కోక్ తాగుతూ ఆరోగ్యంగా 101 ఏళ్లు.. దీర్ఘాయుష్షు రహస్యమా?

ఆరోగ్యంగా ఉండాలంటే శీతల పానీయాలకు దూరంగా ఉండాలని చెబుతుంటారు. కానీ చైనాకు చెందిన 101 ఏళ్ల వృద్ధుడు లూ షిజెంగ్ అలవాట్లు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. షిజెంగ్ రోజూ కోకాకోలా, స్ప్రైట్ తో పాటు సీ ఫుడ్‌ తింటారు. అయినప్పటికీ ఆరోగ్యంగా ఉండటంతో అతని జీవనశైలి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

కోక్ తాగుతూ ఆరోగ్యంగా 101 ఏళ్లు.. దీర్ఘాయుష్షు రహస్యమా?
Coke Sprite And Seafood Are 101 Year Old China Mans Favourites

Updated on: Oct 14, 2026 | 9:11 PM

చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌కు చెందిన 101 ఏళ్ల లూ షిజెంగ్‌కు శీతల పానీయాలు అంటే చాలా ఇష్టం.  చల్లని స్ప్రైట్‌, కోకాకోలాలో కొన్ని చుక్కల వైట్ వైన్ కలుపుకుని తాగడం ఆయనకు మరింత ఇష్టమట.  పుచ్చకాయ, పియర్స్, మాండరిన్ పండ్లను ఇష్టంగా తింటారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపేవారు సాధారణంగా చక్కెర ఎక్కువగా ఉండే పానీయాలకు దూరంగా ఉంటారు. కానీ లూ షిజెంగ్  కోక్, స్పైట్ ఉన్న ఆహారం తీసుకోవడం ఎలా సాధ్యమంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ప్రతి ఐదు రోజులకు మార్కెట్‌కు వెళ్లి..

లూ షిజెంగ్ ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. గ్రామీణ ప్రాంతంలో నివసించే ఆయన ప్రతి ఐదు రోజులకు ఒకసారి రిక్షాలో స్థానిక మార్కెట్‌కు వెళ్లి తాజా చేపలు, రొయ్యలు, పీతలు, పంది మాంసం, కూరగాయలు కొనుగోలు చేస్తారు. గత ఏడాది వరకు స్వయంగా సైకిల్ పై మార్కెట్‌కు వెళ్లేవారు. అయితే ఒకసారి కిందపడటంతో కుటుంబ సభ్యులు ఆయనను ట్రైసైకిల్ లో వెళ్లాలని సూచించారు.  లూ షిజెంగ్‌కు ఇద్దరు కుమారుల్లో ఒకరు బీజింగ్‌లో నివసిస్తుండగా, మరొకరు సమీపంలో ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నారు. తండ్రి అవసరాలను చూసుకునేందుకు ఇటీవల ఓ సంరక్షకురాలిని ఏర్పాటు చేశారు.

ఒకేసారి ప్లేట్ నిండా పీతలు తినేస్తారు!

లూ షిజెంగ్‌ ఒక పూట భోజనంలో సగం గిన్నె అన్నంతో పాటు ప్లేట్ నిండా పీతలను ఇష్టంగా లాగించేస్తారనీ  సంరక్షకురాలు చెప్పారు.  ఇంట్లోని ఫ్రిజ్‌లో ఎప్పుడూ శీతల పానీయాలు అందుబాటులో ఉంటాయి. ఆహారం కోసం ఖర్చు చేస్తూ తనకు నచ్చిన ఆహారాన్ని తింటూ  దైనందిన జీవితాన్ని కొనసాగిస్తున్నారు.

రాత్రి 8 గంటలకే నిద్ర..

లూ షిజెంగ్ ఆహారపు అలవాట్లే కాదు.. నిద్రపోయే సమయాలూ ఆసక్తికరం. ప్రతి రోజూ సాయంత్రం 5 గంటలకల్లా రాత్రి భోజనం పూర్తి చేస్తారు. రాత్రి 8 గంటలకు నిద్రపోతారు. తెల్లవారుజామున 4 గంటలకే మెలకువ వస్తుంది. 6 గంటలకు మంచం దిగుతారు. మధ్యాహ్నం కాసేపు నిద్రపోతారు. తన ఆరోగ్యం బాగానే ఉందని, గతంలో కిందపడిన ఘటన నుంచి కోలుకున్నానని, చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకునేంత మానసిక చురుకుదనం ఉందని చెప్పారు. చాలా అరుదుగా జలుబు చేస్తుందని, రక్తపోటు కూడా తక్కువేనని తెలిపారు.

వందేళ్లు దాటిన వారికి నెలకు రూ.9 వేలు భత్యం

 

చైనాలో వందేళ్లు దాటిన వృద్ధులకు ప్రభుత్వం 120 డాలర్ల నెలవారీ భత్యం అందిస్తోంది. భారత కరెన్సీలో ఇది రూ.10,000కు సమానం. 90 నుంచి 99 ఏళ్ల మధ్య వయసున్నవారికి నెలకు 100 యువాన్లు చెల్లిస్తారు. లూ షిజెంగ్ జీవనశైలిపై సోషల్ మీడియాలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కోక్ తాగుతూ కూడా 101 ఏళ్లు జీవించడం ఆశ్చర్యమని కొందరు అంటుంటే.. సంతోషంగా జీవించడం, కంటి నిండా నిద్ర దీర్ఘాయువుకు కారణాలై ఉండొచ్చని మరికొందరు అభిప్రాయపడ్డారు.  వ్యక్తుల శరీర తత్వం, జన్యుపరమైన అంశాలు, జీవన పరిస్థితులు కూడా ఆయుష్షును ప్రభావితం చేస్తాయని మరికొందరు అన్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us