహనాన్ని కూడా వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ ఘటనను గుర్తించిన రైలు సిబ్బంది వెంటనే తుండ్లా రైల్వే కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించారు. కంట్రోల్ రూమ్ ఆదేశాల మేరకు వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఉదయం సుమారు 10.49 గంటలకు ఇటావా జంక్షన్‌లో నిలిపివేశారు. సమాచారం అందుకున్న ఇటావా జంక్షన్ స్టేషన్ సూపరింటెండెంట్ పీఎం మీనా, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) ఇన్‌స్పెక్టర్ దినేశ్ కుమార్ సింగ్, ప్రభుత్వ రైల్వే పోలీస్ (GRP) ఇన్‌స్పెక్టర్ యదువీర్ సింగ్ పోలీసు సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. ఆర్పీఎఫ్, జీఆర్పీ సంయుక్త బృందం రైలులో చిక్కుకున్న 12 మందిని సురక్షితంగా కిందకు దించింది. అనంతరం వారిని ఆర్పీఎఫ్ పోలీస్ పోస్టుకు తీసుకెళ్లి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఒక్కొక్కరికి రూ.3 వేల జరిమానా

రైలులోకి సరైన అనుమతి లేకుండా ప్రవేశించడం, రైల్వే నిబంధనలను ఉల్లంఘించిన అంశాలపై అధికారులు చర్యలు తీసుకున్నారు. రైల్వే వాణిజ్య విభాగం ఒక్కొక్కరి నుంచి రూ.3 వేల చొప్పున జరిమానా వసూలు చేసింది. దీంతో మొత్తం 12 మందికి కలిపి రూ.36 వేల జరిమానా పడింది. జరిమానా వసూలు చేసిన అనంతరం, భవిష్యత్తులో సరైన టికెట్ లేదా అనుమతి లేకుండా రైళ్లలోకి ప్రవేశించవద్దని అధికారులు హెచ్చరించి వారిని పంపించారు. ఆధునిక రైళ్లలో భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ ఆటోమేటిక్ డోర్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా వందేభారత్ వంటి రైళ్లలో ప్రయాణికుల భద్రత కోసం ప్రత్యేక నిబంధనలు అమల్లో ఉంటాయి. కాబట్టి బంధువులకు వీడ్కోలు చెప్పేందుకు వెళ్లినా సరైన అనుమతి లేకుండా రైళ్లలోకి ఎక్కకూడదని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది. చిన్న నిర్లక్ష్యం కూడా ఇబ్బందులకు, భారీ జరిమానాలకు దారితీయవచ్చని రైల్వే అధికారులు హెచ్చరిస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us