భక్తులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఇకపై యాదాద్రి వెళ్లడం మరింత సులభం.. జస్ట్‌ 60నిమిషాల్లోనే

ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి భక్తులకు గుడ్ న్యూస్. యాదాద్రి ఎంఎంటీఎస్ ప్రాజెక్టు పనులు త్వరలో పట్టాలెక్కనున్నాయి. ఏప్రిల్ మొదటి వారంలో ప్రధాని నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభించేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. రెండున్నరేళ్లలో పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

భక్తులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఇకపై యాదాద్రి వెళ్లడం మరింత సులభం.. జస్ట్‌ 60నిమిషాల్లోనే
Yadadri Mmts Project

Edited By:

Updated on: Mar 22, 2026 | 2:55 PM

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాన్ని మాజీ సీఎం కేసీఆర్ కోట్లాది రూపాయలతో ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దారు. ఆలయ ఉద్ఘటన తర్వాత యాదగిరిగుట్టకు భక్తుల తాకిడి ఎక్కువైంది. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని సాధారణ రోజుల్లో 40 నుండి 50వేలకు పైగా శని, ఆదివారం, సెలవు దినాల్లో లక్ష మంది వరకు భక్తులు దర్శించుకుంటున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు యాదగిరిగుట్టకు వస్తున్నారు. యాదగిరిగుట్టకు ట్రైన్ సౌకర్యం లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది భక్తులు ప్రజా రవాణా వ్యవస్థ ఆర్టీసీ, సొంత వాహనాల్లోనూ వస్తున్నారు.

ఈ క్రమంలోనే యాదగిరిగుట్టకు ఎంఎంటీఎస్‌ రైళ్లను నడపాలని భక్తులు కొన్నేళ్లుగా డిమాండ్‌ చేస్తున్నారు. భక్తుల కోసం ఘట్‌కేసర్‌ వరకు ఉన్న ఎంఎంటీఎస్‌ సేవలను రాయగిరి రైల్వే స్టేషన్‌ వరకు విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రైల్వేలైన్‌ నిర్మాణానికి 2016లో ప్రణాళికలు సిద్ధం చేసినా పట్టాలెక్కలేదు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దర్శించుకోవడానికి ఆర్టీసీ బస్సులు ప్రైవేట్ వాహనాల ద్వారా యాదగిరిగుట్టకు చేరుకోవడం ఇబ్బందిగా ఉంది.

సికింద్రాబాద్‌ నుంచి ఘట్‌కేసర్‌ వరకూ ఎంఎంటీఎస్‌ రెండో దశ కింద 21కిలోమీటర్ల రైల్వే లైను నిర్మిస్తున్నారు. ఘట్‌కేసర్‌ నుంచి యాదాద్రి (రాయగిరి) వరకూ మరో 33 కి.మీ. రెండో దశను పొడిగించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావించాయి. ఇందుకు 330 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని అంచనా వేశాయి. భూమి, వనరులు, అవసరమైన నిధులను అందజేసేందుకు గత ప్రభుత్వం నిరాకరించింది. దీంతో ఇది పెండింగ్ జాబితాలో పడింది. చివరకు రైల్వేశాఖే సొంత నిధులతో ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ముందుకు వచ్చింది.

ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం పలు దఫాలుగా నిధులు కేటాయించింది. దీంతో సికింద్రాబాద్ నుంచి చర్లపల్లి, ఘట్కేసర్ మీదుగా రాయగిరి వరకు 33 కి.మీ. మేర రూ.430 కోట్ల అంచనాలతో నిర్మించనున్నారు. కొత్తలైన్లను నిర్మించడంతో పాటు అవసరమైన చోట్ల డబ్లింగ్, విద్యుదీకరణ, రైల్వేస్టేషన్ల నిర్మాణం, ఆధునికీకరణ తదితర పనులు చేపట్టనున్నారు.

ఇప్పటికే ఈ ప్రాజెక్టు ట్రెండర్లు దక్కించుకున్న రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్) రాయగిరి వరకు భూసేకరణ సైతం పూర్తి చేశారు. ఈ ప్రాజెక్టు పనులను ఏప్రిల్ నెలలో రాష్ట్ర పర్యటనకు రానున్న ప్రధాని మోదీ చేతుల మీదుగా పనులను ప్రారంభించేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది.

ఈ మార్గంలో ఎంఎంటీఎస్ రైళ్లు అందుబాటులోకి వస్తే భక్తులకు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనం మరింత సులభతరం కానుంది. తక్కువ చార్జీలతోనే ప్రయాణికులు రాకపోకలు సాగించచ్చు. రాయగిరి వరకు ఎంఎంటీఎస్లో వెళ్లి అక్కడి నుంచి 4 కి.మీ. రోడ్డు మార్గంలో యాదాద్రికి చేరుకోవచ్చు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us